ఇరాన్ మాజీ యువరాజు సంచలన ప్రకటన | Prince Pahlavi says transition system is ready to run Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్ మాజీ యువరాజు సంచలన ప్రకటన

Mar 15 2026 11:39 AM | Updated on Apr 24 2026 11:14 AM

Prince Pahlavi says transition system is ready to run Iran

వాషింగ్టన్ డీసీ: ప్రస్తుతం ఇరాన్ యుద్ధంతో అట్టుడికి పోతుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఆ దేశం అతలాకుతలంగా మారింది.  సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణంతో రాజకీయంగా సైతం సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలోనే ఇరాన్ బహిష్కృత రాజు రెజా పహ్లావి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు.

టెహ్రాన్‌ మునుపెన్నడూ లేని సంక్షోభాలని చూస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతమవుతున్న ఆ దేశం రాజకీయంగా తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి అణుచర్చల విఫలంతో  పాటు ఆ దేశంలో ప్రజలు జరిపిన నిరసనలు సైతం ఒక కారణం. ఇస్లామిక్ ప్రభుత్వ కఠిన చట్టాలు, అవినీతిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై నిరసనలతో రోడ్లెక్కారు. దీంతో ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో వారిని అణిచివేసింది. వేలాది మందిని కాల్చి చంపింది. ఈ విషయంలో మెుదటి నుంచి ఇరాన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్ ఇదే సాకుగా  భావించి  యుద్ధాన్ని ప్రకటించారు.

అయితే యుద్దం ప్రారంభంలోనే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని హతమార్చారు. ప్రస్తుతం సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీని సైతం లేపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ బహిష్కృత యువరాజు రెజాపహ్లవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ"ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే వెను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. నా నాయకత్వంలో ఇరాన్‌ని పాలించడానికి ప్రతినిధి వర్గం సిద్ధంగా ఉంది. కొద్దికాలంలోనే ఇరాన్‌లో శాంతి భద్రతలు, స్వేచ్ఛా తిరిగి పునరుద్ధరిస్తాం." అని ప్రకటనలో తెలిపారు.

దేశంలో తిరిగి శాంతిని పునరుద్ధరించడానికి స్థానికంగా ఉన్న వారితో పాటు విదేశాలలో ఉన్న నిపుణులను నియమించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ అభివృద్ధి కోసం   “ఇరాన్ ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్” అనే కార్యక్రమం కూడా రూపొందించబడిందని ఇస్లామిక్ ప్రభుత్వం పడిపోయిన  మొదటి 180 రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు, కొత్త రాజ్యాంగం రూపకల్పన, ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) వంటి అంశాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య పాలనతోనే ఇరాన్‌లో అభివృద్ధి సాధ్యం అని రెజా పహ్లవీ పేర్కొంటున్నారు.

రెజా పహ్లవీ నేపథ్యం

కాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో  మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్‌లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది.దీంతో ‍అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆసమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement