పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పించుకున్న రష్యా అధ్యక్షుడు?

Ukraine Announced Vladimir Putin Survived Assassination Attempt - Sakshi

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మీద మరోమారు నిజంగానే హత్యాయత్నం జరిగిందా?.. దాని నుంచి ఆయన ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ చేసిందెవరు?.. ఇప్పుడు ఈ విషయం మీదే చర్చ నడుస్తోంది. 

రష్యా అధ్యక్షుడు పుతిన్‌(69) హత్యకు కుట్ర జరిగిందన్న విషయాన్ని.. ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి ఒకరు ధృవీకరించారు. ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ కైర్య్లో బుడానోవ్‌ ఈ ప్రకటన చేశాడు. నల్ల సముద్రం-కాస్పియన్‌ సీ మధ్య ఉన్న కాకాసస్‌ ప్రాంతంలో పుతిన్‌పై దాడి జరిగిందని, ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలైన కొద్దిరోజులకే ఇది జరిగిందని ఆయన వెల్లడించాడు. 

‘ఉక్రెయిన్‌స్కా ప్రవ్‌డా’ ఈవెంట్‌లో మేజర్‌ జనరల్‌ కైర్య్లో బుడానోవ్‌.. పుతిన్‌ హత్యాయత్నం గురించి స్పందించారు. మంగళవారం ఈ పూర్తి ఇంటర్వ్యూ టెలికాస్ట్‌ అయ్యింది. ‘‘పుతిన్‌ హత్యకు ప్రయత్నం జరిగింది. దాడి కూడా జరిగింది. కానీ, తృటిలో ఆయన తప్పించుకున్నారు. కాకాసస్‌ ప్రతినిధులు దీనిని ధృవీకరించారు కూడా. ఇది బయటకు పొక్కని విషయం. పూర్తిగా విఫలయత్నం. మళ్లీ చెప్తున్నా.. రెండు నెలల కిందట ఇది నిజంగానే జరిగింది. విఫలమైంది’’ అని వ్యాఖ్యానించారాయన. 

ఇదిలా ఉంటే.. 2017 నుంచి ఇప్పటిదాకా (తాజా ప్రకటన మినహాయించుకున్నా..) ఐదుసార్లు హత్యాయత్నం నుంచి బయటపడ్డాడు. అయితే రక్షణ విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, పైగా తన వ్యక్తిగత భద్రత గురించి భయపడకపోవడం గమనార్హం.

చదవండి: దావోస్‌ వేదికపై జెలెన్‌స్కీ గళం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top