దక్షిణ కొరియా: జైలు నుంచి యోల్‌ విడుదల | South Korea Impeached President Yoon Leaves Detention | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియా: జైలు నుంచి యోల్‌ విడుదల

Mar 8 2025 3:16 PM | Updated on Mar 8 2025 3:39 PM

South Korea Impeached President Yoon Leaves Detention

మార్షల్‌ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల్పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

సియోల్‌: మార్షల్‌ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల్పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. దేశంలో స్వల్పకాలిక మార్షల్‌ లా విధించిన అంశంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన జనవరి చివరిలో అరెస్టయిన సంగతి తెలిసిందే. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సియోల్‌ సెంట్రల్‌ జిల్లా కోర్టు సానుకూలంగా స్పందించింది. మాజీ అధ్యక్షుడికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని నిన్న(శుక్రవారం) ఆదేశాలు జారీ చేసింది.

కాగా, యూన్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అధికారికంగా అరెస్టును చూపకముందే దర్యాప్తు సంస్థ యూన్‌ను నిర్బంధించిందని తెలిపారు. యూన్‌పై విచారణ చేపట్టడం చట్టబద్ధమేనా? అనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయని, వీటికి సమాధానాలు కనిపెట్టాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అధ్యక్షుడిగా హోదాలో యూన్‌ గత ఏడాది స్వల్పకాలం పాటు మార్షల్‌ లా విధించిన సంగతి తెలిసిందే.

దేశంలో అత్యవసర పరిస్థితులు లేకపోయినా మార్షల్‌ లా విధించడం దేశంపై తిరుగుబాటు చేయడమేనని ఆరోపిస్తూ పార్లమెంట్‌ సభ్యులు ఆయనను అభిశంసించారు. అభిశంసనపై రాజ్యాంగ కోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అభిశంసన చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే యూన్‌ తన పదవిని మళ్లీ దక్కించుకొనే అవకాశాలున్నాయి.

అభిశంసన చెల్లుబాటు అవుతుందని ప్రకటిస్తే యూన్‌ అధికారికంగా పదవిని కోల్పోయినట్లే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రెండు నెలల్లోగా జాతీయ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో పదవిలో ఉండగా అరెస్టయిన మొట్టమొదటి అధ్యక్షుడిగా యూన్‌ రికార్డుకెక్కారు. దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పలు కేసుల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, దేశ ద్రోహం, రాజ్యంపై తిరుగుబాటు వంటి కేసుల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. సాధారణ పౌరుల తరహాలోనే విచారణను ఎదుర్కోవాల్సిందే. నేరం నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement