breaking news
national emergency
-
అక్షరం మీద ఆగ్రహం
అణచివేత, ఆంక్షలు బ్రిటిష్ ఇండియా కాలం నుంచి భారతీయ పత్రికారంగానికి అనుభవమే. ఎమర్జెన్సీ ప్రకటనపై రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సంతకం మరొకసారి బ్రిటిష్ కాలంనాటి నిర్బంధాలను పున రావృతం చేసింది. 1975 జూన్ 25 అర్ధరాత్రి భారత పత్రికా రంగం చీకటి తెరలోకి వెళ్లింది. 26న సెన్సార్షిప్ పేరుతో అణచివేత అధికారికంగా అమలైంది. ఆ రోజు నుంచి 1976 జనవరి 22 వరకు 272 పత్రికల మీద సెన్సార్ వేటు పడింది. 19 మాసాల తరువాత గాని పత్రికారంగం వెలుగు చూడలేదు. 1975లోనే తూర్పు గోదావరి జిల్లా, ధవళేశ్వరంలోని గోదావరి ఆనకట్ట బీటలు వారింది. ఆ వార్త సైతం సెన్సార్ కత్తెరకు గురైంది. 1976 జనవరి నాటి పార్లమెంట్ శీతకాల సమావేశాల వార్తలను కూడా సెన్సార్ చేసింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ తెచ్చిన సెన్సార్ షిప్ ఎంత గుడ్డిగా, నిరంకుశంగా సాగిందో చెప్పడానికి ఇవి చాలు. ఎన్ని కీలక వార్తలు కత్తెర పాలైనాయో ప్రఖ్యాత జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ ‘ది జడ్జిమెంట్’ పుస్తకానికి ఇచ్చిన అనుబంధంలో చూడవచ్చు. దీనికంతకూ బాధ్యత ఇందిరదే.జూన్ 26 ఉదయం ఇందిర ఆకాశవాణిలో ప్రసంగించారు. ప్రజాస్వామ్య విధానాలతో సాధారణ పౌరులకు మేలు చేయా లని అనుకుంటే ప్రతిపక్షాలు, పత్రికలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని నేరుగా యుద్ధం ప్రకటించారు. ఆ రోజు నుంచే పత్రికలపై సెన్సార్షిప్ అమలులోకి వచ్చింది. అత్యధికంగా ఆంగ్ల దినపత్రికలు ఢిల్లీలోని బహదూర్ షా జఫర్ మార్గ్‌లోనే కేంద్రీకృతమై ఉండేవి. 25వ తేదీ అర్ధరాత్రి ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కన్నాట్‌ప్లేస్‌లోని ‘ది స్టేట్స్‌మన్ ’, ‘ది హిందుస్తాన్ టైమ్స్’, ‘ది ఎకనామికల్ టైమ్స్’, ‘ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలు మాత్రం వెలు వడ్డాయి. కన్నాట్ ప్లేస్ ఢిల్లీ కార్పొరేషన్ పరిధిలో కాక ముని సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. మునిసి పాలిటీకి కరెంట్ కట్ చేయలేదు. కరెంట్ కోత నుంచి పొరపాటున బయపడిన మరో ఆంగ్ల దినపత్రిక ‘మదర్లాండ్’. ఈ పత్రిక ఎడిటర్ కెఆర్ మల్కానీని 25 రాత్రే జేపీ, మొరార్జీలతో పాటే అరెస్టు చేశారు. ఒక ఉగ్రవాదిని పట్టుకున్నంత హడావిడి చేశారు. కాని పత్రిక యాజమాన్యం 26న ప్రత్యేక అనుబంధం ప్రచురించింది. అదే ‘మదర్లాండ్’ ఆఖరి సంచిక అయింది. ఎమర్జెన్సీ విధింపు, అర్ధ రాత్రి అరెస్టుల వివరాలతో అనుబంధాన్ని తెచ్చారు. ఉత్కంఠతో ఉన్న ప్రజలు పది పైసల ఆ అనుబంధాన్ని, ఇరవై రూపా యలకు కూడా కొన్నారు. అంతవరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ఐ.కె. గుజ్రాల్‌కు ఉద్వాసన పలికి, పత్రికలను బుద్ధిగా నడుచు కునేటట్టు చేయగలిగిన సమర్థుడు వీసీ శుక్లాను ఆ పదవిలో నియమించారు ఇందిర. పత్రికలు సెన్సారింగ్‌ను తీవ్రంగా నిర సించాయి. ఇందుకు పరాకాష్ఠ చర్య, సంపాదకీయం ప్రచురించే స్థలాన్ని ఖాళీగా ఉంచడం. వీసీ శుక్లా సమాచార మంత్రిగా ప్రమాణం చేసిన క్షణం నుంచి ఇందిర తొలి శత్రువుగా భావించిన ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ మీద యుద్ధం ప్రారంభించారు. నాటి సంపాదకుడు వీకే నరసింహన్ తన రచన ‘డెమాక్రసీ రిడీమ్డ్’లో అదంతా వివరించారు. మొదటి అడుగు ఎమర్జెన్సీ తొలినాళ్లలో ఎడిటర్‌గా ఉన్న మూల్గాంవ్‌కర్‌కు ఉద్వాసన పలి కించడం. ఆ పత్రికకు విద్యుత్ నిలిపివేశారు. ప్రభుత్వ ప్రకటనలు ఆపారు. ఢిల్లీ కార్యాలయాన్ని కూల్చడానికి ఉత్తర్వులు ఇచ్చారు. గుండె జబ్బుతో బాధపడుతున్న భగవాన్ దాస్ గోయెంకాను అరెస్టు చేస్తామని ఆయన తండ్రి, ఎక్స్‌ప్రెస్ అధిపతి రామ్‌నాథ్‌ను బెదిరించారు. అచ్చుకు వెళ్లే ప్రతి పేజీని సెన్సార్ అధికారులకు చూపాలని డీఐఆర్ 48 (1) నిబంధన విధించి ప్రీ సెన్సార్షిప్ను ప్రయోగించారు.పార్లమెంట్ ప్రసంగాలను ప్రచురించినందుకు ముంబై కేంద్రంగా వెలువడే వారపత్రిక ‘ఒపీనియన్ ’ (ఎ.డి. గొర్వాలే సంపాదకుడు)పై ప్రభుత్వం కక్షకట్టింది. పత్రికను ముద్రించడానికి ప్రెస్ లేకుండా చేశారు పోలీసులు. అయినా సైక్లో స్టయిల్డ్ పత్రికను తెచ్చారు. ఆఖరికి ఈ పత్రిక ప్రచురణనే ప్రభుత్వం నిషేధించింది. ఎమర్జెన్సీని, నాటి విధానాలను సీపీఐ బాహాటంగానే సమర్థించింది. ఈ పార్టీకి మద్దతుపలికే పత్రికగా ఖ్యాతి ఉన్న పత్రిక, ‘మెయిన్ స్ట్రీమ్’. నిఖిల్ చక్రవర్తి సంపాదకుడు. కానీ ఈ పత్రిక నాడు సీపీఐ వైఖరికి దూరంగా ఉంది. సంజయ్‌గాంధీని దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా వెలు వరించిన ‘డు వుయ్ నీడ్ నెహ్రూ టుడే’ వంటి వ్యాసాలు సర్కార్‌కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ పత్రికను అచ్చువేసే ప్రెస్‌ను జప్తు చేశారు.ప్రపంచంలోనే ‘పంచ్’ తరువాత ఖ్యాతిగాంచిన కార్టూన్ల పత్రిక ‘శంకర్స్ వీక్లీ’. దేశం గర్వించదగిన కార్టూనిస్ట్ శంకర్‌పిళ్లై ఈ పత్రిక అధిపతి, ఎడిటర్. ఈ వీక్లీ 1975, అక్టోబర్‌లో మూతపడిపోయింది. కారణం – ప్రీ సెన్సార్ నిబంధన. వినోబా భావే ‘మైత్రి’, జయ ప్రకాశ్ నారాయణ్ ‘ఎవ్రీమ్యాన్స్’, ఫెర్నాండెజ్ ‘ప్రతిపక్ష’... ఎన్నో శాశ్వతంగానో, తాత్కాలికంగానో ప్రచురణ నిలిపి వేశాయి. తెలుగులో ‘సృజన’, ‘జాగృతి’, ‘పిలుపు’, ‘ప్రజాసమస్యలు’ ఆగిపో యాయి (తరువాత కొన్ని మళ్లీ ప్రచురణ ప్రారంభించాయి).ఎమర్జెన్సీ విదేశీ విలేకరులను కూడా విడిచి పెట్ట లేదు. అమెరికా వారే ఢిల్లీలో 15 మంది ఉంన్నారు. 25 మంది పశ్చిమ యూరప్‌వారు, 20 మంది తూర్పు యూరప్ దేశాల వారు పనిచేసేవారు. పీటర్ హాజెల్ హ్రస్ట్ (లండన్ టైమ్స్) తరెన్ జెండిన్ ్స (న్యూస్ వీక్) పీటర్ గిల్ (లండన్ డెయిలీ టెలిగ్రాఫ్)లకు 24 గంటలలో దేశం విడిచి వెళ్లమని ఆదేశించారు. విదేశీ పత్రికలు ఏదో మార్గంలో భారతదేశ వార్తలను ప్రచురించాయి.దేశంలో జరుగుతున్నదేమిటో సాక్షాత్తు ప్రధానికి తెలి యకపోవడానికి మూల కారణం సెన్సార్షిప్. సెన్సార్షిప్ను తొలగించమని 1975 జూలై 5న తనను కలిసిన ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్‌కు ఇందిర చెప్పిన సమా ధానం – దేశాన్ని రక్షించడానికి సెన్సార్షిప్ విధించానని (ఆరో తేదీ పత్రికలు ఈ విషయాన్ని వెల్లడించాయి). కానీ జరిగినదేమిటి మారుతి కారు ఉదంతం, స్నేహలతా రెడ్డి విషాదాంతం, పోలీసుల అరాచకాలు, ‘కిస్సా కుర్సీకా’, ‘ఆంధీ’ సినిమాల నిలిపివేతలు, బలవంతపు ఆపరేషన్లు, అరెస్టులు, తుర్క్‌మన్ గేట్, పోలీసు కాల్పులు, కూల్చివేతలు... అన్నీ సెన్సార్ ఇనుప తెర వెనుక ఉండిపోయాయి.డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త ‘జాగృతి’ సంపాదకుడు ‘ 98493 25634 -
నేటి మాటేమిటి?
వలసానంతర భారత చరిత్రలో అత్యంత ప్రాధాన్యత గల పరిణామమైన ఎమర్జెన్సీకి ఈ జూన్ 25 అర్ధరాత్రికి యాబై ఏళ్లు నిండాయి. ప్రాథమిక హక్కులను రద్దు చేసి ప్రజల హక్కులను కొల్లగొట్టడం, అక్రమంగా నిర్బంధించడం, బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల వంటి ఇష్టారాజ్యపు విధానాలను రుద్దడం, నగర సుందరీకరణ పేరుతో నివాస స్థలాలను కూల్చి వేయడం, అధికార, న్యాయ వ్యవస్థలను సొంత ప్రయోజనాల కోసం దుర్విని యోగం చేయడం భారత రాజ్యానికి కొత్తేమీ కాదు గానీ, ఆ పనులన్నీ జరిగిన ఎమర్జెన్సీకి ఆ స్థాయిలో అపకీర్తి రావడానికి ఒక కారణం ఉంది. అప్పటివరకూ ఆ దమనకాండ అంతా సాధారణ ప్రజల మీద అమలవుతుండినప్పటికీ, ఎమర్జెన్సీయే మొదటిసారిగా మధ్యతరగతికి, తెల్లబట్టలవాళ్లకు, పార్లమెంటరీ రాజకీయ ప్రత్యర్థులకు కూడా భారత రాజ్యపు దెబ్బల రుచి చూపింది. పాఠాలు నేర్చుకున్నామా?ఆ ఎమర్జెన్సీ కాళరాత్రి గడిచిపోయి ఐదు దశాబ్దాలు గడిచింది. ఇందిరా గాంధీతో సహా ఆ కాళ రాత్రికి కారకులైనవారిలో అత్యధికులు మరణించారు. బాధితులలో కూడా చాలా మంది మరణించారు, లేదా తమ జీవితపు చరమాంకంలో ఉన్నారు. ఇప్పుడు ఆ పాత ఎమర్జెన్సీ గురించి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం, విమర్శించడం కేవలం అకడమిక్ ఆసక్తే తప్ప వర్తమాన ఆచరణ కాదు. కాకపోతే ఆ ఎమర్జెన్సీ అనుభవం తర్వాత ఈ దేశం మరెప్పుడూ అటువంటి పరిస్థితి రాగూడదని ఆకాంక్షించింది గనుక వర్తమాన పాలనలను విమర్శనాత్మకంగా చూడటం అవసరం, సముచితం కూడా!ఎమర్జెన్సీ అనంతరం వేలాది పేజీల వివరణలు, విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. బాధితులు ఎవరైనప్పటికీ ఎమర్జెన్సీ అత్యాచారాలకు అటువంటి నిరసన రావడం సముచితమే. ఆ నిరసన వ్యాప్తి వల్లనే 1977 మార్చ్ ఎన్నికలలో ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు ఓటమికి గుర య్యారు. ఆ ఎన్నికల్లో గెలిచిన జనతా పార్టీ ప్రభుత్వం ఎమ ర్జెన్సీ అత్యాచారాలను పరిశో ధించడానికి, విచారణ జరపడా నికి మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ జయంతిలాల్ ఛోటాలాల్ షా నేతృత్వాన 1977 మేలో ఒక కమిషన్‌ను నియమించింది. షా కమిషన్‌గా సుప్రసిద్ధమైన ఈ కమిషన్ అనేకమంది సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలు సేకరించి 1978 మార్చ్, ఏప్రిల్, ఆగస్ట్ లలో మూడు భాగాల నివేదిక సమర్పించింది. వర్తమాన వాస్తవంఆ 543 పేజీల నివేదికను ఇప్పుడు చదువుతుంటే అదేదో గడిచిపోయిన దుర్ఘటనల మీద చారిత్రక పత్రం అనిపించదు. నామవాచకాలు మారిస్తే, గత పదకొండు సంవత్సరాల పాలనా వ్యవహారాల మీద నివేదిక కావ చ్చునని అనిపిస్తుంది. ఈ పాల కులు ఆ ఎమర్జెన్సీ బాధితులు కావడం, ఇప్పటికీ ఆ ఎమర్జెన్సీని నిరంతరం విమర్శిస్తుండటం, తమ పాలనలో పదకొండు సంవత్సరాలుగా అవే ఎమర్జెన్సీ విధానాలను ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అమలు చేస్తుండటం క్రూరమైన పరిహాసం. ‘‘ఆచరణలో, ప్రభుత్వానికి అనుకూలంగా లేని వార్తలను తొక్కిపట్టడానికి, ప్రభుత్వానికి అనుకూ లమైన వార్తలను పైకెత్తడానికి, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు అనుకూలంగా లేని వార్తలను తొక్కి పట్టడానికి సెన్సార్షిప్ విధానాన్ని దుర్వినియోగం చేశారు’’ అని అప్పుడు షా కమిషన్ నివేదిక రాసింది. ఇప్పుడు అధికారికంగా సెన్సార్షిప్ విధానం ఏమీ లేదు. కానీ ప్రభుత్వానికి, అధికార పార్టీకి అనుకూలంగా లేని వార్తలను తొక్కిపెట్టే విధానాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అప్పుడు ఎమర్జెన్సీలో ఆంతరంగిక భద్రతా చట్టం (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్– మీసా), డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ అనే ముందస్తు నిర్బంధ చట్టాలను వినియోగించుకుని, కారణాలు చూపకుండా, విచారణ జరపకుండా లక్ష మందిని ఇరవై ఒక్క నెలల పాటు నిర్బంధించారు. ఇప్పుడు బెయిల్ ఇవ్వడాన్ని కఠినతరం చేసే సవరణలతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఆన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద వేలాది మందిని నిర్బంధించి, అబద్ధపు ఆరోపణలతో, విచారణ లేకుండా ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు. అప్పుడు ఒక్క తుర్క్‌మన్ గేట్ మురికివాడ కూల్చివేత జరిగితే, ఇప్పుడు కనీసం అర డజను రాష్ట్రాల నుంచి కూల్చివేతల వార్తలు నిరంతరం వస్తున్నాయి. ‘‘ప్రభుత్వంలోనో, ప్రభుత్వానికి దగ్గరగానో ఉన్న ఒక వ్యక్తి, లేదా ఒక బృందం వ్యక్తిగత ప్రయో జనాలు నెరవేర్చడం కోసం అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం భవిష్యత్తులో జరగకుండా ఉండే చర్యలను చేపట్టడం వర్తమాన, భావి తరాల కోసం జాతి చేయవలసిన పని’’ అని జస్టిస్ షా 1978లో రాశారు. ఆ హితవచనంలో ప్రస్తావించిన వ్యక్తీ, బృందమూ మారి ఉండవచ్చు గాని నేటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. యాభై ఏళ్లు నిండిన సందర్భంగా చాలా మంది నాటి ఎమర్జెన్సీని సరిగ్గానే తలచు కున్నారు. కానీ కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ సంగతి ఏమిటి? ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు -
దేశమే జైలు!
స్వతంత్ర భారతావని చరిత్రలో 1975 నుంచి 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ పాలనలో అధికార దుర్వినియోగం జరిగింది. ప్రజాస్వామిక హక్కు లను కాలరాచారు. ప్రతిపక్షాల నిరసన గళాన్ని నొక్కేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. నాటి దుశ్చర్యలను పాలక పక్షం వల్లె వేస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ వాటిని తిరస్కరించగలదా? లేదు. అందుకే ‘‘మరి మీ మాటేమిటి? అంతకంటే ఎక్కువగానే మీరు ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిస్తున్నారు కదా’’ అంటూ ఎదురు దాడికి దిగుతోంది. ఈ దూషణల హోరులో ఆ భయానక దుర్ఘటనల నుంచి నేర్వాల్సిన పాఠాలు కొండెక్కే ప్రమాదం ఉంది.జైలు అనుభవాలుఎమర్జెన్సీలో ఆంతరంగిక భద్రతా నిర్వహణ చట్టం కింద 34,988 మంది, భారత రక్షణ చట్టం, నిబంధనల కింద 75,818 మంది అరెస్ట్ అయ్యారు. తమిళ నాడు కేడర్‌లో నేనప్పుడు 30 ఏళ్ల జూని యర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నాను. ఆకస్మి కంగా నన్ను నేనే జైల్లో వేసుకున్నట్లు ఫీల్ అయ్యాను. నా ఆలోచనలు మనసు లోనే బందీ అయ్యాయి. దేశ అత్యున్నత నేత జయప్రకాశ్ నారాయణ్‌ను తెల్లవారక ముందే మూడింటికి నిద్రలేపి జైలుకు తరలించారు. ఆ సమయంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏమిటో తెలుసా? ‘వినాశ కాలే విపరీత బుద్ధి’!మొరార్జీ దేశాయి, వాజ్‌పేయి, అడ్వాణీ, చరణ్ సింగ్, చంద్రశేఖర్ వంటి జాతీయ నాయకులను లోపల వేశారు. అప్పటి సీపీఎం విద్యార్థి నాయకులు ప్రకాశ్ కారత్, సీతారామ్ ఏచూరి, బీజేపీ అరుణ్ జైట్లీలనూ ఊచలు లెక్కపెట్టించారు. ఆ తర్వాత కొద్ది నెలలకు, అజ్ఞాతంలో ఉన్న జార్జి ఫెర్నాండెజ్‌ను పట్టుకున్నారు. ఆయన మద్దతుదారు స్నేహలతారెడ్డిని జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. పెరోలు మీద బయటకు వచ్చిన కొద్ది కాలంలోనే ఆమె చనిపోయారు. జైలు అనేది రాజ్యపు అత్యంత వికృత పార్శ్వం. ఇవన్నీ చూశాక ఈ భావన నాలో మరింత బలపడింది. నేను నా ఐఏఎస్ కెరీర్లో కలెక్టర్‌గా ఎప్పుడూ పనిచేయలేదు. దాంతో కారాగారాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలగలేదు. జైళ్ల స్థితిగతులను స్వయంగా తెలుసుకోవాల్సిందిగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఓసారి రాష్ట్రాల గవర్నర్లను కోరారు. నేరస్థుల దిద్దుబాటు గృహం (జైలు) ఎలా ఉంటుందో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ఆ సమయంలో తెలుసుకున్నాను.ఒక జైలును చూడ్డానికి వెళ్లినప్పుడు, గడ్డం పెంచుకున్న ఓ యువకుడు నా దగ్గరకు వచ్చి హిందూస్థానీలో మాట్లాడాడు. ‘‘హుజూర్! నేను పాకిస్తాన్ వాడిని. నేను ఒక మొక్కు తీర్చుకోడానికి అజ్మీర్ షరీఫ్‌కు వెళ్లాలనుకున్నాను. నేను చేసిన పొరబాటల్లా ఒంటరిగా బయలు దేరడమే. దాంతో నన్ను టెర్రరిస్టుగా అనుమానించి నిర్బంధంలోకి తీసుకున్నారు. నేను మిమ్మల్ని ఏదీ కోరను, ఏ ఫిర్యాదూ చేయను. మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఈ జైల్లో పెట్టి ఇండియా నాకు మేలు చేసింది. ఇక్కడి లైబ్రరీలో నాకు పవిత్ర ఖురాన్ కనిపించింది. మొదటిసారి నేను ఖురాన్ మొత్తం చదివాను.’’ అతడికి ఏం బదులు చెప్పాలో అర్థం కాలేదు. వ్యంగ్యంగా అంటున్నాడా? నిజంగానే మెచ్చుకోలుగా అంటున్నాడా? ఎలా అయినా అతడు పూర్తి మేధావి.మరో దిద్దుబాటు గృహం సందర్శించాను. అక్కడి నుంచి వెనుదిరుగుతుండగా, కట్నం చావుల కేసులో శిక్ష అనుభవిస్తున్న వృద్ధురాలు కనబడింది. ఆమెను, అక్కడి ‘పాగల్ వార్డు’ను చూసి చలించి పోయాను. ఇంతలో అందులోని ఓ బెంగాలీ యువకుడు నన్ను ఆపి, ‘‘ఇక్కడ మాకు లైబ్రరీ ఉంది. దానికి మంచి పుస్తకాలు పంపించండి’’ అని అడిగాడు. మరోచోట, ‘‘సర్! ఒక్కరోజు ఇక్కడ టీవీ పెట్టించండి, వింబుల్డన్ ఓపెన్ చూస్తాం’’ అంటూ ప్రాధేయపడ్డారు. వారి కోరిక తీరింది. వారిలో హంతకులు, రేపిస్టులు, దొంగలు కూడా ఉంటారు. కానీ ఆ ఒక్కరోజు వాళ్లూ మనలాగే రఫేల్ నాదల్, రోజర్ ఫెదరర్ ఫ్యాన్లుగా మారి ఆనందించారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి!నేడు ఇండియలో ఎమర్జెన్సీ లేదు. కానీ జైలు అనే ‘హారర్ ఆఫ్ ది హారర్స్’ ఉంది. ఇది బాధా కరమైన వాస్తవం కాదా? ఇవ్వాళ మాత్రం ఇండియాలో రాజకీయ నిర్బంధితులు లేరా? మన రాజకీయ ఆర్థిక వ్యవస్థలో జైలు అనే ముప్పు ఇప్పటికీ పొంచి ఉందా లేదా? ఈ సమయంలో మనం రాజ కీయాలు చేయడం కంటే, చరిత్రను గౌరవించడం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీకి ఇదొక సువర్ణావకాశం. నాటి మానవ హక్కుల, రాజకీయ సంప్రదాయాల, న్యాయ విధానాల అతిక్రమణలు అన్నింటికీ ఆ పార్టీ సుస్పష్టంగా క్షమాపణ కోరాలి. ఎమర్జెన్సీ కాలంలో చెరసాల పాలైన వారిలో ఇప్పటికీ జీవించి ఉన్నవారిలో వయసులో పెద్దవాడు అడ్వాణీజీ. కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన్ని కలిసి వ్యక్తిగత క్షమాపణ చెప్పాలని అనుకోవడంలో తప్పేమైనా ఉందా? అలాగే ప్రభుత్వానికీ ఇది సువర్ణావకాశం. ఎమర్జెన్సీ భయానక ఘటనలను వల్లె వేయడం కంటే మించినది ఏదైనా తలపెట్టాలి. ఈ సందర్భంగా ‘రాజకీయ ఖైదీ’లను విడుదల చేయాలి. హింస, ద్వేషాలను రెచ్చగొట్టక పోయినా కేవలం రాజకీయ అభిప్రా యాల కారణంగా ఇక మీదట నిర్బంధించబోమని ప్రకటించాలి. తద్వారా, భారత శిక్షాచరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాలి. అంతకంటే మించిన అంశం: విచారణ కోసం ఎదురు చూస్తూ జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలను వారికి పడే గరిష్ఠ శిక్షలో సగం కాలం పూర్తి చేసుకున్నట్లయితే (మరణ శిక్ష విధించదగిన నేరాభియోగాలు ఉన్న వారిని మినహాయించి), నేర శిక్షాస్మృతి 436ఎ సెక్షన్ (భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని 479 సెక్షన్)ను సవరించి వారిని విడుదల చేయాలి.గోపాలకృష్ణ గాంధీ వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, ఆధునిక భారత చరిత్ర విద్యార్థి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
క్షమాపణే లేదు... పొరపాటన్న మాటా!
సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ‘ఇందిరా గాంధీ అండ్ ది ఇయర్స్ దట్ ట్రాన్స్‌ఫామ్డ్ ఇండియా’ పేరుతో శ్రీనాథ్ రాఘవన్ ఒక పుస్తకం రాశారు. ఆమె జీవిత చరిత్రకు సంబంధించి దీనిని అత్యంత సాధికారిక మైన, ప్రగాఢమైన పుస్తకంగా చెబుతారు. ఎమర్జెన్సీని ‘స్వతంత్ర భారతదేశపు రాజకీయ చరిత్రలో ఏకైక అత్యంత బాధాకరమైన ఘట్టం’గా రాఘ వన్ అభివర్ణించారు. అది ఎంతటి భయానకమైన అనుభవా లను మిగిల్చిందో నేడు మనకు మనం గుర్తు చేసుకుందాం. ఎమర్జెన్సీకి సంబంధించిన చేదు వాస్తవాలు ఒళ్ళు గగు ర్పొడిచేవిగా ఉంటాయి. ఆంతరంగిక భద్రతా చట్టం (మీసా) కింద 34,988 మందిని నిర్బంధంలోకి తీసు కున్నారు. డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనల కింద 75,818 మందిని అరెస్టు చేశారు. ఇంచుమించుగా మొత్తం ప్రతిపక్షాన్ని అంతటినీ కట కటాల వెనక్కి నెట్టారు. పత్రికలు సెన్సార్‌కు గురయ్యాయి. రాజ్యాంగాన్ని దారుణంగా సవరించారు. జీవించే హక్కును సస్పెండ్ చేశారని న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం పని అయిపోయినట్లేననీ, దానికి ఇంతటితో నీళ్ళు వదిలేసినట్లేననీ ఎమర్జెన్సీ తీవ్ర స్థాయికి చేరిన రోజుల్లో ఎల్కే అడ్వాణీ తన డైరీలో రాసుకున్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఆయన అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించి ఉంటారు. ఇందిరా గాంధీ తన రాజకీయ జీవితాన్ని కాపాడుకునేందుకే ఎమర్జెన్సీ ప్రకటించారనడంలో ఎవరికీ ఇసుమంత సందేహం లేదు. అప్పట్లో ఇందిరా గాంధీ ఎన్నికను అలహా బాద్ హైకోర్టు రద్దు చేసింది. దానిపై సుప్రీం కోర్టు షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వ పాలన చచ్చుబడేలా చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నించ బట్టి అత్యవసర పరిస్థితిని ప్రకటించవలసి వచ్చిందని ఇందిర చెప్పుకొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించవద్దని సైన్యానికి, పోలీసులకు జయప్రకాశ్ నారాయణ్ పిలుపు ఇవ్వడంతో గత్యంతరం లేక ఎమర్జెన్సీ ప్రకటించవలసి వచ్చిందని ఇందిర చెప్పుకున్నా, అది ఆమె తన చర్యను కప్పిపుచ్చుకునే సాకు గానే కనిపించింది. మొత్తానికి, 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని ‘రాజకీయ తిరుగుబాటు’గా శ్రీనాథ్ రాఘవన్ అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే, రాజ్యాంగం ప్రకారం, ఒక సమయంలో ఒకే ఎమర్జెన్సీని ప్రకటించడానికి మాత్రమే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ యుద్ధం (1971) కారణంగా అప్పటికే బాహ్య ఆత్య యిక పరిస్థితి (ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ) అమలులో ఉంది. రెండు – మంత్రి మండలి చేసిన లిఖితపూర్వక సిఫార్సు మేరకు మాత్రమే రాష్ట్రపతి రాజ్యాంగంలోని 352వ అధికరణం కింద ఎమర్జెన్సీ విధించగలుగుతారు. ఆనాటి రాష్ట్రపతి ఫక్రు ద్దీన్ అలీ అహ్మద్ అంతవరకు వేచి చూడలేదు. ప్రధాన మంత్రి వ్యక్తిగత అభ్య ర్థన మేరకే ఆయన ఆ పని చేసేశారు. మూడు – సామూహిక అరెస్టులు చేయడం, జూన్ 25, 26 రాత్రుళ్లు పత్రికా సంస్థలకు విద్యుత్ సర ఫరా నిలిపి వేయడం వంటి పనులకు ‘చట్టపరమైన ప్రాతిపదిక లేదు. ఇదంతా ప్రధానమంత్రి ప్రోద్బలం మేరకే జరిగింది’ అని రాఘవన్ వ్యాఖ్యానించారు.పోనీ ఇందిరా గాంధీ చెప్పినట్లుగానే అప్పట్లో ‘భారత్ భద్రతకు తక్షణ ముప్పు పొంచి ఉందా?’ అని ప్రశ్నించుకుందాం. ఇంటెలిజెన్స్ బ్యూరో అటువంటి నివేదికను ఏమీ సమర్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రకమైన సమా చారాన్ని దేనినీ హోమ్ మంత్రిత్వ శాఖకు తెలియబరచలేదు. అంటే... ఇందిరా గాంధీయే ఈ ఆంతరంగిక ముప్పు ఉన్న ట్లుగా ఒక సాకును సృష్టించుకుని ఉంటారా? ఔననే భావించ వలసి ఉంటుంది. సత్యం ఏమిటంటే... ప్రజాస్వామ్యం గురించి ఇందిరకు ఎన్నడూ ఉన్నతమైన భావన లేదని రాఘవన్ రాసిన పుస్తకం పేర్కొంటోంది. ‘ప్రజాస్వామ్యమే గమ్యం కాదు. అది కేవలం ఒకరు లక్ష్యం వైపు సాగడానికి ఉపయోగపడే వ్యవస్థ మాత్రమే. కనుక ప్రగతి, సమైక్యత లేదా దేశ అస్తిత్వాల కన్నా ప్రజా స్వామ్యం ముఖ్యమైంది ఏమీ కాదు’ అని ఆమె ఒకసారి వాయులీన విద్వాంసుడు యెహుదీ మెనూహిన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అనగానే చాలా మందికి రెండు ప్రచారో ద్యమాలు చప్పును గుర్తుకు వస్తాయి. ఒకటి – కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. రెండు – మురికివాడల నిర్మూలన. ఆ రెండింటికీ ఇందిర చిన్న కుమారుడు సంజయ్ నేతృత్వం వహించారు. తీరా, ఆ రెండూ ఎమర్జెన్సీ విశ్వసనీయతను,ఇందిర వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీశాయి. అయినా, సంజయ్‌పై ఇందిర ఎంతగా ఆధారపడ్డారంటే... వాటిని ఆమె పట్టించుకోలేదు. పైగా, సంజయ్ అన్నయ్య లాంటివాడంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య అధికారికంగా నమోదైంది. ఇందిరకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, సంజయ్‌ను గట్టి, అత్యంత విధేయుడైన మద్దతుదారునిగా ఆమె పరిగణించారు. ఇందిర ముఖ్య కార్యదర్శి పీఎన్ హక్సర్ మాటల్లో ‘ఆ అబ్బాయికి సంబంధించినంత వరకు ఆమె గుడ్డిగా వ్యవహ రించారు.’ ఎన్నికలకు ఇంకా ఒక ఏడాది గడువు ఉన్నప్పటికీ,అందరినీ ఆశ్చర్యపరుస్తూ 1977 జనవరిలో ఇందిరా గాంధీ ఎన్నికలకు పిలుపు నిచ్చారు. అవి ఆమె పాలనకూ, ఎమర్జెన్సీ అంతానికీ దారి తీశాయి. ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాననీ, ఎమర్జెన్సీ విధింపునకు చట్టబద్ధతను చేకూర్చగలననీ గట్టిగా నమ్మబట్టే ఆమె ఎన్నికలకు వెళ్ళి ఉంటారా? లేదా ఎమర్జెన్సీ ఒక తప్పిదమేనని ఆమె ఆ రకంగా అంగీకరించి, చేస్తున్న పులి స్వారీని విరమించి ఉంటారా?వాస్తవం ఏమిటంటే... ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరా గాంధీ ఎన్నడూ క్షమాపణ చెప్పలేదు. అలాగే అది ఒక పొరపాటనీ అంగీకరించనూ లేదు. వివిధ పార్శా్వలలో ఎమర్జెన్సీ తాలూకు ప్రభావం పట్ల మాత్రం ఆమె విచారం వ్యక్త పరిచారు. వాటిని ఆమె అధికార యంత్రాంగ మితిమీరిన చేష్టలుగా భావించారు. ‘ఎమర్జెన్సీ విధింపునకు సంబంధించి మీరు మరో విధంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా?’ అని పాల్ బ్రాస్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా 1978 మార్చి 26న ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె జవాబు ‘లేదు’ అనే పదంతో ప్రారంభమైంది. ఇంక అంతకన్నా సూటిగా చెప్పేది ఏమీ ఉండదనుకుంటా!కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చీకటి రోజులు ఆనాడు, ఈనాడు
మానవ సౌభాగ్యం కోసం ధనమూ, ప్రాణమూ కూడా తృణప్రాయంగా త్యాగం చేసేవారు ఒకరు; స్వార్థం, అధికారం కోసం అక్షరాన్ని, ఆలోచనను, జ్ఞానాన్ని, దేశాన్ని ఖైదు చేసేవారు మరొకరు. ఇద్దరికీ ‘సాక్షి’ ఈ వేదభూమి. అది 1975. దేశం అల్లకల్లోలంగా ఉంది. నిరుద్యోగం, ఆశ్రిత పక్షపాతం, అధిక ధరలు, అవినీతి, బాంబుల పేలుళ్లు... మొత్తం అలజడే. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఆంధ్ర రాష్ట్రాలలో నక్సల్బరీ ఉద్యమం ఊపు మీదుంది. అవినీతి, అన్యాయా లకు వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతంగా ఉంది. మన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఉక్కుపాదంతో అన్ని ఉద్యమాలను అణచి వేస్తున్నారు. ఆలోచనా పరుల మీద కుట్ర కేసులు పెడుతున్నారు.తిరుపతి ఎరుపుమయంతిరుపతిలో 1972లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ స్థాపించ బడింది. అప్పుడు నేను ప్రారంభ సభ్యుడిని. కొంత కాలానికి విద్యార్థి ఉద్యమంలో నేను ప్రముఖ పాత్ర వహించాను. నా మిత్రులు తిలక్, శైలకుమార్, శ్రీధర్, సాకం నాగరాజ, శివారెడ్డి తదితరులతో అనేక ఉద్యమాలు నడిపాం. అధిక ధరలు, అవినీతికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమాలు ఒకెత్తు. అశ్లీల సాహిత్యానికి వ్యతిరేకంగా కేవలం విద్యార్థి నులతో తిరుపతి పురవీధుల్లో జరిపిన ఊరేగింపు మరో ఎత్తు. తిరుపతి గోడల నిండా ఎర్రని అక్షరాలతో నేను, సాకం నాగరాజ విప్లవ నినాదాలు రాసి ఎర్ర తిరుపతిని ఆవిష్కరించాం.చిత్తూరు కుట్ర కేసు బనాయించి, త్రిపురనేని మధుసూదన్ రావు, భూమన్ తదితరులను అరెస్టు చేసినపుడు తిరుపతి కోర్టు ఆవ రణలో నా నాయకత్వంలో జరిగిన విద్యార్థి ఉద్యమం చూసి పోలీ సులే భయపడ్డారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాదు హైకోర్టు తీర్పు వెలువరించింది. దాని ఫలితంగా 1975 జూన్ 25న ప్రధాని దేశంలో ఎమర్జెన్సీ విధించింది. అంతే... దేశానికి చీకటి రోజులు ప్రారంభం అయ్యాయి. జైళ్ల నోళ్లు తెరుచుకున్నాయి. ప్రశ్నించే వారిని, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు. ఎక్కడ చూసినా నిశ్శబ్దం. భయం. కలాలు, గళాలు మూగబోయాయి.ఎమర్జెన్సీ విధించిన 4 రోజుల తర్వాత ఓ అర్ధరాత్రి పోలీసులు నన్ను, మా అన్న భూమన్‌ను, త్రిపురనేని, శివారెడ్డి, కోటయ్య, లాయర్ కృష్ణస్వామి, మిత్రులు శ్రీధర్, శైలకుమార్, చంద్రను అరెస్టు చేశారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఉంచారు. ఉద యాన్నే టాయిలెట్‌కు వెళ్లాలని, అక్కడ తొట్టిలోని నీళ్లను చూస్తే కడు పులో దేవింది. నీళ్ళల్లో వందల పురుగులు. అది కడిగి ఎన్నేళ్లయిందో! ముషీరాబాద్ జైలు జీవితంఆ తర్వాత మా అందర్ని ఒక పాత వ్యానులో హైదరాబాదులోని ముషీరాబాద్ జైలుకు తరలించారు. విప్లవ నినాదాలు చేస్తూనే ప్రయా ణించాం, జైలు ఆవరణలోకి ప్రవేశించాం. మా అందర్నీ ఒకే బ్యార క్లో ఉంచారు. మేమందరం డిటెన్యూలము. నా నంబరు 27. ‘మీసా’ (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్టు) కింద అరెస్టు చేశారు. అంటే నేరస్థులం కాము. నేరం చేస్తామేమో అనే భయంతో ప్రభుత్వం ముందుగా అరెస్టు చేసింది. అప్పటికే జైలులో రాజకీయ ఖైదీగా ప్రొద్దుటూరు ఎం.వి. రమణారెడ్డి, కొందరు స్మగ్లర్లు, గూండాలు ఉన్నారు. ఆ తరువాత రోజు నుంచి నాయకుల ప్రవాహం మొదలైంది. వరుసగా ఆర్.ఎస్.ఎస్. నాయకుడు, ఎమ్మెల్సీ సూర్యప్రకాష్ రెడ్డి, అనంత పురం తరిమెల రామదాసురెడ్డి, జూపూడి యజ్ఞనారాయణ వచ్చారు. జైలులో సౌకర్యాల కోసం పోరాటం చేసి సాధించుకున్నాం.సీపీఎం, పౌరహక్కుల సంఘం నాయకులు, ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఆనందమార్గ్, సోషలిస్టు పార్టీ, జమైతే ఇస్లామ్, ముస్లిం లీగ్ – ఇలా అన్ని పార్టీల నాయకులూ అరెస్ట య్యారు. ఎమర్జెన్సీలో అరెస్టయిన రాజకీయ ఖైదీలలో వయసులో అందరికన్నా పెద్దవాడు మొరార్జీ దేశాయ్, అందరికంటే చిన్నవాడిని నేను.నా పక్క బ్యారక్‌లో ఎందరో పెద్దలు, ఉద్యమ నిర్మాతలు ఉండేవారు. తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, సుంకర సత్యనారా యణ, యలమంచిలి శివాజీ, తరువాత ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు, గవర్నర్లు అయిన బి. సత్య నారాయణ రెడ్డి,వి. రామారావు, ఎన్. ఇంద్రసేనా రెడ్డి (ప్రస్తుతం త్రిపుర గవర్నర్), తుమ్మల చౌదరి వంటి ప్రముఖులు అందులో ఉన్నారు. ఇక వామపక్ష భావాలకు సంబంధించి ఎందరో! వరవరరావు, చెరబండరాజు, జక్కా వెంకయ్య, మదనపల్లెకు చెందిన మా మామ పలవలి రామకృష్ణారెడ్డి, పార్వతీపురం కుట్ర కేసుకు చెందిన నక్సలైట్ నాయకుడు నాగభూషణం పట్నాయక్, శ్రీకాకుళం నక్సల్బరీ పోరాట ప్రముఖుడు వై.కోటేశ్వర రావు, ‘విరసం’ సభ్యుడు యాదాటి కాశీపతి, తరిమెల నాగిరెడ్డి ప్రియ శిష్యుడు ఇమామ్, చల్లా చిన్నపురెడ్డి (దివంగత ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి తండ్రి), కాట సాని ‘గడ్డం’ నరసింహారెడ్డి (కాటసాని రాంభూపాల్‌రెడ్డి తండ్రి), బిజ్జం సత్యంరెడ్డి, అలాగే సి.వి. సుబ్బారావు, ‘పర్స్పెక్టివ్స్’ ఆర్కే (రామకృష్ణ), విను కొండ నాగరాజు, పిరాట్ల వెంకటేశ్వర్లు వంటి ప్రముఖులు ఎందరో జైల్లో ఉన్నారు. అనంతపురానికి చెందిన కామ్రేడ్ సూరి, పరిటాల రవికి బావ అయిన వడ్లమూడి కృష్ణారావును జైలుకు తెచ్చినపుడు శరీరం నిండా గాయాలు! పోలీసుల చిత్రహింసలకు సాక్ష్యం వారి శరీరాలు! అంతమంది పెద్దలు పరిచయం కావడం, వారి మధ్య ఉండటం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ జైలు ఓ పాఠశాలగా, ఒక విశ్వవిద్యాలయంగా నన్ను తీర్చిదిద్దింది. అది నిర్బంధం కాదు, నా జ్ఞానానికి బంధం అయింది. ఆ రోజు దేశ వ్యాప్తంగా లక్షకుపైగా జనాన్ని అరెస్టు చేశారు. మన రాష్ట్రంలోనే దాదాపు మూడు వేల మందిని నిర్బంధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వామపక్ష మహోద్యమ కెరటం జార్జిరెడ్డిని చంపాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్ఎస్ఎస్ నారా యణదాస్ మాతోనే ఉండేవారు. వారిని చూస్తూ ఓ వైపు కోపం, బలవంతపు సహనం. మేము జైలులో ఉండగానే నక్సలైట్ ఖైదీలైన భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీశారు. 1975 డిసెంబరు 31న ఉరి అమలు జరిపారు. ఉరితీతకు వ్యతిరేకంగా రెండు రోజులు నిరాహార దీక్ష చేశాం. ఉరి తీయడానికి రెండు రోజుల ముందు నేను భూమయ్య, కిష్టాగౌడ్‌లను కలసి మాట్లాడాను. అది ఒక ఆనందం. వారి మరణం హృదయానికి శిక్ష.మేము జైలులో ఉండగానే కామ్రేడ్ కరణం నాగరాజు, సుంకన్న, మహదేవన్, నరసింహారెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, నీలం రామచంద్రయ్య పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. విషాదాన్ని మౌనంగా జైలు గోడలకు, రాత్రి మూగగా వెలిగే దీపాలకు చెప్పుకుని చెమ్మగిల్లేవాళ్ళం. నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కె.జి. సత్యమూర్తి (శివ సాగర్) నా భుజం మీద చేతులు వేసి విప్లవ గీతాలు ఆలపించడం ఈనాటికీ మరువలేను. ఒక సాయంత్రం వాలీబాల్ ఆడుకుంటున్న సమయంలో వంగవీటి రంగా వాళ్లు, పింగళి దశర«థరామ్ను కొట్టడం జరిగింది. అపుడు మా డిటెన్యూలకు ‘మేయర్’ సత్యనారాయణ రెడ్డి. వారి దగ్గర మాట్లాడి, పింగళికి క్షమాపణలు చెప్పించాం. తప్పును అంగీకరించే సహృదయత ఆ రోజుల్లో ఉంది. సిద్ధాంతాలు వేరు కాని, మనుషులుగా ఒక్కటే అన్నది ఆనాటి అనుభవం.కటకటాల్లో కలిసిన బంధంజైలులో నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన వై.ఎస్. రాజారెడ్డి పరిచయం. మేము జైలుకు వెళ్లిన కొద్దిరోజుల తర్వాత రాజారెడ్డి, ఆయన పెద్ద కుమారుడు జార్జిరెడ్డి జైలుకు వచ్చారు. అప్పటికే ఆయన వయస్సు యాభై ఏళ్లు. నాకు సుమారు పదిహేడు ఉంటాయి. ఆయన గంభీరంగా కనిపిస్తాడు కానీ మాట్లాడితే సున్ని తమైన మనస్సు తెలుస్తుంది. మా ఇద్దరినీ చెస్ కలిపింది. ఆటలో ఆయన నిష్ణాతుడు. నాకు కొద్దిగా తెలుసు. అయిదారుసార్లు ఆయన ఓడిపోయారు. కొన్ని ఆటల తర్వాత నాకు అర్థమైంది, నన్ను గెలిపించటానికే ఆయన ఓడుతున్నాడని! జీవితంలో కూడా నన్ను ఎప్పుడూ గెలిపించాలనే ఆయన ఆరాటపడేవాడు. ఎందుకు ఏర్పడిందో ఈ బంధం! కటకటాల మధ్య బంధం, జీవిత అనుబంధమైంది. నేను మట్టిలో కలిసే వరకు ఇది గట్టిగానే ఉంటుంది. తాడిపత్రి దగ్గరి వెన్నపూసపల్లి గ్రామానికి చెందిన కామ్రేడ్ సూరి నాకు మంచి స్నేహితుడు. ఇద్దరం కలసి ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి పోలీసుల కన్నుగప్పి పారిపోవాలని ప్రణాళిక వేశాం. ఆసు పత్రికి వెళ్లాం. కానీ విపరీతమైన బందోబస్తు. కుదరలేదు. ఈ రోజు అనుకుంటే నవ్వు వస్తుంది. జైలులో పశుపతి అనే వైద్యుడు ఖైదీల పట్ల దారుణంగా ప్రవర్తించేవాడు. ఒకరోజు నేను, కడపకు చెందిన మా సీమ రాజగోపాల్ రెడ్డి ఇద్దరం అతని మీద దాడి చేశాం. ఇక, జైలు ప్రధాన ద్వారం దగ్గరున్న చెట్టు కింద వెంకయ్య నాయుడు, వారి భార్య ముచ్చటగా ములాఖత్‌లో మాట్లాడుకోవడం ఇంకా గుర్తు. అప్పట్లో ఆయన చాలా అందంగా ఉండేవారు. జైలు అను భవాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. నేను మహాత్మాగాంధీ జీవిత చరిత్ర చదివింది జైలులోనే! గౌతు లచ్చన్న ఆ పుస్తకం ఇచ్చి చదవమన్నారు. జైలులో మేము ఓ లిఖిత పత్రికను నడిపాం. పత్రిక మొత్తం చేతితో రాసి సహచరులకు పంచేవాళ్ళం. అందులో మొదటిసారిగా నేను ఓ కవిత రాశాను. మొదటిది, ఆఖరిది అదే! అయితే ఆ కవితను అక్కడే ఉన్న కవి– విమర్శకుడు కె.వి. రమణారెడ్డి ఎంతో మెచ్చుకున్నారు.నాలుగు గోడల మధ్య దాదాపు రెండేళ్లు గడపవలసి వచ్చింది. దానివల్ల కొందరు అకస్మాత్తుగా మానసికంగా ఇబ్బందిపడేవారు. ఈ రోజు ప్రముఖులైన కొందరు నాయకులు ఆ రోజు, ‘ఇక ఇందిరా గాంధీ మనలను వదలదేమో, ఇక్కడే ఉండిపోవాలేమో’ అని బాధ పడటం, కుటుంబం కోసం చింతించడం నాకు తెలుసు. జైల్లో మాతో పాటు కదిరికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ అని ఒకరు ఉండేవాడు. తరచుగా ఆసుపత్రికి వెళ్లేవాడు. ఏ అనారోగ్యము లేదు. విషయం తెలిసి ఆశ్చర్యపోయాం. ఆసుపత్రిలోని ఓ వైద్యురాలిని ప్రేమించి, ఆ నిర్భంధంలోనే పెళ్లి చేసుకోవడం జరిగింది.రాజకీయంగా అభిప్రాయ బేధాలున్నా అందరం కలసిమెలసి ఉండేవారం. ఎవరికి వారు రాజకీయ పాఠశాలను నిర్వహించుకొనే వారు. వారి వారి సిద్ధాంతాలను వివరించేవారు. కవులు, రచయితలు, కళాకారులు, సిద్ధాంతకారులు అందరినీ ఒకేచోట కలుసు కోవడం, మాట్లాడటం నాకు ఇచ్చిన విజ్ఞానం ఎంతో గొప్పది. అప్రకటిత ఎమర్జెన్సీఏపీలో కూటమి పాలన వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అరెస్టులు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీ చూస్తుంటే అప్పటి ఎమర్జెన్సీ ఎంతో మేలని అనిపిస్తోంది. అది ప్రకటించిన ఎమర్జెన్సీ. ఇది ప్రకటించని ఎమర్జెన్సీ. ప్రశ్నిస్తే జైలు, మాట్లాడితే కేసు, కాదంటే దాడి, కదిలితే తూటా– ఇదీ నేటి వాస్తవం. అప్పుడు కారణంతో ఖైదు చేస్తే, ఇపుడు అకారణంగా ఖతం చేస్తున్నారు. పాత్రికేయుల కలా లను అధికారంతో శాసిస్తున్నారు. నవ్వితే 40 కేసులు పెట్టడం ఈ ముఖ్యమంత్రికే సాధ్యం. ఎమర్జెన్సీ కాలంలో యూత్ కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు నేర్చుకున్న దమన దహన రాజకీయం ఇదేనేమో! రాష్ట్రం రావణ కాష్ఠంగా ఉంది. 6 కోట్ల మందిని ఆరు బయటే ఖైదు చేసి చంద్రబాబు ఆనందిస్తున్నట్లుగా ఉంది. ఎమర్జెన్సీ తర్వాత ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏమయిందో గుర్తు చేసు కోవాలని అధికార చంద్రునికి అనునయంగా గుర్తు చేస్తూ...భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
ప్రజాభీష్టాన్ని వెక్కిరించిన పీడకలకు 50 ఏళ్లు
50 ఏళ్ల క్రితం దేశంలో.. అవినీతి, నిరుద్యోగం, అధిక ధరలకు వ్యతిరేకంగా.. జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో ‘సంపూర్ణ క్రాంతి’ పేరుతో ఉద్యమం ఊపందుకుంది. ప్రజలంతా నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్న పరిస్థితులవి. అదే సమయంలో.. అలహాబాద్ హైకోర్టు కూడా ప్రచారంకోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. ఒకవైపు ప్రజాగ్రహం, మరోవైపు కోర్టు తీర్పుతో.. దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్రమైతే తన పరిస్థితేంటన్న అసహనంతో, అధికారాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఇందిరాగాంధీలో పెరిగిపోయింది. దీంతో సరిగ్గా 50 ఏళ్ల క్రితం, 1975 జూన్ 25 నాడు ఉన్న దేశంలో ‘ఎమర్జెన్సీ’ విధించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ఈ పవిత్రమైన ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ.. ప్రజల హక్కులను హరిస్తూ, ప్రజాస్వామ్యపు నాలుగో మూలస్తంభమైన పత్రికాస్వేచ్ఛకు తిలోదకాలిస్తూ.. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ (Indira Gandhi) తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది.దీన్ని ప్రశ్నించిన ఎందరోమంది మహనీయులను, సామాన్య ప్రజలను నిర్బంధిస్తూ.. దేశాన్ని ఓ జైలు గదిగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను భయభ్రాంతులకు గురిచేస్తూ.. కేవలం తన ఎన్నికను ప్రశ్నించారన్న అక్కసుతో యావద్భారతాన్ని, మన ప్రజాస్వామ్య విలువలను ప్రమాదంలోకి నెట్టేశారు ఇందిరాగాంధీ. 25 జూన్ 1975 నుంచి 21 మార్చ్ 1977 వరకు దాదాపు 21 నెలలపాటు.. కుట్రలు, కుత్రంత్రాలతో ప్రజలను, ప్రజానాయకులను చిత్రహింసలు పెట్టారు. కాంగ్రెస్ నిరంకుశత్వ పాలనకు ‘ఎమర్జెన్సీ’ ఓ మచ్చుతునక.అందుకే ఎమర్జెన్సీ దేశ చరిత్రలో అతిపెద్ద చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. జయప్రకాశ్ నారాయణ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అడ్వాణీ వంటి ఎందరో మంది నేతలను మీసా (మెయింటేనెన్స్ ఆఫ్ ఇంటర్నర్ సెక్యూరిటీ యాక్ట్) చట్టం కింద ఎక్కడికక్కడ నిర్బంధించబడ్డారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) తోపాటుగా లక్షకు పైగా జాతీయభావజాలం ఉన్న నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలను ఎలాంటి విచారణ లేకుండా మీసా కింద జైల్లో పెట్టారు.ఇది కాకుండా.. ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాజ్యాంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. 48 ఆర్డినెన్సులు తీసుకొచ్చిమరీ రాజ్యాంగంలో తమకు ఇష్టమొచ్చిన మార్పులు చేశారు. ఎన్నికలను ఏడాదిపాటు వాయిదా వేసి నియంతృత్వంతో ఇందిర మరోసారి తానే పగ్గాలు చేపట్టారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. నియంతృత్వ పోకడలతో బలవంతంగా కుటుంబనియంత్రణ చర్యలను అమలు చేశారు. జనాభా పెరగడం కారణంగా.. పేదరికం పెరుగుతోందని ఇందిర ప్రభుత్వం తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ నినాదాన్ని ఎన్నికల కోసం వాడుకోవడం తప్ప నిజంగా పేదరికాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ పాలనలో ఇసుమంత ప్రయత్నం కూడా జరగలేదు.పరమపవిత్రమైన రాజ్యాంగాన్ని అవమానించేలా.. మన చరిత్రను, మన మూల విలువలను, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రశ్నించేలా ఆ 21 నెలలపాటు దేశవ్యాప్తంగా పెనువిధ్వంసం జరిగింది. ఈ విధ్వంసాన్ని ఇందిర స్వయంగా పర్యవేక్షించడం నాటి నియంతపోకడలకు అద్దం పడుతుంది.కానీ, 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిరంకుశత్వపు ఆలోచనలు, నియంత పోకడలను రూపుమాపి.. భారతీయ అస్తిత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నం ప్రారంభమైంది. మొదటిసారి పార్లమెంటులోకి వెళ్తున్న సందర్భంలో పార్లమెంటు భవనం మెట్లను నమస్కరించడంతో మొదులుకుని.. చోళుల కాలం నాటి గ్రామ పార్లమెంటు వ్యవస్థకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు బాటలు వేసిన తమిళనాడు, కాంచీపురం జిల్లాలోని ఉత్తర్మేరూర్ గ్రామం గురించి ప్రజల ముందుకు తీసుకురావడం, బసవేశ్వరుడి అభినవమండపానికి ప్రాచుర్యం కల్పించడం, ప్రతిష్టాత్మకమైన సెంగోల్‌ను నూతన పార్లమెంటు భవనంలో ప్రతిష్టించడం.. ఇవన్నీ ప్రాచీన భారతంలోని ప్రజాస్వామ్య పద్ధతులను ప్రజలకు మరోసారి గుర్తుచేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.అదే సమయంలో.. రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందిన హక్కులను వారికి కల్పిస్తూనే, వారి బాధ్యతలను కూడా గుర్తుచేశారు. హక్కులు, బాధ్యతల సమన్వయంతో దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరింది. ప్రజలను చైతన్యవంతులను చేస్తూనే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లిన కారణంగా.. సత్ఫలితాలు వస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదే.. 2 అక్టోబర్, 2014 నాడు ‘స్వచ్ఛభారత్’ అభియాన్‌ను ప్రారంభించి.. ప్రజల మద్దతు కావాలని కోరింది. దీనికి ‘నభూతో, నభవిష్యత్’ అన్నట్లుగా ప్రజలు అండగా నిలిచారు.‘స్వచ్ఛత మన బాధ్యత’గా భావించి రాజ్యాంగం చెప్పిన పౌరబాధ్యతలను నిర్వర్తించారు. ఇది ప్రజాభాగస్వామ్యపు తొలి విజయం. ఆ తర్వాత 2015లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించినపుడు.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ తర్వాత నుంచి ఈ కార్యక్రమం ఏడాదికేడాది కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రజలు ప్రభుత్వాన్ని తమదిగా భావించారు (ఓన్ చేసుకున్నారు) కాబట్టే.. ఇలాంటి కార్యక్రమాలకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నారు. పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలి.. కాబట్టి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నవారు సబ్సిడీ వదులుకోవాలని ప్రధానమంత్రి కోరితే.. కోటిమందికి పైగా స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇలా పెద్దసంఖ్యలో ప్రజలు సమాజం కోసం సబ్సిడీని వదులుకున్న సందర్భం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు.పేదరికంపై గత ప్రభుత్వాలు చెప్పిన మాటలకు చేసిన చేతలకు పొంతన లేదు. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేళ్లలో దాదాపు 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. దీంట్లో సమాజంలోని ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గం కూడా తమ సబ్సిడీలను వదులకుని సహకరించడం.. దేశాభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ అందిస్తున్న సహకారానికి నిదర్శనం. కరోనా టీకా విషయంలోనూ రాజకీయ దురుద్దేశాలతో ప్రతికూల వార్తలను ప్రసారం చేసినా.. ప్రజలంతా మోదీపై విశ్వాసంతో టీకాలు తీసుకున్నారు. ‘డిజిటల్ ఇండియా’తో ఆర్థిక వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందన్న సందర్భంలోనూ స్వచ్ఛందంగా ప్రజలు సహకరించారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి చేర్చేందుకు మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా అకౌంట్లు ఉండాలన్న ప్రధాని మోదీ సంకల్పానికీ భారీ స్పందన వచ్చింది. భారతదేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి పిలుపునిస్తే.. ఇందులోనూ దేశమంతా ఏకతాటిపైకి వచ్చిన ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు.చైతన్యవంతమైన సమాజంలో ప్రజలకు తమ హక్కులు, బాధ్యతలపై సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. దీని ఆధారంగానే ప్రజలు చౌకీదార్లుగా బాధ్యతా వ్యవహరిస్తారు. ఇలా అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే.. ‘ఎమర్జెన్సీ’ వంటి పరిస్థితులు తలెత్తవు. ప్రజలకు హక్కులను కల్పిస్తూ, వారి బాధ్యతలను గుర్తుచేస్తూ వారి ఆకాంక్షలకు, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా వ్యవహరిస్తే ప్రజల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఇలా ప్రజల సహకారం, వారి భాగస్వామ్యంతో తీసుకునే నిర్ణయాలతో ‘ఎమర్జెన్సీ’కి తావులేని పరిస్థితులు నెలకొంటాయనడంలో సందేహం లేదు. చదవండి: ఆ 'చీకటి' కోణానికి మరోవైపు..50 ఏళ్ల క్రితం ‘ఎమర్జెన్సీ’ దేశ ఆర్థిక, సామాజిక, శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థను విధ్వంసం చేసి ప్రజల్లో భయాందోళనలకు రేకెత్తించింది. కానీ ప్రజలు తమకు ఏం కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కారణంగా.. వారి సహకారంతో ఇవాళ ‘ఆత్మనిర్భర భారత్’ వైపు వడివడిగా అడుగులు వేస్తూ.. వికసిత్ భారత్ 2047 (Viksit Bharat 2047) స్వప్నాల సాకారం కోసం ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ విధానాలతోపాటుగా.. ప్రజల భాగ్వస్వామ్యం ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమన్న స్వర్గీయ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన స్ఫూర్తితో దేశమంతా ఈ దిశగా ముందడుగేయాల్సిన అవసరం ఉంది.- జి. కిషన్ రెడ్డికేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు -
ఆ ‘చీకటి’ కోణానికి మరోవైపు...
1975 జూన్ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఈ సంవ త్సరానికి యాభై ఏళ్ళు పూర్తయ్యింది! నిజానికి 1962 నుండి 1968 వరకూ మన దేశంలో ఎమర్జెన్సీ విధించబడిన విషయం మనకెవ్వరికీ తెలీదు. చైనా యుద్ధం వల్ల ఆనాటి ప్రెసిడెంట్ సర్వే పల్లి రాధాకృష్ణన్ దేశంలో ఆత్యయిక పరిస్థితిని విధించారు. అలాగే 1971 నుండి ’77 వరకూ బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో వి.వి. గిరి ఆత్యయిక స్థితి విధించారు. అంటే ఇందిరాగాంధీ మొట్ట మొదటిసారి ప్రమాణస్వీకారం చేసిన 1966లోనూ, రెండవ సారి ప్రధానైన 1971లోనూ మనదేశం అత్యవసర పరిస్థితు ల్లోనే ఉంది. అయితే ప్రజల మీద ఆ పరిస్థితి ప్రభావం లేదు.1975లో మొదటిసారి అంతర్గత ఎమర్జెన్సీ విధించ బడింది. అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఇందిరా గాంధీ మీద ఆ ‘మచ్చ’ ఇప్పటికీ తొలగిపోలేదు. అయితే 1975 నాటి పరిస్థితులు, రాజకీయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని ఈ చిన్న ప్రయత్నం.పాలనకు అవరోధాలు1966 జనవరి 24న ఇందిరాగాంధీ భారత ప్రధాని అయ్యారు. సోషలిస్టు భావాలున్న ఇందిరకు, కేపిటలిస్ట్ భావ జాలాన్ని బలపరిచే మొరార్జీ దేశాయ్ వంటి నాయకుల నుంచి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే వచ్చాయి.1962లో నెహ్రూ నాయకత్వంలో 361 సీట్లు గెలిచిన కాంగ్రెస్, 1967లో ఇందిర నాయకత్వంలో 243 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏదైనా సంపూర్ణ చికిత్స చేస్తే గానీ కాంగ్రెస్ నిలబడే అవకాశాలు కన్పించటం లేదు. ఆ సమయంలో ప్రధాని ఇందిర తన తండ్రి నెహ్రూ సంకల్పించి, అమలు చేయలేకపోయిన ‘ఆవడి’ కాంగ్రెస్ తీర్మానాలను దులిపి బయటకు తీసింది. ఉప ప్రధాని మొరార్జీ చేతుల్లో ఉన్న ఆర్థిక శాఖను తనే తీసేసుకుంది (ఫలితంగా మొరార్జీ ఉప ప్రధాని పదవికి రాజీనామా చేసేశారు).వెంటనే బ్యాంకుల జాతీయీకరణను ప్రకటించింది ఇందిరాగాంధీ. 1969 జూలై 15 నాటికి రూ. 50 కోట్లు మించి డిపాజిట్లున్న 14 బ్యాంకులను ప్రభుత్వపరం చేస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది. ‘దారిద్య్రాన్ని తొలగిద్దాం’ (గరీబీ హఠావో) నినాదంతో సొంత ఎజెండాను అమలుచేయటం ప్రారంభించింది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఇందిర తెచ్చిన ‘బ్యాంకుల జాతీయీకరణ’ ఆర్డినెన్సును సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజభరణాలు (ప్రివీ పర్సులు) రద్దు చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని లోక్‌సభ ఆమోదించినా... రాజ్య సభలో పాస్ కాలేదు. మరోపక్క దేశాన్ని మిలిటరీ స్వాధీనం చేసుకుంటుందన్న పుకార్లు బలంగా వ్యాపించాయి. ఇక, 1974లో గుజరాత్‌లోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో హాస్టల్ మెస్ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన విద్యార్థుల ఆందోళన... అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ (కాంగ్రెస్) వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందింది. పైకి ఈ ఉద్యమం చిమన్‌భాయ్ పటేల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు కనిపించినప్పటికీ, వాస్తవంగా ఇది ఇందిరా గాంధీ వ్యతిరేక ఉద్యమమే!సాక్షాత్తూ జయప్రకాశ్ నారాయణ్ రంగంలోకి దిగడంతో, దాని విలువ విపరీతంగా పెరిగింది. ఏనాడూ ఏ పదవీ ఆశించని ఈ గాంధేయ విప్లవకారుడు... గుజరాత్ ఉద్యమంలోకి రావటంతో ఇందిరకు కష్టాలు ప్రారంభమయ్యాయి.సరిగ్గా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవు తున్న 1975 జూన్ 12 నాడే... ఇందిర శిబిరంలో మరో బాంబు పేలింది. రాయబరేలీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ వంటి అగ్ర నాయకులు ఇందిర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో జయ ప్రకాశ్ నారాయణ్ మాట్లాడారు. అర్హత కోల్పోయిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులను పాటించవద్దని మిలిటరీ, పోలీసులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్ళడం మానేసి, మరో స్వాతంత్య్ర పోరాటంలోకి దూకాలన్నారు.రాజ్యాంగానికి లోబడే...1975 జూన్ 25 అర్ధరాత్రి, ఆర్టికల్ 352(1) అనుసరించి భారత రాష్ట్రపతి ‘ఫక్రుద్దీన్ అలీ అహ్మద్’ దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతికి ఇందిర అత్యవసర స్థితిని సిఫార్సు చేసిన ఉత్తరంలోనే క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే ఈ సిఫార్సు చేస్తున్నాననీ, ఆ విధంగా చేయడం కూడా బిజినెస్ రూల్స్ ప్రకారం రూల్–12కి లోబడే చేస్తున్నాననీ ఆమె పేర్కొన్నారు. రేపు తెల్లవారగానే క్యాబినెట్ మీటింగ్ పెడ్తున్నానని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ విధంగా రాజ్యాంగానికి లోబడే అత్యవసర స్థితి ప్రకటించబడింది.ఎమర్జెన్సీ ప్రకటించిన నెల రోజుల్లోపే... అంటే 1975 జూలై 23న లోక్‌సభ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఆమోదించింది.రెండు రోజుల చర్చ తర్వాత 336 మంది అనుకూలంగానూ, 59 మంది వ్యతిరేకంగానూ ఓటు చేశారు.ఇప్పటికీ అదొక చీకటి రాజ్యమనీ, ఆమె ఒక నియంత అనీ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందనీ, ఆమె వ్యతిరేకులు అంటూనే ఉంటారు. రాజ్యాంగంలోంచే ఆర్టికల్ 352 తీయ బడిందనీ, ఆ అధికరణం ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటించటం రాజ్యాంగ విరుద్ధమెలా అవుతుందనీ నాలాంటి వాళ్ళకనిపించినా... కాంగ్రెస్ పార్టీయే ‘సారీ’ చెప్పాక అది తప్పే అయి వుంటుంది అనుకుని... ఇక మాట్లాడలేదు!యశపాల్ కపూర్ అనే ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ తన రాజీనామాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు జనవరి 13న పంపించాడు. 1971 జనవరి 25న ప్రెసిడెంట్ ఆమోద ముద్ర పడింది. ఆ ఉత్తర్వుల్లోనే జనవరి 14 నుంచి అతను ఉద్యోగంలో లేడని స్పష్టంగా ఉంది (విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్). అయినా 25కి ముందే ఆయన ఇందిర తరఫున పార్టీ మీటింగుల్లో పాల్గొన్నాడని ప్రధాని పదవి రద్దయిపోయింది. సుప్రీంకోర్టులో జస్టిస్ కృష్ణయ్యర్ వంటి జడ్జి ‘స్టే’ ఇచ్చినా ‘‘లెక్క చేయం... నువ్వు రాజీనామా చేయాల్సిందే’’ అనటం అంత పెద్ద నాయకుల స్థాయికి తగుతుందా? సరే... ఎమర్జెన్సీ ఎత్తేయటం, ఎన్నికలకు పిలుపు నివ్వటం, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ పార్టీ ఓడిపోవటం... నిశ్శబ్దంగా అధికార మార్పిడి జరిగిపోవటం... ఈ చర్యలు కూడా ఆవిడ నియంతృత్వంలో భాగమేనా? దేశమంతా చీకటి పాలనకు వ్యతిరేకంగా ఓటువేస్తే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న మన రాష్ట్రంలో ఇందిర 42 సీట్లకు 41 సీట్లు ఎలా గెలిచింది! మనకి చీకటంటే అంత ఇష్టమా? అలాగే తమిళనాడు, కేరళ... దక్షిణ భారతంపై ఆ చీకటి ప్రభావం ఎందుకు చూపలేదు?ఎమర్జెన్సీని దేశప్రజలు అధిక శాతం వ్యతిరేకించారు. కానీ ఎమర్జెన్సీ విధించకుండా 1975 జూన్ 26 తర్వాత... కనీసం ఒక్కరోజైనా ఆమె పరిపాలించగలిగేదా? ఇందిరకు ఉన్న ప్రత్యామ్నాయాలు పరిమితం. ఒకటి: రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకోవడం, రెండు: పార్లమెంటును రద్దుచేసి వెంటనే ఎన్నికలకు పోవడం.ఇప్పటివరకూ ప్రధానమంత్రుల్ని దింపేయటం, ప్రధాన మంత్రులను చేయటం పార్లమెంటులో జరిగింది గానీ... రోడ్ల మీద ధర్నాలు, ఊరేగింపుల వల్ల జరిగితే ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది?1952 నుంచి ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ కూడా 50% ఓట్లు సంపాదించి గెలవలేదు. 1984లో ఇందిర హత్యానంతరం 404 లోక్‌సభ సీట్లు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్‌కు పోలైన ఓట్లు 50% లేవు. అలాంటిది, ఒక ‘స్టే’ చెయ్యబడ్డ, పూర్తిగా టెక్నికల్ అయిన కోర్టు తీర్పును అడ్డు పెట్టుకొని ప్రధాని గద్దె దిగాలంటే... ఎలాంటి దృష్టాంతం (ప్రిసిడెంట్) ఏర్పడుతుంది? స్వతంత్ర, జన్‌సంఘ్ వంటి క్యాపిటలిస్టు పార్టీలు సోషలిస్టు ఇందిరను ఎలాగైనా దింపె య్యాలి అనుకున్నప్పుడు... లొంగిపోవాలా? తిరగబడాలా?ఇందిరా గాంధీ తిరగబడింది. పర్యవసానంగా ఎన్నికల్లో ఓడిపోయింది. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన వారందరూ కలిసి రెండు ఏళ్ళలో ఏం పరిపాలన చేశారో కూడా దేశం చూసింది. ‘ఇందిరా కో బులావో, దేశ్ కో బచావో’ (ఇందిరను పిలవండి, దేశాన్ని కాపాడండి) అంటూ 1980లో మళ్ళీ ఆమెనే పిలిచి ప్రధాన మంత్రిని చేశారు.(ఇప్పటికీ 352 ఆర్టికల్ చిన్న సవరణతో అలాగే ఉంది. అంతర్గత అలజడులు (ఇంటర్నల్ డిస్టర్బెన్స్)కు బదులుగా సాయుధ తిరుగుబాటు (ఆర్మ్›్డ రెబెలియన్) అని సవరించడం గమనార్హం!)ఉండవల్లి అరుణ కుమార్ వ్యాసకర్త లోక్‌సభ మాజీ సభ్యుడు(కాంగ్రెస్) -
మరోసారి ఎమర్జెన్సీ రాకూడదు!
భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ఎమర్జెన్సీ. తన అధికారానికి ముప్పు రావ డంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించి స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయా నికి తెరతీశారు. ప్రజాస్వామ్య పునరుద్ధర ణకు అనేకమంది ప్రతిపక్ష పార్టీల నాయ కులు, ప్రజాస్వామికవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు గొప్ప పోరాటాన్ని నడిపారు. ఈ పోరాటంలో నేనూ భాగమయ్యాను. ఈ క్రమంలో ఏడాదికి పైగా జైలు జీవితం కూడా గడిపాను. ఎమర్జెన్సీ విధించి నేటికి (జూన్ 25) 50 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నాటి నా అను భవాలు ఈ తరానికి తెలియజేయడం సముచితమని భావిస్తున్నాను.అప్పుడు నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రచారక్. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జోన్లో భాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఎమర్జెన్సీ ప్రకటించిన మరునాడే ఆరెస్సెస్‌ను నిషే ధించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు ‘లోక్ సంఘర్ష్ సమితి’ ఏర్పడింది. నేను కూడా అందులో భాగమ య్యాను. అజ్ఞాతంలోకి వెళ్లి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రజలను జాగృతం చేయాలని, ఎమర్జెన్సీ ఎత్తివేతకు ఉద్యమాలు నిర్వహించాలని ‘లోక్ సంఘర్ష్ సమితి’ నుంచి సూచనలు అందాయి. వెంటనే నా వస్త్రధారణ మార్చాను. తెల్లని లాల్చీ, పైజమా వేసుకునే నేనుఅందుకు భిన్నంగా షర్టు, ప్యాంటు, కోటు, టై, బూట్లు ధరించాను. పేరు కూడా ధర్మేంద్రగా మార్చుకున్నాను. జుట్టు కూడా పెంచుకొని మారువేషం కట్టాను. ఎమర్జెన్సీ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం, ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలులో ఉన్న నాయకుల కుటుంబాలకు సహాయం చేయడం మా పని.పత్రికలపై సెన్సార్ విధించడంతో ప్రజలకు ప్రభుత్వ వార్తలు తప్పితే, ఇతర ఏ రకమైన సమాచారం అందేది కాదు. మాకు అందిన రహస్య సమాచారాన్ని బులెటిన్ రూపంలో ప్రచురించి ప్రజలకు, కార్యకర్తలకు పంపిణీ చేసేవాళ్లం. ఒకసారి నిజామాబాద్ జిల్లా కామా రెడ్డి వద్ద రామేశ్వరపల్లి అనే గ్రామంలోని ఒక పెద్ద రామాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంజినీర్ వెంకట్ రామ్‌రెడ్డి వివాహం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు, అందరూ వ్రతంలో పాల్గొని ప్రసాదం తీసుకువెళ్లా లన్న సందేశం కార్యకర్తలకు వెళ్లింది. సుమారు 250 మంది కార్య కర్తలు, మద్దతుదారులు అక్కడకు చేరుకున్నారు. ఎలా తెలిసిందో ఏమో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు దీనిని పసిగట్టారు. పైన సమావేశ మందిరంలో మారువేషంలో ఉన్న నన్ను పోలీసు అధికారి గుర్తించి, పైకి వస్తున్న విషయాన్ని గమనించాను. అప్పుడు ప్యాంటు, టీ షర్ట్ ధరించి మెడలో శిలువ వేసుకొని తన పేరు జాన్‌గా మార్చుకొన్న ఏబీవీపీ నాయకుడు ప్రస్తుత త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి కూడా నా వెంట ఉన్నారు. నేను,ఇంద్రసేనా రెడ్డి ఆ ఆలయం వెనుకవైపున ఉన్న ఇరవై అడుగుల ఎత్తు ఉన్న ప్రహరీ గోడ దూకి అక్కడ నుంచి తప్పించుకున్నాం. మేం పారిపోయిన కొద్దిసేపటికే పోలీసులు కొందరు కార్యకర్తలను అరెస్ట్ చేసి ‘దత్తాత్రేయ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని’ ఒత్తిడి చేశారు.కొన్ని రోజుల తరువాత నేను, నాతో పాటు వరంగల్ విభాగ్ ప్రముఖ్ శ్రీధర్ జీ మారువేషంలో బెల్లంపల్లిలో ఒక చిన్న హోటల్లో భోజనం చేస్తున్నాం. సరిగ్గా అప్పుడే పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడం మొదలు పెట్టారు. శ్రీధర్‌జీ తన పేరు శ్రీధర్ అని ఒప్పుకున్నారు. నేను మాత్రం ‘దత్తాత్రేయ ఎవరో నాకు తెలియదు, నేను మాత్రం కాదు’ అని నిక్కచ్చిగా చెప్పాను. శ్రీధర్జీని ‘మీసా’ క్రింద అరెస్ట్ చేసి వరంగల్ జైలుకి తరలించారు. మరుసటిరోజు పోలీసులు డోసు పెంచారు. చిత్రహింసలు పెడ్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇంతలో ఒక పరిచయస్థుడైన నిజామాబాద్ సెంట్రల్ ఇంటెలి జెన్స్‌లో పనిచేస్తున్న మురళి అనే హెడ్ కాని స్టేబుల్ అక్కడకు వచ్చాడు. వస్తూనే, ‘నమస్తే సార్.. బాగు న్నారా’ అని పలుకరించాడు. అంతటితో ఆగకుండా ‘దత్తాత్రేయ గారూ’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. నేను అతడికి ప్రతిస్పందించడం గమనించిన పోలీస్ అధికారులు ‘నీ పేరు దత్తా త్రేయ కదా’ అంటూ మొత్తం మీద నన్ను ఒప్పించారు. మా కార్య కలాపాల గురించి, ఆదాయ మార్గాలు వంటి వాటి గురించి అడిగినా నేను సమాధానం చెప్పక పోవడంతో ‘మీసా’ కింద అరెస్ట్ చేసి హైదరా బాద్‌లోని చంచల్ గూడ జైలుకి తరలించారు.జైలులో ‘జన్‌సంఘ్’ నేతలు బంగారు లక్ష్మణ్, ఆలె నరేంద్ర... వరవరరావు, చెరబండ రాజు, ఎం.టి. ఖాన్, నాయిని నర్సింహారెడ్డి, కార్మిక నాయకులు చైతన్య, శీతల్ సింగ్ లష్కరి; ఇంకా జమాతే ఇస్లామీ, ఆనంద్ మార్గ్ సంస్థల నాయకులు ఉండేవారు. వారిలో అడ్వకేట్ రాజా బోస్ ఒకరు. మా సిద్ధాంతాలు వేరైనా మేమంతా కలిసి మెలిసి ఉండేవారం. ఇందిరా గాంధీ మమ్మల్ని ఎప్పటికీ విడు దల చేయరని, ఆమె శక్తిని సవాలు చేసే దమ్ము ఎవరికీ లేదని తోటి జైలు ఖైదీలు అంటున్న ప్పుడు రాజా బోస్ డ్రమ్స్ వాయిస్తూ... లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ పాట ‘సవేరే వాలీ గాడీ సే చలే జాయేంగే...’ పాడుతూ మాలో కొత్త ఆశలు రేకెత్తించేవారు. కొన్ని రోజుల తరువాత మా పెద్దన్న మాణిక్ ప్రభు పచ్చ కామెర్లు సోకి మరణించారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి నాకు ఒక ఎస్కార్ట్ ఇచ్చి పంపించారు. మా అమ్మ ఈశ్వరమ్మ ఉస్మాన్ గంజ్‌లో ఉల్లిపాయల వ్యాపారం చేసేవారు. నేను జైలులో ఉన్నప్పుడు మా అమ్మ ములాఖత్‌లో వారానికొకసారి పండ్లు తీసుకొని వచ్చి నా క్షేమ సమాచారాలు తెలుసుకోవడమే కాదు, నాకు ధైర్యవచ నాలు కూడా చెప్పేది. ఒకసారి ములాఖత్‌లో ‘నువ్వు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనను అని అండర్ టేకింగ్ ఇస్తే విడిపి స్తానని మామయ్య హామీ ఇచ్చాడ’ని చెప్పింది. దానికి ‘నువ్వు ఏమ న్నావ’ని అమ్మను అడిగాను. ‘నా కొడుకు ఏమైనా ఎవ్వరి పిల్లనైనా ఎత్తుకుపోయాడా, దొంగతనం చేశాడా? ఏం తప్పు చేశాడని అండర్ టేకింగ్ ఇవ్వాలి?’ అని గట్టిగా ప్రశ్నించానని అమ్మ వివరించింది. ములాఖత్ సమయంలో రికార్డు చేసుకునేందుకు అక్కడ ఉండే స్పెషల్ బ్రాంచ్ అధికారి ఈ మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయారు. మా అమ్మకు రెండు చేతులతో దండం పెట్టి మరీ మెచ్చుకున్నారు. నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చిన ఈ సంఘటన జీవితాంతం గుర్తుంటుంది.జైలులో ఉన్నప్పుడు జైలర్ రామారావుతో నాకు మంచి సాన్ని హిత్యం ఏర్పడింది. 1977 సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమాచారం వారే మాకు తెలియజేశారు. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మాకు రామారావే ఎప్పటికప్పుడు సమాచారం అందించే వారు. ఇందిర, ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఓటమి సమా చారం కూడా వారే మా చెవిన వేశారు. ఈ విషయం తెలి సిన వెంటనే రాజా బోస్ ‘సవేరే వాలీ గాడీ సే చలే జాయేంగే...’ పాట అందుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులు, వారు నియంతృత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.నాటి చీకటి రోజుల్లో తీవ్రమైన నిర్బంధం, ఆంక్షల మధ్య జరిపిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరా టాలను ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం మనపై ఉంది. మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలే తీసుకోవాలి. ఇందుకు ప్రజాస్వామ్యంలో నాలుగు మూల స్తంభాలైన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియాను బలోపేతం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో మరో ఎమర్జెన్సీకి తావివ్వ కూడదు, మన గొప్ప ప్రజాస్వా మ్యానికి భంగం వాటిల్లనివ్వకూడదు. ఇది మన సమష్టి కర్తవ్యం.బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా గవర్నర్ -
ఎప్పటికీ గుణపాఠమే!
ఎమర్జెన్సీ యాభయ్యేళ్ల పూర్తిని గుర్తు చేసుకోవడా నికి రెండు బలమైన కార ణాలు. మొదటిది–స్వతంత్ర భారత చరిత్రలో ప్రజా స్వామ్యంపై తొలి అతి పెద్ద దాడి జరిగి యాభయ్యేళ్లు కావడం. రెండవది– ఎమర్జన్సీ విధించిన ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత అతి శక్తిమంతుడుగా, అంతకంటే బలిష్ఠుడుగా కీర్తనలందుకునే మోదీ ప్రస్తుత ప్రధానిగా ఉండడం. కాంగ్రెస్ విధానాలు, అంతర్గత వ్యవస్థ 1947–67 మధ్య బలహీనమవుతున్నాయి. ఎన్నిక లలో 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటములు కాంగ్రెస్‌ను ఓడించాయి. పశ్చిమ బెంగాల్లో సీపీఎం వరుసగా ఏకైక పెద్దపార్టీగా రాగలిగింది. ఇంటాబయటా సవా ళ్లను ఎదుర్కొన్న ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీ కరణ, రాజభరణాల రద్దు వంటి ప్రగతిశీల భంగిమలతో పాత నేతలను పక్కనపెట్టడం ప్రారంభించారు. బంగ్లాదేశ్ యుద్ధ విజయం ఆమె ప్రతిష్ఠను తారస్థాయికి చేర్చింది. దీంతో 1971లో ఆమె మధ్యంతర ఎన్నికలకు వెళ్లి బెంగాల్లో తప్ప అంతటా అఖండ విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగాల్‌నూ చేజిక్కించుకోవాలని 1972లో సైన్యం సహాయంతో ప్రత్యక్షంగా ఎన్నికల రిగ్గింగ్‌కు పాల్ప డినప్పుడే ఎమర్జెన్సీకి పునాది పడింది. అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి పురాణాల వంటి కారణాలతో ప్రజల్లో నిరసనలు రాజుకున్నాయి. 1974 రైల్వే సమ్మె, బీహార్‌లో జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ఉద్యమం కుదిపేశాయి. పాతకాంగ్రెస్, జనసంఘ్, ఆర్ఎస్ఎస్, సోషలిస్టులు కలసి జేపీ నాయకత్వంలో వేదికగా ఏర్పడితే సీపీఎం సమాంతరంగా ఉద్య మాలు చేస్తూ వచ్చింది. సీపీఐ అప్పటికి ఇందిరతోనే ఉంది. ఈ సమయంలోనే అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ సిన్హా రాయ్‌బరేలీ నుంచి ఆమె ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడం సంక్షోభాన్ని పరాకాష్ఠకు చేర్చి, 1975 జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీకి దారి తీసింది. అదే రాత్రి∙ప్రతిపక్ష నేతల అరెస్టులూ జరిగిపోయాయి.అప్పుడు కర్నూలు ఉస్మానియా కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. అప్పటికే మిత్రుడూ, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌తో సహా చాలామంది అరెస్టులు జరిగిపోయాయి. ఏదో పర్యటనకు వెళ్లిన నాన్న నర సింహయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రాథమిక హక్కులు సస్పెండ్ అయిపోయాయి. జూలై 21న పార్లమెంట్లో ఎమర్జెన్సీ ఆమోదానికై చట్ట బద్ధ తీర్మానం చర్చకు పెట్టినప్పుడు సీపీఎం నాయకుడు ఏకే గోపాలన్ నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ఎస్తో సహా అనేక రకాల ప్రతీప శక్తులనూ అతివాద దుస్సా హసికులనూ అణచివేసేందుకే ఎమర్జెన్సీ అనే అవా స్తవ కథనాలను తిరస్కరించారు. ‘ఇందిరే ఇండియా’ అంటూ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు బారువా చెలరేగి పోతున్నా... ఎమర్జెన్సీ బలహీనతే తప్ప బలం కాదన్నారు గోపాలన్. జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా నేను, మిత్రులు కలిసి విద్యాగోష్ఠి నిర్వహించాము. రాజకీయాలకు అవకాశం లేదు గనక ప్రజానాట్యమండలి పునరు ద్ధరణ కోసం విజయవాడలో జరిగిన సదస్సుకు వెళ్ళాను. ‘అసత్యాల అరణ్యాల్లో/ అతిశ యాల అంధకారంలో/ వాస్త వాల కాంతి కిరణాలు సోకేందుకు/ కళారూ పాలే కాంతి దీపాలని’ కవిత చదివి వినిపించాను. కర్నూలు పోలీసులు ఏవో ఫిర్యాదులు వచ్చాయని సిటీ బస్సుల నుంచి విద్యా ర్థులను దించేసి ఇష్టానుసారం కొట్టేస్తున్నారని నిరసనగా సంతకాలు సేకరించి కలెక్టర్, ఎస్పీలను కలిసి ఆపు చేయించాం. అమ్మ లక్షమ్మ మునిసిపల్ కార్మికుల్లో మహిళా సంఘంలో పని కొనసాగించింది. ఎంఎల్ గ్రూపులు, ఆరెస్సెస్‌లో ఉండే బంధు మిత్రులు ఆ దశలో కలసి వచ్చేవారు (ఆర్ఎస్ఎస్ అధినేత దేవరస్ కూడా ఇందిరాగాంధీకి మద్దతు నిస్తామంటూ లేఖ రాసిన వివరాలు తర్వాత బయ టకు వచ్చాయి). పాలకపక్షం ప్రజాస్వామ్యాన్ని వమ్ము చేస్తున్నప్పుడు దాన్ని కాపాడటం కీలకమనే సూత్రం అప్పుడు ప్రధానంగా పనిచేసింది. ‘ప్రజా శక్తి’ వారపత్రికగా అప్పట్లో నిర్వహించిన రాజకీయ పాత్ర అమోఘమైంది, ప్రభుత్వాన్ని పొగిడేందుకై వచ్చే కథనాలనే వ్యంగ్య శీర్షికలతో ఇచ్చేది. సెన్సా ర్కూ అందేది కాదు. 1977 మొదట్లో హఠాత్తుగా ఎన్నికల సందడి మొదలైంది. జనసంఘ్‌తో సహా చాలా ప్రతి పక్షాలు జనతా పార్టీగా ఏర్పడగా సీపీఎం, ప్రాంతీయ పార్టీలు బలపరిచాయి. నంద్యాలలో పోటీ చేసిన నీలం సంజీవరెడ్డికి మద్దతుగా సుందరయ్య గారి సభ ఏర్పాటైతే పదిహేను రోజులు అక్కడే ఉండి కారులో చుట్టుపక్కల పల్లెలన్నీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేశాను. మొత్తం మీద ఇందిరా,సంజయ్‌లతో సహా కాంగ్రెస్ ఓడి, ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. టెలిఫోన్ ఎక్సేంజిల దగ్గర బోర్డుపై ఫలితాలు ప్రకటిస్తుంటే ప్రజలు కేరింతలు కొట్టడం గుర్తుంది. ఎమర్జెన్సీ చివరలో ఉద్య మావసరాల రీత్యా మా నాన్న ‘ప్రజాశక్తి’కి వెళ్లి ఫలితాల వరకూ పనిచేశారు. అనుకో కుండా 1977 జూలైలో నేను వెళ్లి చేరా.జనతా హయాంలో 42వ రాజ్యాంగ సవరణ ఉపసంహరించ బడింది. సీపీఐ ఆత్మ విమర్శ చేసుకుని వామపక్ష ఐక్యతలో భాగస్వామి అయింది. అప్పటి పరిణామాలు, పార్టీల శక్తుల పాత్ర ఒక్క చోట చర్చించడం కష్టం గానీ నిరంకుశ పోకడలు ఎల్లకాలం సాగ వనేది కీలక పాఠం. ఇప్పుడు విశ్వగురు మోదీ పాలన ‘అప్రకటిత ఎమర్జన్సీ’లా ఉందనే మాట తరచూ వింటుంటాం కానీ అదీ పాక్షిక సత్యమే. ఎమర్జెన్సీ తీవ్రమైన తాత్కాలిక అపశ్రుతి లాటిదైతే... ఇది వ్యవస్థీకృత మైన ఏకపక్ష ధోరణి, హిందూత్వ మత రాజకీయం, కార్పొరేట్ శక్తుల కలయికకు తోడు అంతర్జాతీయంగానూ ద్రవ్యపెట్టుబడి ప్రాబల్యం, మిత వాద జాతి దురభిమాన శక్తుల పెరుగుదల నేపథ్యం. అందుకే ఇప్పుడు మరింత అప్రమత్తత అవసరం, ఎమర్జెన్సీని ఓడించిన విశ్వాసం ఎప్పటికీ స్ఫూర్తి. తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ పత్రికా సంపాదకులు -
యాభై ఏళ్ల చీకటి గాయం
ఏదైనా చారిత్రక పరిణామం మీద సరైన అంచనాకు రావడానికి యాభై ఏళ్ల కాలం విశేషంగా దోహదం చేయగలదు. చరిత్రను పునర్లిలిఖించుకునే బాధ్యత ప్రతి తరం మీద ఉందన్న వాస్తవాన్ని గుర్తిస్తే, 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలాన్నీ, దాని ఫలితాలనూ అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయమే. ఎమర్జెన్సీ విధించిన వారు దేశానికి స్వాతంత్య్రం తెచ్చామని చెప్పే పార్టీ వారు కావచ్చు. అయినా చరిత్ర తీర్పు ముందు అంతా సమానమే. ఎమర్జెన్సీ దేశంలో ‘క్రమశిక్షణ’ తెచ్చిందా? లేక చీకటి యుగంలోకి నెట్టిందా? ప్రేరేపించిన కారణాలేమిటి?1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మంత్రిమండలి సిఫారసుతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 352లోని 1వ నిబంధన ఆ అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది. ఆంతరంగిక భద్రతకు తీవ్ర విఘాతం వాటిల్లితే రాష్ట్రపతి ఈ అసాధారణ చర్య తీసుకుంటారు.ఎమర్జెన్సీ విధించిన సమయానికి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అవి రాజ్యాంగం నిర్దేశించినట్టు ఉన్నాయా? 1974 జన వరి నుంచి చూసినా ఆ పరిస్థితులు కానరావు. కొంచెం గట్టిగా కనిపించే పరిణామం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) సంపూర్ణ విప్లవం మాత్రమే. మెస్‌చార్జీలు తగ్గించాలన్న డిమాండ్‌తో మొదలై, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న స్థాయికి వెళ్లిన గుజరాత్ విద్యార్థి ఆందోళన ఉంది. 1975 జనవరిలో సమస్తిపూర్(బిహార్)లో రైల్వే మంత్రి ఎల్ఎన్ మిశ్రా సభలో బాంబు పేలి, ఆయన చని పోయారు. దీనిని జేపీ ఉద్యమంతో ముడిపెట్టలేక పోయారు.సంపూర్ణ విప్లవానికి మద్దతుగా పార్లమెంటుకు జనతా మార్చ్ నిర్వ హించాలని విపక్షాలన్నీ (సీపీఐ మినహా) నిర్ణయించాయి. ఈ మధ్యలో జరిగిన మరొక అనూహ్య పరిణామం, రాయ్‌బరేలీ ఎన్నిక పిటిషన్‌పై మార్చి 18న అలహాబాద్ హైకోర్టు బోనులో ఇందిర నిలబడటం. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని మొరార్జీ దేశాయ్ ప్రారంభించిన నిరాహార దీక్షను ఏప్రిల్ 13న విరమించారు. ఎన్నికలు జరిపించడానికి ఇందిర సుముఖత వ్యక్తం చేశారు.అయినా స్వతంత్ర భారత చరిత్రను మలుపు తిప్పిన అత్యవసర పరిస్థితి వంటి తీవ్ర నిర్ణయం ఇందిర ఎందుకు తీసుకున్నారు? రెండు తక్షణ కారణాలు. 1971 నాటి సాధారణ ఎన్నికలలో రాయ్‌బరేలీ నియోజక వర్గం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్‌సిన్హా 1975 జూన్ 12న తీర్పు ఇవ్వడం. ఇందిరపై పోటీ చేసి ఓడిన సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ ఈ కేసు వేశారు. అదే రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్ని కలలో ప్రజా తీర్పు వచ్చింది. కాంగ్రెస్ ఓడి, జన మోర్చా గెలిచింది. రెండోది: అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద శాశ్వత స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళితే జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ 1975 జూన్ 25న షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చి, ఇందిరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో ఓటు హక్కు లేకుండా చేయడం. న్యాయ వ్యవస్థ చేసిన ఈ రెండు నిర్ణయాలు, గుజరాత్ ప్రజాతీర్పు ఆమెను ఇరకాటంలోకి నెట్టాయి. కాంగ్రెసేతర పక్షాలు ఇందిర పదవిలో కొనసాగడానికి అనర్హులని ప్రకటిస్తూ ఆ సాయంత్రం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సభ నిర్వహించి కొత్త ఉద్యమం కోసం లోక్సంఘర్ష సమితిని ప్రకటించాయి. ఆ అర్ధరాత్రి రాష్ట్ర పతి ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు. మరునాడు ఉదయం ఆరు గంటలకు ఇందిర నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి మండలి ఎమర్జెన్సీ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి అప్పటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి రాష్ట్రపతి సంతకం పడిన తరువాత తెలిసింది.ప్రతిపక్షం అవసరం లేదా?ఇందిర భారత పాలనా వ్యవస్థకు కొత్త రూపం ఇవ్వాలను కున్నారు. దేశాభివృద్ధి అధ్యక్ష తరహా పాలనలోనే సాధ్యమన్న ఒక వాదాన్ని అప్పటికే ప్రచారంలో పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్‌కాంత్ బారువా ‘ఇందిరే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ అన్నారు. మరొక నినాదం కూడా ఇచ్చారు. ‘వర్తమాన పరిస్థితులలో భారత దేశానికి అసలు ప్రతిపక్షమే అవసరం లేదు’ అని! నాటి హరి యాణా ముఖ్యమంత్రి ఇందిరను జీవితకాలపు అధ్యక్షురాలిగా (పార్టీకి), తద్వారా యావజ్జీవితం దేశ ప్రధానిగా చూడాలని కోరుకున్నారు.ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యం కూడా ఇందిర చర్యకు ప్రాతిపదిక ఇచ్చాయి. ‘సోవియెట్ నాయకుల సలహాతో దేశంలో అత్యవసర పరి స్థితి విధించినట్లు అర్థమైంది. సోవియెట్‌లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారిని సైబీరియాకు పంపిస్తారు. ఇక్కడా ప్రతిపక్షాల వారిని అదే విధంగా జైళ్ల పాలు చేశారు.’ మాజీ గవర్నర్, పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి సుర్జీత్ సింగ్ బర్నాలా రాసిన ‘క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్: స్టోరీ ఆఫ్ ఏన్ ఎస్కేప్’ గ్రంథంలోని వాక్యాలివి. బర్నాలా ఎమర్జెన్సీ బాధితుడే. ‘చిలీ పాలకుడు సాల్వెడార్ అలెండి తరువాత నిన్నే అమెరికా లక్ష్యంగా చేసుకుంది’ అంటూ క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో చేసిన హెచ్చరికతోనే ఇందిరాగాంధీ ఆగమేఘాల మీద అత్యవసర పరిస్థి తిని విధించారన్న వాదన గురించి సంజయ బారు ప్రస్తావించారు. 1975 జూన్ 25 అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్య జయ ప్రకాశ్ నారాయణ్‌ను, మొరార్జీ దేశాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. మరునాడు ఉదయం జనసంఘ్ నాయకులు వాజ్‌పేయి, అడ్వాణీ, మధు దండావతె, మరికొందరిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఆంధ్రలో పెద్దలు గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, జూపూడి యజ్ఞనారాయణ, యలమంచిలి శివాజీ వంటి వారిని అరెస్టు చేశారు. దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ పేరుతో ఆ 21 మాసాలలో దాదాపు లక్ష మందిని అరెస్టు చేశారు. 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఎదురు దెబ్బ తప్పదు!ఎమర్జెన్సీ విధించిన వెంటనే తీసుకున్న చర్య సెన్సార్ షిప్. దీనితో దాదాపు భారతీయ పత్రికలన్నీ మూగబోయాయి. ఇది జూన్ 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆర్ఎస్ఎస్, ఆనందమార్గ్, జమాతే ఇస్లాం, సీపీఐ (ఎం.ఎల్.)లతో సహా 26 సంస్థలపై నిషేధం విధించారు. న్యాయమూర్తులను బదిలీ చేశారు. క్రమశిక్షణ పేరుతో వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆనాడు లోక్‌సభలో ప్రతిపక్షాలన్నింటి బలం అరవై లోపే! కానీ, లోక్ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చరిత్రా త్మక ఉద్యమమే జరిగింది. దాంతో లోక్‌సభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఇందిర 1977 జనవరి 18న ఆకాశవాణి ప్రసంగంలో వెల్లడించారు. 1977 జనవరి 20న జనతా పార్టీ ఆవిర్భవించింది. ఆ ఎన్నికలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ,సంజయ్‌గాంధీ కూడా ఓడిపోయారు. 1977 మార్చి 21న తాత్కాలిక రాష్ట్రపతి బి.డి. జెట్టి ఎమర్జెన్సీని రద్దు చేశారు.ఎమర్జెన్సీ అంటే కొందరు విపక్షాల నాయకుల అర్ధరాత్రి అరెస్టులు మాత్రమే కాదు. కోటీ పదకొండు లక్షల మందికి జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు; మీసా, డిఫెన్స్ ఇండియా రూల్స్ పేరుతో లక్షా పద మూడు వేల మంది అమాయకుల అక్రమ అరెస్టులు; స్వాతంత్య్ర పోరాటం స్ఫూర్తితో ఏర్పడిన రాజ్యాంగానికి జరిగిన తీరని అవమానం. అన్నింటికి మించి భార తీయ ఆత్మకు అది పెద్ద గాయం. న్యాయ వ్యవస్థ, పత్రికా రంగం భంగపడి ప్రజాస్వామ్యం బలహీనమైంది.ఇక అత్యవసర పరిస్థితి, తదితర పరిణామాల ద్వారా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని తానే సిద్ధం చేసుకుంది. బీజేపీ అనే ఒక రాజకీయ పక్షం అలా దేశ రాజకీయ రంగం మీదకు వచ్చింది.డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త ‘జాగృతి’ సంపాదకుడు ‘ 98493 25634 -
వలసదారుల ఏరివేతకు ‘ఎమర్జెన్సీ’!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఊహించినట్లుగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అతి కీలకమైన ఎన్నికల అంశంగా మారిన అక్రమ వలసలపై ఆయన తాజాగా కీలక నిర్ణయం వెలువరించారు. సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచన ఉందని సోమవారం ట్రంప్ ధ్రువీకరించారు. అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతామని తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో ప్రకటించారు! ఈ మేరకు ఓ రిపబ్లికన్ కార్యకర్త చేసిన చేసిన పోస్టును ట్రంప్ రీ పోస్టు చేస్తూ, ‘నిజమే’ అంటూ కామెంట్ జోడించారు. వలసలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తనను గెలిపిస్తే కనీసం 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపుతానని, మెక్సికోతో సరిహద్దులను దుర్భేద్యంగా మారుస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అమెరికాలో ఏకంగా కోటీ 10 లక్షల మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారుల అంచనా. ట్రంప్ భారీ బహిష్కరణ ప్రణాళిక లక్షలాది కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.ట్రంప్ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుండటం తెలిసిందే. తన కేబినెట్‌ను ఇప్పటికే అతివాదులు, వలసల వ్యతిరేకులతో నింపేశారు. ముఖ్యంగా కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ చీఫ్ టామ్ హోమన్‌ను బోర్డర్ జార్ పదవికి ఎంపిక చేశారు. ‘అక్రమ వలసదారులారా! సామాన్లు ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టండి. మీ దేశాలకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది’ అని గత జూలైలోనే రిపబ్లికన్ పార్టీ సదస్సులో హోమన్ హెచ్చరికలు చేశారు. తమ విభాగం తొలుత 4.25 లక్షల మంది అక్రమ వలసదారులను బహిష్కరిస్తుందని ఆయన ఇటీవల పేర్కొన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో రికార్డు సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించారని ట్రంప్ పదేపదే ఆరోపించడం తెలిసిందే. వారంతా అమెరికా రక్తాన్ని విషపూరితం చేశారంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని తిప్పి పంపేందుకు అవసరమైతే 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామన్నారు. -
చిలీని వణికిస్తున్న వింత వైరస్! అల్లాడుతున్న జనం, లక్షణాలివే
శాంటియాగో: గిలాన్ బరే (జీబీఎస్) అని పిలిచే అరుదైన సిండ్రోమ్ ఒకటి దక్షిణ అమెరికా దేశం చిలీని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు. అసలేం చేయాలో ప్రభుత్వానికే పాలుపోవడం లేదు. చివరికి దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... ఏమిటీ జీబీ సిండ్రోమ్? ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తే నరాల వ్యవస్థను శత్రువుగా భావించి దాడికి దిగే అత్యంత అరుదైన (ఆటో ఇమ్యూన్) సిండ్రోమ్ ఇది. నరాలపై ఈ దాడి చివరికి ఒంట్లోని కండరాల వ్యవస్థ మొత్తాన్నీ పూర్తిగా నిర్విర్యం చేస్తుంది. దాంతో విపరీతమైన నిస్సత్తువ, అవయవాలు మొద్దుబారడం వంటి దుర్లక్షణాలు వేధిస్తాయి. ఇది సాధారణంగా కాళ్లలో మొదలై నెమ్మదిగా పైకి పాకుతూ ఒళ్లంతా ఆక్రమిస్తుంది. జీబీఎస్ బాగా ముదిరితే పక్షావాతానికి కూడా దారి తీస్తుందని జిన్ హువా వార్తా సంస్థ పేర్కొంది. పెద్దవాళ్లకు, ముఖ్యంగా మగవాళ్లకు ఇది ఎక్కువగా సంక్రమిస్తుంది. అయితే అన్ని వయసులవారికీ దీనితో రిస్కే! కరోనాతోనూ వస్తుంది...! జీబీ సిండ్రోమ్ ఎందుకు వస్తుందన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. తరచూ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా కాంపిలోబాక్టర్ జెజునీ బ్యాక్టీరియా ఈ సిండ్రోమ్‌కు కారణంగా మారుతున్నట్టు మాత్రం తేలింది. అయితే ఇన్ఫ్లుయెంజా, సైటోమెగలూ, ఎప్‌స్టెయిన్ బర్తో పాటు కోవిడ్ వైరస్ కూడా జీబీఎస్‌కు దారి తీసే ప్రమాదం పుష్కలంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం కలవరానికి గురి చేస్తోంది! గుర్తించడమెలా? ప్రధానంగా రోగ లక్షణాలు, నరాల పరీక్ష ద్వారా జీబీఎస్ ఉనికి బయట పడుతుంది. ముఖ్యంగా స్పైనల్ టాప్, ఎలక్ట్రోమియోగ్రఫీ వంటివి దీన్ని కచి్చతంగా పట్టిస్తాయి. ఇవీ లక్షణాలు... జీబీఎస్ తాలూకు అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరొలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ వెల్లడించింది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు. తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఎంతలా అంటే, మెషీన్ సాయంతో ఊపిరి తీసుకోవాల్సి కూడా రావచ్చు! ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుకుంటాడు! నరాలు బాగా దెబ్బ తింటాయి గనుక నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మం లోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ సలుపుతుంటుంది. ఇతర లక్షణాలు ♦ చూపు తగ్గడం, కంటి కండరాలు దెబ్బ తినడం..మాట్లాడటం, నమలడం, మింగడం కష్టంగా మారడం ♦ చేతులు, అరికాళ్లలో సూదులతో గుచ్చుతున్నట్టు విపరీతమైన బాధ ♦ విపరీతమైన ఒళ్లు నొప్పులు, ముఖ్యంగా రాత్రిపూట ♦ శారీరక, మానసిక సమన్వయ లోపం, నిలకడలేమి ♦ హృదయస్పందన, రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడం ♦ జీర్ణాశయ, పిత్తాశయ సంబంధిత సమస్యలు చికిత్స ఉందా? జీబీఎస్‌కు ఇప్పటికైతే ఇదమిత్థంగా చికిత్స అంటూ ఏమీ లేదు. సమస్య తీవ్రతను తగ్గించి, త్వరగా కోలుకునేందుకు సాయపడే మార్గాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. దీనికి ప్రధానంగా వాడుతున్న చికిత్స ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐవీఐజీ). నరాలపై దాడికి దిగకుండా రోగ నిరోధక శక్తిని ఇది నియంత్రిస్తుంది. - సాక్షి, నేషనల్ డెస్క్ -
మహోజ్వల భారతి: జూన్ 12 ‘జడ్జ్’మెంట్
జూన్ 12 జడ్జ్మెంట్ 1971లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్‌పై గెల్చిన ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. ఆమె ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అలహాబాదు హైకోర్టు జడ్జి జగ్మోహన్లాల్ సిన్హా 1975 జూన్ 12న తీర్పు ఇచ్చారు. దీనిపై ఇందిరాగాంధీ అత్యున్నత న్యాయస్థానంలో స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాంతో ప్రతిపక్ష నాయకులు, ఆమె వ్యతిరేకులు కలిసి పెద్ద ర్యాలీని నిర్వహించాలని; పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఇందిరకు తమ అవిధేయతను తెలియజేయాల్సిందిగా కోరదలిచారు. ఈ సంగతిని పసిగట్టిన ఇందిర పరిస్థితిని చేజారనీయకుండా అదుపులోకి తీసుకురావాలని దేశంలో ఎమర్జెన్సీకి రంగం సిద్ధం చేశారు. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న అత్యయిక స్థితిని ప్రకటించారు. జడ్జి జగ్మోహన్లాల్ సిన్హా ఆనాడు ఇచ్చిnన తీర్పు సాహసోపేతమైనదని ఇటీవల ఒక సందర్భంలో సీజేఐ రమణ ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిర ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఒక కుదుపు తెచ్చిందన్నారు. అక్కడి నుంచి అనేకమంది గొప్ప న్యాయవాదులు, న్యాయమూర్తులు వచ్చారన్నారు. దీననాథ్ గోపాల్ టెండూల్కర్ రచయిత, డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు. మహాత్మా గాంధీపై ‘లైఫ్ ఆఫ్ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ’ అనే ఎనిమిది సంపుటాల గ్రంథాన్ని రాశారు. గాంధీజీకి సన్నిహిత అనుచరుడు, ఫిల్మ్ మేకర్ అయిన విఠల్‌భాయ్ జవేరీతో కలిసి ‘మహాత్మ : లైఫ్ ఆఫ్ గాంధీ, 1869–1948’ అనే డాక్యుమెంటరీని తీశారు. మహాత్మ గాంధీపై ఆయన గాంధీ ఇన్ చంపారన్, గాంధీజీ : హిజ్ లైఫ్ అండ్ వర్క్స్ అనే పుస్తకాలు కూడా రాశారు. దీననాథ్ 1972 జూన్ 12న మరణించారు. ఆయన జన్మస్థలం మహరాష్ట్రలోని రత్నగిరి. -
Tokyo Olympics: ‘రాజకీయాలతో చంపేస్తారా’
టోక్యో: ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది టోక్యోలో ఒలింపిక్స్ జరుపుతామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్వహణా కమిటీ పదే పదే చెబుతున్నా... స్థానికంగా మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఒలింపిక్స్ రద్దు చేయాలంటూ కోరుతున్న పిటిషన్‌కు అనుకూలంగా 3 లక్షల మంది ఇప్పటికే సంతకాలు చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా... పలు చోట్ల సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. జపాన్ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జాతీయ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక పత్రికలో వచ్చిన ఒక ప్రకటన అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘వ్యాక్సిన్లు లేవు, వైద్యం లేదు, వెదురు బొంగులతో చేసిన ఆయుధాలతో మేం పోరాడాలా. పరిస్థితులు మారకపోతే ఈ రాజకీయాల కారణంగానే మేం చచ్చిపోతాం. ఏడాది కాలంగా మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఏం చేయాలి’ అని రాసి ఉన్న ప్రకటనలో జపాన్ దేశ ప్రజల్లో పెరిగిపోతున్న అసహనం కనిపించింది. -
అమెరికాలో ఎమర్జెన్సీ
వాషింగ్టన్: వైరస్ విస్తృతి నేపథ్యంలో తమ దేశంలో అత్యవసర పరిస్థితిని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కరోనా కారణంగా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో వ్యాధి నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 5,700మందికిపైగా మరణించగా, 137 దేశాల్లో 1.51లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. అమెరికాలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు రెండు వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. ‘పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది’ అని వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో చెప్పారు. ప్రభుత్వం ఈ వ్యాధిపై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టేందుకు వీలుగా నేషనల్ ఎమర్జెన్సీని విధించినట్లు ప్రకటించారు. అమెరికా చట్టాల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా భారీ ఎత్తున నిధులు అందుతాయి. దేశంలోని అన్ని ఆసుపత్రులు అత్యవసర పరిస్థితులకు సంబంధించిన ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అమెరికా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రికి విశేష అధికారులు లభిస్తాయి. వైద్యులు, ఆసుపత్రులు, ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ చికిత్సకు సంబంధించి తగిన చర్యలు తీసుకునేందుకు వెసలుబాటు లభిస్తుంది. ప్రజలందరికీ వైద్యసేవలు అందించేందుకు వీలుగా అన్ని అడ్డంకులను తొలగిస్తున్నట్లు ట్రంప్ విలేకరులతో చెప్పారు. ముడిచమురు ధరలు తగ్గివస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక నిల్వలను భారీగా పెంచాలని ట్రంప్ అధికారులను ఆదేశించారు. పరీక్షలు చేయించుకున్నా: ట్రంప్ వ్యాధి లక్షణాలేవీ లేకున్నా... తాను కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల కోసం వేచిచూస్తున్నానని ట్రంప్ తెలిపారు. తనను కలసిన బ్రెజిల్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఫాబియో వాజ్న్గార్టేన్కు వైరస్ సోకిన నేపథ్యంలో ట్రంప్ ఈ విషయం చెప్పారు. ► వైరస్ నేపథ్యంలో ఇటలీ వీధులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వారాంతపు రోజైన శనివారం రోమ్‌లో ఖాళీ వీధులు, మూసివేసిన దుకాణాలే దర్శనమిచ్చాయి. ఇటలీలో 17,660 మంది కోవిడ్ బారిన పడటం, 1226 మంది మరణించారు. ప్రధాని గుసెపీ కాంటే శుక్రవారం వ్యాపారవేత్తలతో, సంఘాలతో భేటీ అయ్యారు. దేశం స్తంభించిపోలేదని, ఉద్యోగాలు చేసుకునే వారికి రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ► కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మరిన్ని మాస్కులు, మందులు పంపాల్సిందిగా ప్రధాని మోదీని కోరినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తెలిపారు. ► ఆఫ్రికా దేశం రువాండాలో ఒక భారతీయుడు కోవిడ్ బారిన పడ్డాడు. ముంబై నుంచి మార్చి 8న కిగాలికి వచ్చిన వ్యక్తికి కోవిడ్ సోకిందని రువాండా ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ► స్పెయిన్‌లో శుక్ర, శనివారాల మధ్య సుమారు 1500 మంది కరోనా బారినపడ్డారు. ఈ కొత్త కేసులతో ఇటలీ తరువాత అత్యధిక (5753) కేసులున్న దేశంగా స్పెయిన్ మారింది. స్పెయిన్‌లో ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా 136 మంది మరణించారు. వారం రోజుల్లో పదిరెట్లు పెరిగిన రోగబాధితులను దృష్టిలో ఉంచుకుని దేశం మొత్తమ్మీద నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ప్రధాని పెడ్రో శాంచెజ్ సిద్ధమవుతున్నారు. ► కోవిడ్‌పై పోరాడేందుకు దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) ఏర్పాటు చేస్తున్న సమావేశం మన పౌరులకు ఉపయోగపడే ఫలితాన్ని ఇస్తుందని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ప్రధాని ఈ భేటీని నడిపించనున్నారు. మోదీ నాయకత్వంలో ఈ భేటీ సాగేందుకు శ్రీలంక అధ్యక్షుడు గోతబయ రాజపక్స, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహిమ్ మొహమ్మద్ సోలిహ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రీమియర్ లోతయ్ షెరింగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అఫ్గానిస్తాన్ ప్రభుత్వాలు అంగీకరించాయి. చివరగా పాకిస్తాన్ కూడా దీనికి అంగీకరించింది. ఇరాన్లో ఒక్కరోజే 97మంది బలి ► కరోనా మహమ్మారికి ఇరాన్లో శనివారం ఒక్కరోజే సుమారు 97 మంది బలి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 611కు చేరుకుందని, 12,729 మంది వ్యాధి బారిన పడ్డారని ఇరాన్ అధికార టెలివిజన్ ఛానెల్ ప్రకటించింది. చైనా, ఇటలీల తరువాత ఇరాన్‌లోనే అత్యధిక సంఖ్యలో కోవిడ్ బాధితులున్నారు. ► చైనాలో మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. తాజాగా శుక్రవారం చైనా మొత్తమ్మీద 13 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా కొత్తగా వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 11గా ఉంది. నిర్ధారిత కేసుల సంఖ్య 80,8254కు చేరుకున్నట్లు ఆరోగ్య కమిషన్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ చైనాలో 3,189 మంది కోవిడ్ కారణంగా మరణించారు. -
కరోనా ఎఫెక్ట్: అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ
వాషింగ్టన్: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ(నేషనల్ ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అదే విధంగా కరోనాను అరికట్టేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘సమాఖ్య ప్రభుత్వ అధికారాలను అనుసరించి ఈరోజు జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నాను’’అని శ్వేతసౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో ట్రంప్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న ట్రంప్... ఈ ప్రాణాంతక వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రైవేటు రంగంతో కూడా కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. (కరోనా విజృంభన: వణికిపోతున్న అమెరికా..) అదే విధంగా దేశంలోని ప్రతీ ఆస్పత్రి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అమెరికన్ల వైద్య అవసరాలన్నింటినీ తీర్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. అయితే అమెరికన్లంతా కరోనా పరీక్షల కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదని... వైరస్ లక్షణాలు కనిపించిన వాళ్లు మాత్రమే ఆస్పత్రులకు వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రజలకు ఎదురైన ప్రతీ కష్టాన్ని తొలగించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా కరోనా వైరస్ టెస్టు కిట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.(మనిషిపై కరోనా ప్రభావమిలా..) ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్.. కరోనా టెస్టులు నిర్వహించి, దాదాపు గంటలోపే ఫలితాలు వెల్లడించేందుకు రెండు ల్యాబులను ఏర్పాటు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. డియాసోరిన్ మాలిక్యులర్ ఆఫ్ కాలిఫోర్నియా, క్యూఐఏజెన్ ఆఫ్ మేరీల్యాండ్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 1.3 మిలియన్ల డాలర్లు ఖర్చుచేయనున్నట్లు సమాచారం. ఇక ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి రుణాలపై ఉన్న వడ్డీని మాఫీ చేయడంతో పాటుగా.. భారీ మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయాల్సిందిగా ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాగా కోవిడ్ దెబ్బకు అమెరికా విశ్వవిద్యాలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. ప్రజా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు అక్కడ నిరవధిక సెలవులు ప్రకటించారు.(కోవిడ్ దెబ్బ: భయపడవద్దన్న ట్రంప్!) -
ట్రంప్‌పై దావా వేసిన 16 రాష్ట్రాలు
-
ట్రంప్‌పై దావా వేసిన 16 రాష్ట్రాలు
శాన్ఫ్రాన్సిస్కో: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయం ద్వారా అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 16 రాష్ట్రాలు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ తీసుకున్న రాజ్యాంగాన్ని ఉల్లఘించడమేనని కోర్టులో దావా వేశాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని.. నిధుల కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నాయి. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బీసెర్రా, ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ప్రతిపాదనను తీసుకోచ్చారు. సైనికుల కోసం, విపత్తుల కోసం, ఇతర అవసరాల కోసం కేటాయించిన నిధులను దారి మళ్లీస్తే భవిష్యత్తులో ముప్పు సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేసిన దేశాల్లో.. కాలిఫోర్నియా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, మైనే, మేరీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒరెగాన్, వర్జీనియాలు ఉన్నాయి. అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ కోరినన్ని నిధులిచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో తాజా పరిస్థితి తలెత్తింది. యూఎస్‌లో మరో షట్‌డౌన్ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చే బిల్లులకు అనుకూలంగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓటేసిన మరసటి రోజే ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం గమనార్హం. -
అమెరికాలో ఎమర్జెన్సీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండానే నిధులు పొందేందుకు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం ప్రకటన చేస్తూ అక్రమ వలసల్ని తమ దేశంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని విపక్ష డెమొక్రటిక్ సభ్యులు యోచిస్తున్నారు. మిలిటరీ, డ్రగ్ వ్యతిరేక కార్యక్రమాల నిధుల్ని గోడ నిర్మాణానికి మళ్లించే అవకాశాలున్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపా యి. అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ కోరినన్ని నిధులిచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో తాజా పరిస్థితి తలెత్తింది. మరో షట్‌డౌన్ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చే బిల్లులకు అనుకూలంగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓటేసిన మరసటి రోజే ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం గమనార్హం. ట్రంప్‌ది అధికార దుర్వినియోగం.. అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితిని వి« దించడాన్ని డెమొక్రాట్లు, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అధ్యక్షుడి నిర్ణయాన్ని కోర్టులో సవాలుచేస్తామని హెచ్చరించాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మం డిపడ్డాయి. అయితే ఈ హెచ్చరికల్ని ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. ‘నా నిర్ణయంపై దావా వేస్తే ఆ విచారణా ప్రక్రియ చాలా కాలం కొనసాగుతుంది. చివరికి గెలుపు నాదే’అన్నారు. లేని సంక్షోభం పేరిట ట్రంప్ అత్యవసర పరి స్థితి విధించారని, సైనికుల నిధుల్ని దారి మళ్లి స్తే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసి, సెనెటర్ షూమర్ ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. -
గోడను అడ్డుకుంటే ఎమర్జెన్సీనే!
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ట్రంప్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇందుకు అవసరమైన నిధులు పొందడానికి జాతీయ అత్యవసర పరిస్థితి విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గోడ నిర్మాణానికి 5.6 బిలియన్ డాలర్లు మంజూరు చేయాలని ట్రంప్ ప్రభుత్వం కోరగా డెమొక్రాట్లు అడ్డుపడిన సంగతి తెలిసిందే. గోడ నిర్మాణ ప్రణాళికలకు మద్దతు కూడగట్టేందుకు ట్రంప్ టెక్సస్‌లో పర్యటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించే అవకాశాలపై మీడియా ప్రశ్నించగా..ఆ దిశగా ఆలోచిస్తున్నామని సమాధానమిచ్చారు. గోడకు రోనిల్ సోదరుడి మద్దతు.. ఇటీవల అక్రమ వలసదారుడి చేతిలో హత్యకు గురైన భారత సంతతి పోలీసు అధికారి రోనిల్ రాన్ సింగ్ సోదరుడు రెగ్గీ సింగ్..ట్రంప్ గోడ నిర్మాణ ప్రతిపాదనకు మద్దతిచ్చారు. తమ కుటుంబం మాదిరిగా ఇతరులు బాధపడకూడదంటే సరిహద్దును పటిష్టపరచాలని అన్నారు. టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రెగ్గీ సింగ్.. ట్రంప్ పక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. ‘నా సోదరునిలా మరో పోలీసు అధికారి బలికావొద్దు. ఈ ముప్పును తగ్గించడానికి ఏం చేయాలో చేయండి. మా కుటుంబం మద్దతుగా నిలుస్తుంది’ అని ట్రంప్‌తో రెగ్గీ అన్నారు. మీడియానే ప్రతిపక్షం.. ‘సరిహద్దుల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే డెమొక్రాట్లు వినడం లేదు. అక్కడ కృత్రిమ సంక్షోభం ఉందని కొత్తగా చెబుతున్నారు. నకిలీ మీడియా సంస్థల సృష్టే ఇది. వారు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నారు’ అని సరిహద్దు భద్రత, వలసలపై టెక్సాస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్మీ డబ్బులతో గోడ నిర్మాణం? ఆర్మీ కోర్ ఇంజినీర్ల విభాగంలో నిరుపయోగంగా ఉన్న నిధులతో గోడ నిర్మాణం చేపట్టాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలిసింది. గోడ నిర్మాణానికి కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? నిర్మాణం 45 రోజుల్లో ప్రారంభించొచ్చా? అనే విషయాలు తేల్చాలని ఆర్మీ కోర్‌ను ట్రంప్ ఆదేశించారు. మరోవైపు, కాంగ్రెస్ అనుమతి లేకుండానే నిధులు పొందేందుకు ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ఏం చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు యోచిస్తున్నారు. ట్రంప్ ఎమర్జెన్సీ విధిస్తే ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి ఉన్న అవకాశాలను ప్రతిపక్ష డెమొక్రాటిక్ నాయకత్వం పరిశీలిస్తోంది. -
నిధులివ్వకుంటే.. ఎమర్జెన్సీ
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కాంగ్రెస్ నిధులు మంజూరు చేయకుంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రతిష్టంభన తొలగకుంటే ప్రభుత్వ షట్‌డౌన్ నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగొచ్చని ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులతో చెప్పారు. రెండు వారాలుగా కొనసాగుతున్న పీటముడిని పరిష్కరించేందుకు శుక్రవారం అధ్యక్షుడు, డెమొక్రటిక్ సభ్యుల మధ్య జరిగిన సమావేశం విఫలమైంది. గోడతోనే అక్రమ వలసల కట్టడి.. సమావేశం ముగిశాక ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అనుమతి లేకుండానే గోడ నిర్మాణానికి నిధులు పొందేందుకు అవసరమైతే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తానని వెల్లడించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తనకు ఈ విషయంలో విశేష అధికారాలున్న సంగతిని ప్రస్తావించారు. అయితే పరిస్థితి అంతదాకా రాకపోవచ్చని, కాంగ్రెస్ సమ్మతితోనే ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. గోడతోనే అక్రమ వలసల కట్టడి సాధ్యమన్నారు. విద్యార్థి మేధావుల్లారా వెళ్లకండి అమెరికా ఉత్తమ విద్యా సంస్థల్లో చదువు ముగించుకున్న విద్యార్థులు దేశం విడిచి వెళ్లొద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అమెరికాలోనే ఉండి అక్కడి కంపెనీల అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. వీసా విధానంలోని లొసుగుల్ని సరిదిద్ది మేధావుల్ని, ప్రతిభావంతుల్ని ఆకర్షించేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. -
ఏడు రాష్ట్రాల్లో వరదలకు 774 మంది మృతి
న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు, వరదలు సంభవించి దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 774 మంది చనిపోయారని కేంద్ర హోంశాఖ తెలిపింది. వర్షాలు, వరదల కారణంగా కేరళలో అత్యధికంగా 187 మంది ప్రాణాలు కోల్పోగా.. ఉత్తరప్రదేశ్‌లో 171 మంది, పశ్చిమబెంగాల్లో 170 మంది, మహారాష్ట్రలో 139 మంది దుర్మరణం చెందారని వెల్లడించింది. అలాగే గుజరాత్లో 52 మంది, అస్సాంలో 45 మంది, నాగాలాండ్‌లో 8 మంది చనిపోయారంది. హోంశాఖకు చెందిన నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఎన్ఈఆర్సీ) గణాంకాల ప్రకారం వరదల కారణంగా కేరళలో 22 మంది, పశ్చిమబెంగాల్లో ఐదుగురు గల్లంతయ్యారు. -
ఇబోలా ఎఫెక్ట్: నైజీరియాలో అత్యవసర పరిస్థితి
నైజీరియాలో ఇబోలా వైరస్ విజృంభించడంతో అక్కడి ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అబుజా నగరంలో ఇబోలా విజృంభణపై దేశ రాజధాని నగరంలో ఆరోగ్య అంశాలపై హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ ఓ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓన్యెబుచి చుక్వు తెలిపారు. ఇబోలా వైరస్ సోకినట్లు నిర్ధారించిన ఆరుగురు నైజీరియన్లలో ఒకరు మంగళవారం మరణించారని, మరో ఐదుగురికి చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఇబోలా వైరస్ ముప్పు ఉందని, నైజీరియా అనుభవం ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించిందని ఆరోగ్య మంత్రి చెప్పారు. చేదుగా ఉండే కోలా వక్కలు ఈ అతి ప్రమాదకరమైన వైరస్‌ను అదుపు చేస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆయన తెలిపారు. గడిచిన 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా వచ్చిన ఈ వ్యాధి ఇప్పటివరకు 1711 మందికి సోకగా, నాలుగు పశ్చిమాఫ్రికా దేశాలలో 932 మంది ప్రాణాలను బలిగొంది. గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.