
ఉగ్రవాదంపై పోరాటంలో పూర్తిగా సహకరిస్తాం
అఖిలపక్ష బృందాలకు హామీ ఇచ్చిన యూఏఈ, జపాన్
అబుదాబీ/టోక్యో: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), జపాన్ ప్రకటించాయి. భారత్‌కు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ అరాచకాలను, ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటాన్ని ప్రపంచ దేశాల నేతలకు తెలియజేయడానికి ఏర్పాటైన అఖిలపక్ష బృందాలు తమ కార్యాచరణ ప్రారంభించాయి.
శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని బృందం గురువారం యూఏఈ మంత్రి షేక్ నహ్యన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, డిఫెన్స్ కమిటీ చైర్మన్ అలీ అల్ నుయామీతోపాటు ఇతర నేతలతో అబుదాబీలో సమావేశమైంది. జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలో మరో బృందం జపాన్ రాజధాని టోక్యోలో జపాన్ విదేశాంగ మంత్రి తకాషీ ఇవాయాతోపాటు మరికొందరు నేతలతో భేటీ అయ్యింది. ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదని, మొత్తం ప్రపంచానికి ముప్పుగా మారిందని అలీ అల్ నుయామీ ఆందోళన వ్యక్తంచేశారు.
ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మానవాళికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జపాన్ మంత్రి ఇవాయా మాట్లాడుతూ... ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఉద్ఘాటించారు. మరోవైపు డీఎంకే ఎంపీ కె.కనిమొళి నేతృత్వంలోని మరో అఖిలపక్ష బృందం రష్యాకు బయలుదేరింది. మొత్తం 33 దేశాలకు అఖిలపక్ష బృందాలను పంపించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.