ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల!  | Thailand Man in finds frozen snake inside ice cream | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల! 

Mar 10 2025 5:53 AM | Updated on Mar 10 2025 1:03 PM

Thailand Man in finds frozen snake inside ice cream

ఐస్‌క్రీమ్‌ అంటే కొందరికి చాలా ఇష్టం. బడలిక తర్వాత నచి్చన ఐస్‌క్రీమ్‌ తింటే ప్రాణం లేచొచినట్లు అనిపిస్తుంది. కానీ పొరపాటున ఈ ఐస్‌క్రీమ్‌ గనుక తింటే ప్రాణాలు పోవడం ఖాయం. ఇది స్నేక్‌ ఐస్‌క్రీం మరి! థాయిలాండ్‌లో మియాంగ్‌ రాచ్‌బురీ రాష్ట్రంలోని పార్క్‌ థో జిల్లాలో రేబాన్‌ నక్లెంగ్‌బూన్‌ అనే వ్యక్తి స్థానికంగా తన ఫేవరెట్‌ ‘బ్లాక్‌బీన్‌’ పాప్‌సికిల్‌ ఐస్‌క్రీం కొన్నాడు. ఆత్రంగా రేపర్‌ తీయగానే చచ్చిన పాము పిల్ల కనిపించడంతో ఠారెత్తిపోయాడు. దాన్ని ఫొటో తీసి ‘ఫేస్‌బుక్‌’లో పెట్టాడు. 

నలుపు, పలుసు రంగుల్లో ఉన్న పాము పిల్ల ఐస్‌క్రీమ్‌లో గడ్డకట్టుకుపోని కనిపిస్తోంది. ‘‘దాని కళ్లు తెరిచే ఉన్నాయి! ఇంకా బతికే ఉందా?’’ అంటూ పోస్టు పెట్టాడు. దాంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఓ మాదిరి విషముండే గోల్డెన్‌ ట్రీ రకం పాము పిల్ల అని కొందరు నిర్ధారించారు. ఆ ఐస్‌క్రీంను ఏ అర్ధరాత్రో చిమ్మచీకట్లో రోడ్‌సైడ్‌ బండిపై కొని చప్పరిస్తే ఈపాటికి టపా కట్టేవాడంటూ కొందరు జోకులు పేల్చారు. ‘‘ఏ కోటిలో ఏ ఒక్కరినో ఇలాంటి అదృష్టం వరిస్తుంది. ఓసారి టేస్ట్‌ చేసి చూడు’’ అని ఇంకొదరు పోస్టులు పెట్టారు.                         

  – బ్యాంకాక్‌  

Advertisement
 
Advertisement
Advertisement