గ్రీన్‌లాండ్ స్వాధీన యత్నాలపై ట్రంప్
బ్రిటన్ తీరుపై అధ్యక్షుని విమర్శలు
లండన్/దావోస్: గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాను చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ‘‘బ్రిటన్ వంటి దేశమే మారిషస్ నుంచి అప్పుడెప్పుడో కొనుగోలు చేసిన చాగోస్ దీవులపై అధికారాన్ని అకారణంగా తిరిగి ఆ దేశానికి వదిలేసుకుంటోంది. అక్కడి డీగో గార్షియా దీవుల్లో అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన నావిక, బాంబర్ స్థావరాలున్నాయి. వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారిందిప్పుడు.
గ్రీన్‌లాండ్ విషయంలోనూ అలాంటిది జరగొద్దనే ఆ దీవి అమెరికా చేతిలో ఉండాలని చెబుతున్నాను’’ అని సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌సోషల్‌లో రాసుకొచ్చారు! ‘నాటోకు చెందిన అత్యంత తెలివైన సభ్య దేశం’ ఇలాంటి తెలివి తక్కువ పనికి దిగుతోందంటూ బ్రిటన్‌ను ఎద్దేవా కూడా చేశారాయన. ‘‘బ్రిటన్ కనబరిచిన ఈ బలహీనతను చైనా, రష్యా కచ్చితంగా గమనించే ఉంటాయి. గ్రీన్‌లాండ్‌పై మరింత దూకుడు పెంచే ఆలోచన కూడా చేస్తుండి ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలను బ్రిటన్ ఖండించింది.
చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించాలన్న నిర్ణయం పూర్తిగా సబబేనని పేర్కొంది. చాగోస్ దీవుల్ని రెండు శతాబ్దాల క్రితం మారిషస్ నుంచి బ్రిటన్ కారుచౌకగా కొనుగోలు చేసింది. వాటిని మారిషస్‌కు తిరిగిచ్చేలా, డీగో గార్షియా దీవిని మాత్రం 99 ఏళ్ల లీజుకు బ్రిటనే అట్టిపెట్టుకునేలా గతేడాది ఒప్పందం కుదిరింది. అప్పుడు దాన్ని స్వాగతించిన ట్రంప్ ఇప్పుడు మాత్రం తప్పుబడుతున్నారు!
ట్రంప్ విశ్వసనీయత కోల్పోయారు: ఉర్సులా
గ్రీన్‌లాండ్ స్వాధీన యత్నాలకు మద్దతివ్వనందుకు పలు యూరప్ దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటనను యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ తూర్పారబట్టారు. ఈ నిర్ణయాన్ని ఘోర తప్పిదంగా అభివర్ణించారు. ‘‘ఈయూపై ఇక టారిఫ్‌లు విధించబోనని గతేడాది ఇచ్చిన హామీని ట్రంప్ సునాయాసంగా తుంగలో తొక్కారు. ఆయనకు అసలు విశ్వసనీయత అన్నది ఏమైనా ఉందా?’’ అంటూ ఆమె మండిపడ్డారు. ‘‘వ్యాపారంలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా ఒప్పందమంటే ఒప్పందమే. ఈయూ సమైక్యంగా నిలుస్తుంది. ట్రంప్ టారిఫ్‌లపై దీటుగా స్పందిస్తుంది’’ అని ప్రకటించారు.
కాస్త వెన్నెముక చూపండి!
టారిఫ్‌ల వ్యవహారంలో యూరప్ దేశాలు పిరికిగా వ్యవహరిస్తున్నాయంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఎద్దేవా చేశారు. ఆ దేశాలకు అసలు వెన్నెముక అనేదే లేదా అంటూ తూర్పారబట్టారు. ట్రంప్ టారిఫ్‌లను కలసికట్టుగా, దీటుగా ఎదుర్కోవాలని వాటికి సూచించారు. అలాగే గ్రీన్‌లాండ్‌కు కూడా యూరప్ దేశాలన్నీ సమైక్యంగా మద్దతిచ్చి ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నారు.
అమెరికాపై ట్రేడ్ బజూకా?
ట్రంప్ టారిఫ్‌లకు అదే విరుగుడు
ఈయూ దేశాలకు మాక్రాన్ పిలుపు
దావోస్: గ్రీన్‌లాండ్ స్వాధీ నానికి అంగీకరించడం లే దంటూ పలు యూరప్ దేశా లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10 శాతం టారిఫ్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యు యేల్ మాక్రాన్ మరోసారి ధ్వజమెత్తారు. అంతూ పొంతూ లేకుండా సాగుతున్న ట్రంప్ టారిఫ్‌ల బెదిరింపులను దీటుగా ఎదుర్కోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. అందుకోసం అవసరమైతే ‘ట్రేడ్ బజూకా’గా పిలిచే యాంటీ కొయెర్షన్ ఇన్‌స్ట్రుమెంట్ (ఏసీఐ) ఆయుధాన్ని వాడేందుకు కూడా ఈయూ కూటమి వెనకాడొద్దన్నారు. మంగళవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరంలో మాట్లాడుతూ మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయూ కూటమి చేతిలో ఉన్న అతి పదునైన ఆయుధం ఏసీఐ.
ప్రస్తుత కఠిన పరిస్థితుల దృష్ట్యా దాన్ని అమెరికాపై వాడేందుకు ఈయూ దేశాలు ఏమాత్రం వెనకాడొద్దు’’ అని అభిప్రా యపడ్డారు. ఈయూ దేశాలపై ఆర్థిక, ఇతరత్రా ఒత్తిళ్లు, బెదిరింపులను తిప్పికొట్టేందుకు ఆ సమాఖ్య రూపొందించుకున్న వాణిజ్య అస్త్రం ట్రేడ్ బజూకా. దీనిద్వారా కూటమేతర దేశాలపై ప్రతీకార సుంకాల విధింపుతో పాటు పలు ఇతరత్రా ఆంక్షలు విధించే అధికారం ఈయూకు దఖలు పడింది. అలాగే ఈయూకు చెందిన ఎలాంటి బిడ్డింగుల్లోనూ సదరు దేశాలు పాల్గొనేందుకు వీలుండదు. కూటమేతర దేశాలను, ముఖ్యంగా చైనా, రష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ట్రేడ్ బజూకాను మిత్రదేశమైన అమెరికాపైనే ఈయూ ప్రయోగించే పరిస్థితులు కన్పిస్తుండటం విశేషం!


