భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్(60) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా నుంచి రిటైర్మెంట్ అయ్యారు. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది.
1998లో నాసాలో చేరిన సునీతా.. 27 ఏళ్ల పాటు వ్యోమగామి బాధ్యతలు నిర్వహించారు. మూడు మిషన్లలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె.. మొత్తం 608 రోజులు స్పేస్‌లో గడిపారు. మొత్తం తొమ్మిదిసార్లు స్పేస్ వాక్ చేశారు. అంతరిక్షంలో మారథాన్‌లో పాల్గొన్న తొలి వ్యక్తిగానూ ఆమె గుర్తింపు పొందారు. కిందటి ఏడాది డిసెంబర్‌లోనే(27వ తేదీన) ఆమె రిటైర్మెంట్ అమల్లోకి వచ్చిందని తాజాగా నాసా ప్రతినిధి ఒకరు తెలిపారు.
నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ మాట్లాడుతూ, “సుని విలియమ్స్ మానవ అంతరిక్ష యాత్రలో మార్గదర్శకురాలు. ఆమె కృషి భవిష్యత్ యాత్రలకు పునాది లాంటిది అని ప్రశంసించారు. అంతరిక్షం నా ప్రియమైన స్థలం. నాసాలో 27 ఏళ్ల కెరీర్ అద్భుతంగా సాగింది అని సునీత పేరిట ఒక ప్రకటన వెలువడింది.
సునీతా విలియమ్స్ పాల్గొన్న ప్రధాన మిషన్లు
2006.. స్పేస్ షటిల్ డిస్కవరీ (STS-116), Expedition 14/15లో ఫ్లైట్ ఇంజనీర్‌గా పనిచేశారు.
2012.. Expedition 32/33లో 127 రోజుల మిషన్, మూడు స్పేస్‌వాక్‌లు చేసి స్టేషన్ రేడియేటర్ మరమ్మతు చేశారు.
2024–2025 – బోయింగ్ స్టార్‌లైనర్ Crew Flight Testలో Expedition 71/72లో భాగమై.. అనూహ్య పరిస్థితుల నడుమ 286 రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది.
భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా జిల్లా, ఝులాసన్ గ్రామంలో జన్మించారు. సునీత తల్లి స్లోవేనియన్ మూలాలున్న బోన్నీ పాండ్యా. ఓహియోలో జన్మించిన సునీత.. మాసాచుసెట్స్‌ను తన స్వస్థలంగా భావిస్తుంటారు.
మసాచుసెట్స్‌లో 1983లో హైస్కూల్, 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి బీఎస్సీ, 1995లో ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో సునీత ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 1997లో మిలటరీలో చేరిన సునీత.. 30 రకాల విమానాలను 3 వేల గంటలు నడిపిన అనుభవం పొందారు. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆమె భవిష్యత్ కార్యచరణపై స్పష్టత రావాల్సి ఉంది.


