అత్యంత ప్రాచీన రాతి శిలలు | Rocks in Canada Quebec province found to be the oldest on Earth | Sakshi
Sakshi News home page

అత్యంత ప్రాచీన రాతి శిలలు

Jun 28 2025 5:42 AM | Updated on Jun 28 2025 5:42 AM

Rocks in Canada Quebec province found to be the oldest on Earth

వెలుగు చూసిన అతి ప్రాచీన శిలలు (ఇన్‌సెట్లో) శిలల క్లోజప్‌

 416 కోట్ల ఏళ్ల నాటివి  

కెనడాలో గుర్తించిన పరిశోధకులు  

న్యూయార్క్‌: ఇవేమిటో తెలుసా? భూమిపైనే అత్యంత ప్రాచీనమైన రాతి శిలలు. తూర్పు కెనడాలో క్విబెక్‌ ప్రావిన్స్‌లో హడ్సన్‌ బే తీరంలోని నువాగిటిక్‌ గ్రీన్‌స్టోన్‌ బెల్ట్‌లో వీటిని గుర్తించారు. అయితే వీటి వయసు ఎంతన్నది సైంటిస్టుల నడుమ తీవ్ర భేదాభిప్రాయాలకు కారణమైంది. ఈ బూడిద రంగు రాళ్లు 400 కోట్ల ఏళ్ల కంటే ముందే ఏర్పడినట్లు తొలుత అంచనా వేశారు. కాదు, 308 కోట్ల ఏళ్ల క్రితం నాటివేనని మరికొందరు సైంటిస్టులు చెప్పుకొచ్చారు. 

ఎక్కువమంది మాత్రం 370 కోట్ల ఏళ్లనాటివన్న వాదనను అంగీకరించారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రాళ్ల వయసు లెక్కగట్టి, దాదాపు 416 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని తేల్చారు. అంటే భూమి శైశవ దశలో ఉన్నప్పుడే రూపుదాల్చాయన్నమాట. భూగోళంపై ఇంతకంటే పురాతన రాళ్లు ఎక్కడా లేవని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు.

 భూమి పుట్టుక, చరిత్రను అంచనా వేయడానికి ఈ పరిశోధన తోడ్పడుతుందని భావిస్తున్నారు. ‘‘భూమి తొలినాళ్లకు చెందిన హడియన్, ఆర్కియన్‌ యుగాలకు సంబంధించి మనకిప్పటిదాకా తెలియని ఎన్నో విశేషాలు ఈ శిలల అధ్యయనం ద్వారా వెలుగులోకి వస్తాయి. భౌగోళిక మార్పుల వల్లే ఈ శిలలు ఏర్పడ్డాయి. కాకపోతే ఇప్పటిదాకా చెక్కుచెదరకుండా నిలిచి ఉండడం అద్భుతమే’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ అధ్యయన వివరాలను జర్నల్‌ సైన్స్‌లో ప్రచురించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement