
ఎయిర్‌స్పేస్ ఉల్లంఘనపై రష్యాకు నాటో మరోసారి హెచ్చరిక
బ్రస్సెల్స్: తన సభ్యదేశాల గగనతలాల్లోకి రష్యా యుద్ధ విమానాలు, డ్రోన్లు తరుచూ అక్రమంగా ప్రవేశించటంపై నాటో కూటమి తీవ్రంగా స్పందించింది. పదపదే దుస్సాహసానికి పాల్పడొద్దని రష్యాను హెచ్చరించింది. తన సభ్యదేశాల రక్షణ కోసం అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో పోలండ్, ఎస్తోనియా గగనతలాల్లోకి రష్యా డ్రోన్లు అక్రమంగా ప్రవేశించాయి.
గత శుక్రవారం కూడా మూడు రష్యా ఫైటర్ జెట్లు తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించి 12 నిమిషాలపాటు చక్కర్లు కొట్టాయని ఎస్తోనియా ఆరోపించింది. ఈ ఆరోపణలను రష్యా తోసిపుచి్చనప్పటికీ నాటో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. రష్యా దూకుడును అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ‘సైనికపరంగానూ.. ఇతర మార్గాల ద్వారానూ మా సభ్యదేశాలను రక్షించుకుంటామనటంలో రష్యా ఏ విధమైన సందేహాలు పెట్టుకోవద్దు. ఎటునుంచి ఏ విధమైన ముప్పు వచి్చనా ఎదుర్కొంటాం’అని 32 దేశాల నాటో కూటమి మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 5 ప్రకారం కూటమిలోని ఏ ఒక్కదేశంపై ఇతరులు దాడిచేసినా.. కూటమిలోని అన్ని దేశాలపై దాడిచేసినట్లుగానే పరిగణిస్తామని గుర్తుచేసింది. తమ దేశ సమగ్రత, సార్వ¿ౌమత్వ రక్షణ కోసం నాటో వెంటనే జోక్యం చేసుకోవాలని నాటోను ఎస్తోనియా కోరింది. తమ గగనతలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించే ఎలాంటి వస్తువులనైనా ఎలాంటి చర్చలు లేకుండా నేలకూలుస్తామని పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ సోమవారం ప్రకటించారు. అయితే, ఈ విధానాన్ని కూటమిలోని అన్ని దేశాలు అంగీకరించిందీ లేనిదీ తెలియరాలేదు. ఉక్రెయిన్– రష్యా యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఈ నెల 10న పోలండ్ గగనతలంలో నాటో, రష్యా నేరుగా తలపడ్డట్లు వార్తలు వచ్చాయి. రష్యా డ్రోన్లు పోలండ్‌లోకి ప్రవేశించటంతో వాటిని కూలి్చనట్లు ఆ దేశం ప్రకటించింది.