పుట్టింటి గుట్టు అమ్మకు ఎరుక.. | Two female scientists Helena Wehner and Johannes Fritz became foster mothers of Northern Bald Ibis | Sakshi
Sakshi News home page

పుట్టింటి గుట్టు అమ్మకు ఎరుక..

Jun 12 2026 3:23 AM | Updated on Jun 12 2026 3:23 AM

Two female scientists Helena Wehner and Johannes Fritz became foster mothers of Northern Bald Ibis

ఇంటికెళ్లే దారిని ఎవరైనా మర్చిపోతారా? ఈ పక్షులు మరిచిపోయాయి. అందుకే వాటి పుట్టింటికి వెళ్లే దారిని వాటికి గుర్తు చేసే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ఈ ఫొటోలో వాళ్లు చేస్తున్నది అదే..’నార్తర్న్‌ బాల్డ్‌ ఐబిస్‌’ అనే ఈ అరుదైన పక్షులు మధ్య ఐరోపాలో 400 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. దీంతో రెండు దశాబ్దాలు కష్టపడి.. జర్మనీ, ఆస్ట్రియాల్లోని సంరక్షణ శాలల్లో వీటిని పెంచారు. పెంచడం అయితే పెంచారు గానీ.. కాలానుగుణంగా ఇవి వలస వెళ్లి.. తిరిగి పుట్టింటికి తిరిగి రావడం ఎలా? ఎందుకంటే.. ఇవి ఎప్పుడూ వలస వెళ్లలేదు కదా.. దీంతో   శాస్త్రవేత్తలే స్వయంగా రంగంలోకి దిగారు. ఆకాశంలో వాటికి ‘మార్గ’దర్శకులుగా మారారు. 

సాధారణంగా పక్షి పిల్లలు గుడ్డు నుంచి బయటకు రాగానే మొదట చూసే మనుషులను తమ తల్లిగా భావిస్తాయి. దీనిని ఇంప్రింటింగ్‌ అంటారు. ఇందుకోసం ఆస్ట్రియాకు చెందిన హెలెనా వెహ్నర్, జోహన్నెస్‌ ఫ్రిట్జ్‌ అనే ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు ఆ పక్షులకు పెంపుడు తల్లులుగా మారారు. వాటిని ప్రేమగా పెంచి, తమను అనుసరించేలా శిక్షణ ఇచ్చారు. పక్షులు ఎగిరే వయసుకు రాగానే ఫ్రిట్జ్‌ ఒక చిన్న ’అల్ట్రాలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’ (పారాగ్లైడర్‌ లాంటి చిన్న విమానం)లో పైలట్‌గా మారగా, హెలెనా వెనుక సీట్లో కూర్చుని పక్షులను పిలిచారు. అంతే.. వారిని చూసి.. పక్షులు ఆ విమానాన్ని అనుసరిస్తూ ఎగరడం ప్రారంభించాయి. 

ఇలా జర్మనీ, ఆస్ట్రియా నుంచి స్పెయిన్‌ వరకు దాదాపు 2,600 కిలోమీటర్ల మేర సాగిన ఈ వినూత్న ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. తమ ప్రయత్నంతో వాటికి సురక్షితమైన వలస మార్గం తెలిసిందని.. వచ్చే ఏడాది ఇవి ఎవరి సహాయం లేకుండానే సొంతంగా తిరిగి రాగలవని.. అంతేకాకుండా తమ పిల్లలకు కూడా ఈ మార్గాన్ని నేర్పుతాయని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జోహన్నెస్‌ ఫ్రిట్జ్‌ సంతోషం వ్యక్తం చేశారు. 2024లో ఫొటోగ్రాఫర్‌ గున్నార్‌ హార్ట్‌మాన్‌ ఈ అరుదైన దృశ్యాన్ని చిత్రీకరించగా, ఈ ఫొటోకు ‘నేచర్‌ 2026 సైంటిస్ట్‌ అట్‌ వర్క్‌’ ఫొటోగ్రఫీ పోటీలో మొదటి బహుమతి కూడా లభించింది.       – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Advertisement
 
Advertisement
Advertisement