
చైనానూ సానుకూలంగా చూస్తున్న ప్రపంచం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయంలో మార్పు వస్తోంది. అందరి హాట్ ఫేవరెట్‌గా ఉన్న అమెరికా ఇమేజ్ తగ్గిపోతోంది. అంతేకాదు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల సానుకూలత గణనీయంగా తగ్గిపోతోంది. చైనా, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ పట్ల ఆదారణ పెరుగుతోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన కొత్త సర్వే ఈ విషయాలు వెల్లడించింది. గతంలో నిర్వహించిన సర్వేల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. చైనా పట్ల వ్యతిరేకత ఉండేది. కానీ.. తీరు మారుతోంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే.. ఇప్పుడు రెండు అగ్రరాజ్యాలు సమానంగా అభిమానాన్ని సంపాదించుకుంటున్నాయి.
8 దేశాలు అమెరికా వైపు.. 7 దేశాలు చైనా వైపు..
జనవరి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు యూఎస్ సహా 25 దేశాలలో 30,000 మందికి పైగా వ్యక్తులను ప్యూ సర్వే చేసింది. 24 దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో, ఎనిమిది దేశాలలో అమెరికాను గొప్పగా అభివరి్ణంచారు. ఏడు దేశాలలో చైనాను పొగిడారు. మిగిలిన దేశాల్లో రెండింటికీ సమాన గౌరవం లభించింది. ముఖ్యంగా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీతో సహా 10 అధిక ఆదాయ దేశాల్లో 35% మంది మాత్రమే అమెరికా పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. గత సంవత్సరం 51% ఉండగా.. ఇప్పుడది 35 శాతానికి పడిపోయింది. ఈ ధనిక దేశాల్లో 32% మంది చైనా పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇది గత సంవత్సరం 23% మాత్రమే ఉంది. అంటే తొమ్మిది శాతం పెరిగింది. ఇక అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై తమకు నమ్మకం ఉందని 22% మంది చెప్పారు. ఇది గత సంవత్సరం 17%గానే ఉంది. అంటే ఈ ఏడాదికి 5శాతం పెరిగింది.
ట్రంప్ విదానాలే కారణం!
ఈ మార్పునకు కారణమేంటనేదీ ప్యూ రీసెర్చ్ సెంటర్ తేల్చలేకపోయింది. అయితే.. అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ మార్పులు, నాయకత్వం అవగాహన ఈ ఫలితాలకు కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన విదేశాంగ విధాన నిర్ణయాలపై విమర్శలు పెరుగుతున్న తరుణంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. విదేశీ సహాయాన్ని తగ్గించడం, సాంప్రదాయ మిత్రదేశాలపై సుంకాలను విధించడం, అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేసే వలస విధానాలను కఠినతరం చేయడం వంటి వరుస విధాన చర్యలు అమెరికా పట్ల విశ్వసనీయతను పోగొడుతున్నాయని డెమొక్రాట్ సెనేటర్ల బృందం ఆరోపించింది.
అమెరికావైపే ఇజ్రాయెలీలు..
ఇక.. ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం.. పాలస్తీనా, ఇరాన్‌లపై తమ యుద్ధానికి మద్దతు ఇచ్చిన అమెరికా పట్లనే ఎక్కువ సానుకూలంగా ఉన్నారు. 83% మంది ఇజ్రాయేలీలు అమెరికాను ఇష్టపడుతుండగా.. 33% మంది చైనా పట్ల తమ సానుకూలతను తెలిపారు. వారిలో 69% మంది ట్రంప్‌పై తమకు నమ్మకం ఉందని చెబుతుండగా, 9% మంది మాత్రమే జిన్‌పింగ్ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.