దండెత్తి వచ్చింది బాహుబలి.. అయితేనేం తగ్గేదేలే.. జెలెన్‌స్కీ ధీరత్వానికి ప్రశంసలు

Ukraines TV Comedian President Finds His Role As Wartime Leader - Sakshi

కీవ్‌: దండెత్తి వచ్చింది బాహుబలి. ఎదిరించేందుకు తన బలం, బలగం ఏమాత్రమూ చాలవు. అయినా సరే, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ చూపుతున్న తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రష్యా తన దగ్గరున్న మారణాయుధాలన్నీ మోహరించి అన్నివైపుల నుంచి భీకరమైన దాడి చేస్తున్నా నాయకుడిగా సైన్యాన్ని జెలెన్‌స్కీ ముందుండి నడిపిస్తున్న తీరు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. పరాజయం తప్పదన్నప్పుడు ఎవరైనా సాధారణంగా పలాయన మంత్రం పఠిస్తాస్తారు. కానీ జెలెన్‌స్కీ మాత్రం పోరాటమే తన బాట అంటున్నారు. ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా బయట పడేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇచ్చిన ఆఫర్‌ను కూడా ఆయన తిరస్కరించారు. తనకి ఇప్పుడు కావల్సింది ఆయుధాలే తప్ప పలాయనం కాదని తెగేసి చెప్పి ఉక్రెయిన్‌ సేనల ఆత్మస్థైర్యాన్ని పెంచారు.

చదవండి: (ఉక్రెయిన్‌ రాజధాని... కీవ్‌లో రణరంగం)

అఫ్గానిస్థాన్‌లో 2021 ఆగస్టు 15న తాలిబన్లు కాబూల్‌ సరిహద్దుల్లోకి రాగానే ప్రాణభయంతో దేశం వదిలి పారిపోయిన అప్పటి అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌తో జెలెన్‌స్కీని ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. అప్పట్లో ఇరాక్‌ను ఆక్రమించిన అమెరికా, అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు పారిపోవడానికి అవకాశమిచ్చినా ఆయన ఇష్టపడలేదు. కానీ ఓటమి తప్పదని తేలాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన అంతర్జాతీయ ఉగ్రవాది బిన్‌ లాడెన్‌ కూడా అగ్రరాజ్యం తనను వేటాడేందుకే నిర్ణయించుకుందని తెలిసి ప్రాణభయంతో వణికిపోయారు. 11 ఏళ్లపాటు రహస్య జీవితం గడిపారు. కానీ ఓటమి వెక్కిరిస్తోందని, రాజధాని కీవ్‌ కూలిపోతుందని తెలుస్తూనే ఉన్నా, తన ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయని అర్థమవుతున్నా జెలెన్‌స్కీ మాత్రం ఉక్రెయిన్‌ను వదిలే ప్రసక్తే లేదని ప్రకటించి శెభాష్‌ అన్పించుకుంటున్నారు. 

రష్యన్‌ అనర్గళంగా మాట్లాడే యూదు అయిన జెలెన్‌స్కీ తొలుత నటుడు. కామెడీ షోలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ అనుకోకుండా అధ్యక్షుడయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పటికీ వెన్ను చూపకుండా చివరికంటూ పోరాటం చేయాలని కృతనిశ్చయంతో ముందుకు వెళుతున్నారు. ఒంట్లోని ఆఖరి రక్తం బొట్టు ఉన్నంతవరకు పోరాడాలన్న స్ఫూర్తిని రగిలిస్తున్నారు. నాయకుడు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలను చూసిన ఉక్రెయిన్‌ ప్రజలు కూడా ధైర్యం చిక్కబట్టుకుంటున్నారు. భార్యా పిల్లల్ని సురక్షిత ప్రాంతాలకు పంపిస్తూ మగవాళ్లు కదన రంగంలోకి దూకుతున్నారు. కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చే దయనీయ పరిస్థితుల్లో యుద్ధభూమిని వదలకూడదన్న జెలెన్‌స్కీ పోరాటపటిమను చూసిన వారు రీల్‌ లైఫ్‌లో కమేడియన్‌ అయినా రియల్‌ లైఫ్‌లో ఆయనే హీరో అంటూ కీర్తిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top