ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్/బాగ్దాద్: బద్ధ శత్రువు ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి దాడుల హెచ్చరికలు చేశారు. అణ్వాయుధాల్లో వినియోగం కోసం కొనసాగిస్తున్న అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తక్షణం నిలిపేయాలని ఇరాన్‌కు సూచించారు. మాట వినకపోతే మారణహోమం తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌పెట్టారు.
‘‘ భారీ స్థాయిలో యుద్ధనౌకలు, సైన్యం ఇరాన్ దిశగా కదులుతోంది. అత్యంత శక్తివంత ఆయుధాలతో, ఉత్సకతతో, సదుద్దేశంతో సాయుధులు ఇరాన్ వైపుగా వెళ్తున్నారు. ప్రతిష్టాత్మక యుద్ధ విమాన వాహకనౌక ‘అబ్రహాం లింకన్’ ఈ బలగాలకు సారథ్యం వహిస్తోంది. వెనెజువెలాలో మాదిరే ఆపరేషన్‌కు సిద్ధమవుతోంది. వెనెజువెలాలో తరహాలో మిషన్‌ను పూర్తిచేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది.
అవసరమైతే వేగంగా, హింసాత్మకంగా పని పూర్తిచేస్తారు. ఇరాన్ త్వరగానే చర్చలకు ముందుకొస్తుందని ఆశిస్తున్నా. అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన పనిలేకుండానే సామరస్యంగా చర్చలు జరుపుదాం. సమయం మించిపోతోంది. ఇప్పటికైనా ఇరాన్ మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. లేదంటే ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ సిద్ధంగా ఉంది. ఇరాన్ వినాశనం తప్పదు.
మేం చేసే తదుపరి దాడి దారుణంగా ఉంటుంది. అలా జరక్కుండా చూసుకోండి’’ అని ట్రంప్ హెచ్చరించారు. దాడులు చేస్తామని భయాందోళనలు ఓవైపు పెంచుతూ మళ్లీ చర్చలకు కూర్చోవాలంటే కుదరదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే ట్రంప్ పైవిధంగా మరోసారి హెచ్చరికలు చేయడం గమనార్హం.


