
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తాలిబాన్లపై మరింత ఒత్తిడిని పెంచారు. 2021లో అమెరికా వదిలివేసిన బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలని తాలిబాన్లను డిమాండ్ చేశారు. దీనిని అప్పగించని పక్షంలో చెడు పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. చైనా అణు స్థావరాల వ్యూహాత్మక స్థానాన్ని ఎదుర్కొనేందుకు ట్రంప్ ఈ ప్రయత్నం తప్పనిసరని భావించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న బాగ్రామ్ వైమానిక స్థావరం స్వాధీనంపై సోషల్ మీడియాలో ట్రంప్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఆధీనంలో ఉన్న బాగ్రామ్ వైమానిక స్థావరాన్నియునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. రెండు మైళ్ల రన్‌వేను కలిగి ఉండి, గతంలో బీ-52లు, బ్లాక్ హాక్స్‌లను కలిగిన ఈ స్థావరం పశ్చిమ చైనా నుంచి ఎదురయ్యే ముప్పును పర్యవేక్షించడంతో సహా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. కాగా తాలిబాన్ అధికారులు ట్రంప్ హెచ్చరికను తిరస్కరించారు. బగ్రామ్ ఆఫ్ఘన్ నేల.. ఇది చైనా అవుట్‌పోస్ట్ కాదని ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌లలో బాగ్రామ్ ఎయిర్‌బేస్ ప్రధానమైనదిగా ఒకప్పుడు ఉండేది. అప్పట్లో 40 వేల మంది సైనికులతో పాటు సివిలియన్ కాంట్రాక్టర్లు కూడా అక్కడ పనిచేసేవారు. అయితే, పలు కారణాలతో 2021 జులైలో అమెరికా సైన్యం బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను ఖాళీ చేసింది. తరువాత అది తాలిబాన్ల వశం అయింది. బాగ్రామ్‌కు అతి దగ్గరలో చైనాలోని కాఖ్గర్ ప్రాంతంలో ఓ న్యూక్లియర్ సైట్ ఉందని చెబుతారు. తాజాగా చైనా న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించారు. చైనాపై నిఘా పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.

బాగ్రామ్‌ను తిరిగి స్వాధీనం చేసుకుని, అక్కడినుంచి చైనాపై నిఘా ఉంచుతామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవని, అది సాధ్యం అవుతుందని అనుకోవడం లేదన్నారు. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా తదితర ఉగ్ర సంస్థల నుంచి దానిని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమైన పని అన్నారు. ఇందుకోసం వందల సంఖ్యలో మిలటరీ దళాలు అవసరమవుతాయి. బాగ్రామ్ పునర్నిర్మించడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుందన్నారు.