
రష్యాకు ఉక్రెయిన్, మిత్ర దేశాల పిలుపు
కీవ్‌లో ఫ్రాన్స్, జర్మనీ, పోలెండ్, యూకే నేతలు
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు తేవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో యూరప్ ప్రధాన దేశాల నేతలు రంగంలోకి దిగారు. ఫ్రాన్స్, జర్మనీ, పోలెండ్, యూకే దేశాల నేతలు శనివారం కీవ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రష్యా ప్రకటించిన మూడు రోజుల కాల్పుల విరమణ శనివారంతో ముగియనుండటం గమనార్హం.
ఈ సందర్భంగా నేతలు కీవ్‌లోని ప్రధాన ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో జరిగిన 80వ విక్టరీ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు, నేలకొరిగిన సైనికులకు నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా వారు 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా ముందుంచారు. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా చర్చలకు ముందుకు రావాలని అధ్యక్షుడు పుతిన్‌కు పిలుపునిచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చిన శాంతి ఒప్పందానికి మద్దతు ప్రకటించారు. సోమవారం మొదలుకొని నెల రోజులపాటు అమలయ్యే పూర్తిస్థాయి, బేషరతు కాల్పుల విరమణకు అంగీకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, జర్మనీ ఫ్రెడరిక్ మెర్జ్, పోలెండ్ ప్రధాని టస్క్, యూకే ప్రధాని కెయిర్ స్టార్మర్ పాల్గొన్నారు.
కాగా, నాలుగు దేశాల నేతలు కలిసి ఉక్రెయిన్ రావడం ఇదే మొదటిసారి. వీరిలో జర్మనీ ఛాన్స్‌లర్ మెర్జ్‌కు ఇదే మొట్టమొదటి ఉక్రెయిన్ పర్యటన. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో చర్చలు జరిపినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండీ సిబిహా వెల్లడించారు. ఇలా ఉండగా, సుమారు 1,600 కిలోమీటర్ల పొడవైన ఫ్రంట్‌లైన్‌లో రష్యా ఆర్మీ శనివారం కూడా పలు చోట్ల దాడులు కొనసాగించింది. ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంపై శుక్రవారం జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు మరణించగా నలుగురు గాయపడ్డారు.