అవినీతి కేసులో శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు యోషిత రాజపక్స బుధవారం అరెస్టయ్యాడు. 38 ఏళ్ల యోషిత నౌకాదళ అధికారిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ నిధులను ఉపయోగించి విదేశీ శిక్షణ పొందినట్లు అవినీతి నిరోధక కమిషన్ ఆరోపించింది.
అవసరమైన అర్హతలు లేకపోయినా నౌకాదళంలో నియామకం పొందడం, అనంతరం ప్రభుత్వ ఖర్చుతో బ్రిటన్‌లో శిక్షణకు వెళ్లడంపై దర్యాప్తు జరుగుతోందని కమిషన్ వెల్లడించింది.
యోషిత ఇప్పటికే రెండు మనీలాండరింగ్ కేసుల్లో నిందితుడిగా ఉండగా, విదేశీ ప్రయాణాలపై కూడా నిషేధం అమల్లో ఉంది. ఈ కేసుల్లో బెయిల్‌పై ఉన్న అతడిని తాజా ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు.
మరోపక్క మహింద రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స్ కూడా ఇటీవల న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2019 ఈస్టర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి అరెస్టు అవకాశాలను నివారించాలని ఆయన కోర్టును ఆశ్రయించగా, ఈ నెల ప్రారంభంలో అతడి విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించబడింది.


