భారత్-యూఏఈ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. భారతీయ సంస్కృతి, చరిత్రను చాటిచెప్పేలా అబుదాబిలో ‘హౌస్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటుకు యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనలో భాగంగా తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఇదొకటి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'లూవ్రే అబుదాబీ'వంటి మ్యూజియం ఉన్న సాదియాత్ కల్చరల్ డిస్ట్రిక్ట్ లోనే ఈ 'హౌస్ ఆఫ్ ఇండియా'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం విశేషం.
ఇందులో యోగా,ఆయుర్వేదం వంటి భారతీయ పురాతన సంప్రదాయాలను డిజిటల్ గ్యాలరీల రూపంలో పర్యాటకులకు వివరించనున్నారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, భారతీయ పారిశ్రామికవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు సమావేశమయ్యేలా ఒక 'బిజినెస్ అండ్ కల్చరల్ హబ్'గా ఈ హౌస్ ఆఫ్ ఇండియా పనిచేయనుంది.
ఇప్పటికే అబుదాబిలో బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ప్రధాని నరేంద్ర చేతుల మీదగా ప్రారంభమైంది. కాగా యూఏఈ అధ్యక్షుడు కేవలం రెండు గంటల పర్యటన కోసం భారత్‌కు సోమవారం(జనవరి 19) వచ్చిన సంగతి తెలిసిందే.


