వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దాడులు చేస్తామని అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తుండగా.. తాము తగ్గేదేలా అనే విధంగా ఇరాన్ యుద్ధానికి రెడీ అవుతోంది. పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ నిమగ్నమైంది. ఇలాంటి తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని తొలగిస్తే.. అంటూ కామెంట్స్ చేయడం కొత్త చర్చకు దారి తీసింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరాన్‌లో పాలన మార్పు తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్నలకు రూబియో స్పందిస్తూ.. ‘ఇరాన్‌లో ఎవరు అధికారం చేపడతారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వం ఎన్నోఏళ్ల నుంచి పాతుకుపోయి ఉంది. అక్కడున్న అధికారులు, సైన్యం.. ఖమేనీ ఆదేశాల మేరకే నడుచుకుంటారు. సుప్రీం లీడర్, పాలన పడిపోతే.. అక్కడ తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్నకు బదులివ్వడం కష్టం. ఇరాన్‌లో పాలన ఖమేనీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో పాటు ఎన్నికైన వ్యక్తుల మధ్య విభజించి ఉంది. ఇది వెనెజువెలా కంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదురైతే దానిపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పశ్చిమాసియా అంతటా అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయాలనే ట్రంప్ నిర్ణయాన్ని రూబియో సమర్థించారు. అమెరికన్ బలగాలు, భాగస్వాములపై దాడి చేసేందుకు ఇరాన్ సామర్థ్యాన్ని కూడగట్టుకుంటుందన్నారు.
BREAKING: 🚨🇺🇸🇮🇷 Marco Rubio warns that no one knows who will lead Iran after Khamenei. pic.twitter.com/yNmCeqsms4
— Globe Observer (@_GlobeObserver) January 29, 2026
మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అణు ఒప్పందంపై చర్చలకు రాని పక్షంలో ఇరాన్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడతామని వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందం అందరికీ మేలు చేస్తుంది. భారీగా యుద్ద నౌకలు ఇరాన్‌వైపు వెళుతున్నాయి. సమయం లేదు. ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్‌కు మరోసారి చెబుతున్నా. ఇరాన్ చర్చలకు రాకపోతే గతంలో కంటే భీకరస్థాయిలో దాడులు చేస్తాం.. నాశనం తప్పదని హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమను యుద్ధం దిశగా నెడితే.. గతంలో ఎన్నడూ చేయని స్థాయిలో దాడి చేస్తామంది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అమెరికా దాడి నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ నిమగ్నమైంది.


