చైనా కంపెనీలతో బైడెన్‌ కుమారుడికి వ్యాపార సంబంధాలు

Report Reveals Joe Biden Son Business Dealings China Companies - Sakshi

బైడెన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు చైనా కంపెనీలతో భారీగా ఆర్థిక లావాదేవీలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ భారీ వివాదంలో చిక్కుకున్నారు. బైడెన్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నప్పుడు అతడి కుమారుడు హంటర్‌ బైడెన్‌ విదేశీ పౌరులతో ముఖ్యంగా చైనీయులతో అనుసరించిన వ్యాపార లావాదేవీలకు సంబందించిన ఒక నివేదికను సెనేట్‌ రిపబ్లికన్లు బుధవారం విడుదల చేశారు. 87 పేజీల ఈ మధ్యంతర నివేదికలో హంటర్‌ బైడెన్‌, డెవాన్‌ ఆర్చర్‌ చైనా ప్రభుత్వంతో బలమైన సంబంధాలు కలిగి ఉన్న చైనా పౌరులతో అనేక ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్లు వెల్లడిస్తుంది. వీరిలో ప్రధానంగా సీఈఎఫ్‌సీ చైనా ఎనర్జీ కో లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు, దాని అనుబంధ సంస్థ చైనా ఎనర్జీ ఫండ్‌ కమిటీ(సీఈ ఫండ్‌) బోర్డు చైర్మన్‌ యే జియాన్మింగ్‌ ఉన్నాడు. అతడితో పాటు యే సహచరుడు, అతని కంపెనీల లావేదేవీల కేర్‌ టేకర్‌ గోంగ్వెన్‌ డాంగ్‌ కూడా ఉన్నట్లు నివేదిక తెలుపుతుంది. కమ్యూనిస్ట్‌ ప్రభుత్వంతో యే బలమైన, విస్తృతమైన సంబంధాలు కలిగి ఉన్నాడు. చైనా ఆర్మీతో కూడా అతడికి గతంలో సంబంధం ఉంది. (చదవండి: బైడెన్‌కే భారతీయుల బాసట)

అంతేకాక యే జియాన్మింగ్‌కు, జో బైడెన్‌ సోదరుడు జేమ్స్‌ బైడెన్‌తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. బైడెన్‌ కుటుంబ సభ్యులకు, చైనీయులకు మధ్య ఆర్థిక లావాదేవీలు, కార్పొరేట్‌ కనెక్షన్‌లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. యే నుంచి హంటర్ బైడెన్ లక్షలు సంపాదించినట్లు నివేదిక తెలిపింది. హంటర్ బైడెన్, అతని కుటుంబం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ పౌరులు, విదేశీ ప్రభుత్వాలతో భారీ ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. హంటర్ బైడెన్, ఆర్చర్ బురిస్మా కోసం పనిచేస్తున్న సమయంలో అవినీతిపరుడైన ఒలిగార్చ్ మైకోలా జ్లోచెవ్‌స్కీతో ఆర్థిక వ్యవహారాలు కొనసాగించారని నివేదిక తెలిపింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ కాలంలో హంటర్ బైడెన్‌, ఆర్చర్ యాజమాన్యంలోని సంస్థలు భారీ మొత్తంలో డబ్బు సంపాదించాయని నివేదిక పేర్కొన్నది. (చదవండి: ట్రంప్‌కు షాకిచ్చిన రిపబ్లికన్లు)

హంటర్ బైడెన్, అతని కుటుంబం గోంగ్వెన్ డాంగ్ వంటి ఇతర చైనా పౌరులతో కూడా సంబంధం కలిగి ఉంది. ఒక సందర్భంలో, గోంగ్వెన్ డాంగ్, హంటర్ బైడెన్ పేరిట జాయింట్‌ అకౌంట్‌ ఒపెన్‌ చేసిన తరువాత హంటర్, జేమ్స్, సారా బైడెన్‌లు 100,000 డాలర్లు ఖర్చు చేశారు. హంటర్ బైడెన్ కూడా గోంగ్వెన్ సంస్థల నుంచి కొన్ని మిలియన్ డాలర్లను అందుకున్నట్లు నివేదిక తెలిపింది. ఈ లావాదేవీలలో చాలావరకు నేర ఆర్థిక కార్యకలాపాలు ఉన్నాయని వెల్లడించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top