హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట

US court strikes down Trump administration order limiting H-1B visas - Sakshi

ఐటీ కంపెనీలకు కూడా..

వీసా విధానంలో ట్రంప్‌ నిర్ణయాలను కొట్టేసిన కోర్టు

వాషింగ్టన్‌: అమెరికాలో భారతీయ టెక్కీలకు, ఐటీ కంపెనీలకు భారీ ఊరట లభించింది. హెచ్‌–1బీ వీసాల్లో ట్రంప్‌ సర్కార్‌ ప్రతిపాదించిన ఆంక్షల్లో రెండింటిని అమెరికా కోర్టు నిలిపివేసింది. ఈ ఏడాది చివరి వరకు  హెచ్‌–1బీ వీసాలను రద్దు చేస్తూ అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌1–బీ వీసా విధానంలో ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలుగుతాయంటూ అమెరికా చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కోర్టుకెక్కాయి.

ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వీసా విధానంలో మార్పులు తీసుకురావడంలో ట్రంప్‌ సర్కార్‌ పారదర్శకంగా వ్యవహరించలేదని కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ప్రభుత్వం వీసా విధానంలో మార్పులపైన చర్చించడానికి, ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి నిర్ణయాలు తీసుకున్నారన్న న్యాయమూర్తి విదేశీ ఉద్యోగులకు అధిక వేతనాలు, ఐటీ కంపెనీలు విదేశీ పనివారి నియామకంలో ఉన్న పరిమితుల్ని కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. డిసెంబర్‌ 7 నుంచి ఈ నిర్ణయాలేవీ అమలు చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పుపై ఐటీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి.

బైడెన్‌ ప్రమాణ కమిటీలో ఇండియన్‌
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రమాణ స్వీకారమహోత్సవానికి వేసిన కమిటీలో ప్రవాస భారతీయుడు మజూ వర్ఘీస్‌కి చోటు లభించింది. ఈ కమిటీలో తనను ఎంపిక చేయడంపై మజూ హర్షం వ్యక్తం చేశారు. ‘‘జో బైడెన్, కమలా హ్యారిస్‌ల ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటుగా ఆ సంబరాల్లో జరిగే ఇతర కార్యక్రమాల ప్రణాళిక, నిర్వహణ కమిటీలో చోటు లభించడం నాకు గర్వకారణం‘‘ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  బైడెన్, కమలా ఎన్నికల ప్రచారంలో కూడా మజూ కీలక సలహాదారుగా వ్యవహరించారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top