Strange Virus In Chile: What Is Guillain Barre Syndrome, Know Its Symptoms, Treatment And Other Details - Sakshi
Sakshi News home page

What Is Guillain Barre Syndrome: చిలీని వణికిస్తున్న వింత వైరస్! అల్లాడుతున్న జనం, లక్షణాలివే

Jul 11 2023 4:58 AM | Updated on Jul 11 2023 8:17 AM

A strange virus shaking Chile - Sakshi

శాంటియాగో: గిలాన్‌ బరే (జీబీఎస్‌) అని పిలిచే అరుదైన సిండ్రోమ్‌ ఒకటి దక్షిణ అమెరికా దేశం చిలీని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు. అసలేం చేయాలో ప్రభుత్వానికే పాలుపోవడం లేదు. చివరికి దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... 

ఏమిటీ జీబీ సిండ్రోమ్‌? 
ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తే నరాల వ్యవస్థను శత్రువుగా భావించి దాడికి దిగే అత్యంత అరుదైన (ఆటో ఇమ్యూన్‌) సిండ్రోమ్‌ ఇది. నరాలపై ఈ దాడి చివరికి ఒంట్లోని కండరాల వ్యవస్థ మొత్తాన్నీ పూర్తిగా నిర్విర్యం చేస్తుంది. దాంతో విపరీతమైన నిస్సత్తువ, అవయవాలు మొద్దుబారడం వంటి దుర్లక్షణాలు వేధిస్తాయి.

ఇది సాధారణంగా కాళ్లలో మొదలై నెమ్మదిగా పైకి పాకుతూ ఒళ్లంతా ఆక్రమిస్తుంది. జీబీఎస్‌ బాగా ముదిరితే పక్షావాతానికి కూడా దారి తీస్తుందని జిన్‌ హువా వార్తా సంస్థ పేర్కొంది. పెద్దవాళ్లకు, ముఖ్యంగా మగవాళ్లకు ఇది ఎక్కువగా సంక్రమిస్తుంది. అయితే అన్ని వయసులవారికీ దీనితో రిస్కే! 

కరోనాతోనూ వస్తుంది...! 
జీబీ సిండ్రోమ్‌ ఎందుకు వస్తుందన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. తరచూ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా కాంపిలోబాక్టర్‌ జెజునీ బ్యాక్టీరియా ఈ సిండ్రోమ్‌కు కారణంగా మారుతున్నట్టు మాత్రం తేలింది. అయితే ఇన్‌ఫ్లుయెంజా, సైటోమెగలూ, ఎప్‌స్టెయిన్‌ బర్‌తో పాటు కోవిడ్‌ వైరస్‌ కూడా జీబీఎస్‌కు దారి తీసే ప్రమాదం పుష్కలంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం కలవరానికి గురి చేస్తోంది! 

గుర్తించడమెలా? 
ప్రధానంగా రోగ లక్షణాలు, నరాల పరీక్ష ద్వారా జీబీఎస్‌ ఉనికి బయట పడుతుంది. ముఖ్యంగా స్పైనల్‌ టాప్, ఎలక్ట్రోమియోగ్రఫీ వంటివి దీన్ని కచి్చతంగా పట్టిస్తాయి. 

ఇవీ లక్షణాలు... 
జీబీఎస్‌ తాలూకు అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరొలాజికల్‌ డిజార్డర్స్‌ అండ్‌ స్ట్రోక్‌ వెల్లడించింది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు. తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి.

ఎంతలా అంటే, మెషీన్‌ సాయంతో ఊపిరి తీసుకోవాల్సి కూడా రావచ్చు! ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుకుంటాడు! నరాలు బాగా దెబ్బ తింటాయి గనుక నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మం లోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ సలుపుతుంటుంది. 

ఇతర లక్షణాలు  
♦ చూపు తగ్గడం, కంటి కండరాలు దెబ్బ తినడం..మాట్లాడటం, నమలడం, మింగడం కష్టంగా మారడం 
♦ చేతులు, అరికాళ్లలో సూదులతో గుచ్చుతున్నట్టు విపరీతమైన బాధ 
♦ విపరీతమైన ఒళ్లు నొప్పులు, ముఖ్యంగా రాత్రిపూట 
♦ శారీరక, మానసిక సమన్వయ లోపం, నిలకడలేమి 
♦ హృదయస్పందన, రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడం 
♦ జీర్ణాశయ, పిత్తాశయ సంబంధిత సమస్యలు 

చికిత్స ఉందా? 
జీబీఎస్‌కు ఇప్పటికైతే ఇదమిత్థంగా చికిత్స అంటూ ఏమీ లేదు. సమస్య తీవ్రతను తగ్గించి, త్వరగా కోలుకునేందుకు సాయపడే మార్గాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. దీనికి ప్రధానంగా వాడుతున్న చికిత్స ఇంట్రావీనస్‌ ఇమ్యునోగ్లోబులిన్‌ (ఐవీఐజీ). నరాలపై దాడికి దిగకుండా రోగ నిరోధక శక్తిని ఇది నియంత్రిస్తుంది.  

- సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement