Sheikh Hasina: భారత్‌ను వీడిన షేక్‌ హసీనా టీమ్‌.. | Sheikh Hasina team members leave from India to undisclosed locations | Sakshi
Sakshi News home page

భారత్‌ను వీడిన షేక్‌ హసీనా టీమ్‌.. గుర్తు తెలియని ప్రదేశానికి పయనం

Aug 8 2024 5:35 PM | Updated on Aug 8 2024 7:08 PM

Sheikh Hasina team members leave from India to undisclosed locations

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా షేక్‌ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడమే గాక.. దేశాన్ని వీడిన సంగతి తెలిసిందే. హసీనా, ఆమె సోదరితోపాటు ఆమె టీం మొత్తం ప్రస్తుతం భారత‌లోనే ఉన్నారు. యూపీలోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఇక్కడి నుంచి ఆమె లండన్‌ వెళ్లాలని భావించారు. యూకేలో రాజకీయ శరణార్థిగా వెళ్లాలనుకున్నారు. అయితే అందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఇంకా ఫలించడం లేదు

మరోవైపు హసీనా భవిష్యత్తు ప్రణాళికపై భారత్‌ తాజాగా స్పందించింది. షేక్‌ హసీనా బృంద సభ్యులు భారత్‌ నుంచి వెళ్లిపోయినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.  వారు ఎక్కడికి వెళ్లారనేది తెలియదని తెలిపారు. వారంతా తెలియని  ప్రదేశానికి పయనమైనట్లు చెప్పారు. అయితే ఆమె టీమ్‌ సభ్యుల్లో ఎవరు వెళ్లారో, ఎవరో ఉన్నారనేదానిపై స్పష్టత లేదు. అంతేగాక హసీనా భారత్‌ వీడి వెళ్లే ప్లాన్‌పై తమకు ఎలాంటి అప్‌డేట్‌ లేదని అన్నారు.

యూకే విదేశాంగ కార్యదర్శికి జైశంకర్‌ ఫోన్‌ 
అదే విధంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో మాట్లాడినట్లు రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. బంగ్లాదేశ్, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారని అన్నారు. 

‘బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. అక్కడ శాంతిభద్రతలు పునరుద్ధరించాలని భారత్‌ కోరుకుంటోంది. బంగ్లాలో భారత దౌత్య సిబ్బంది, భారత పౌరుల భద్రత విషయంలో స్థానిక అధికారులతో మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది’ అని తెలిపారు. కాగా ప్రస్తుతం భారత్‌లో ఉన్న హసీనా యూకేలో రాజకీయ ఆశ్రయం పొందుతున్నారనే ఊహాగానాల మధ్య ఈ పరిణామం వెలుగుచూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement