ఉగ్రవాదంపై ఉక్కుపాదం

Quad foreign ministers meet resolves to work towards free - Sakshi

వాటి మూలాలను పెకిలించాలి

క్వాడ్‌ సదస్సు ఏకగ్రీవ తీర్మానం

నిర్బంధ ఆర్థిక విధానాలపై పోరు

ఇండో పసిఫిక్‌లో చురుకైన పాత్ర

విదేశాంగ మంత్రి జై శంకర్‌

మెల్‌బోర్న్‌: శాంతి, సుస్థిరత, ఆర్థిక ప్రగతితో కూడిన స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌ ప్రాంతం ప్రపంచ ప్రగతికి కీలకమని విదేశాంగ మంత్రి జై శంకర్‌ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంత భద్రతలో క్వాడ్‌ మరింత చురుకైన పాత్ర పోషించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నాలుగో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్‌ (అమెరికా), మారిస్‌ పైన్‌ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్‌)తో పలు అంశాలపై లోతుగా చర్చించారు.

ఇండో పసిఫిక్‌ను బెదిరింపులు, నిర్బంధ ఆర్థిక విధానాల బారినుంచి విముక్తం చేయాలని సదస్సు తీర్మానించింది. సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పరోక్ష మద్దతిస్తున్న కొన్ని దేశాల తీరును తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను, వాటి అడ్డాలను, మౌలిక సదుపాయాలను, ఆర్థిక మూలాలను పూర్తిగా పెకిలించేందుకు సభ్య దేశాలన్నీ కలిసి పని చేయాలని నిర్ణయించింది. అఫ్గాన్‌ భూ భాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు, వాటిపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని అభిప్రాయపడింది.

తర్వాత మంత్రులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం తదితరాలపై రాజీ ఉండబోదన్నారు. ‘‘ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీ, సముద్ర రక్షణ తదితర అంశాల్లో కలిసి పని చేసేందుకు ఎంతో అవకాశముంది. ఈ ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఇండో పసిఫిక్‌ దేశాలు చేసే ప్రయత్నాలన్నింటికీ మద్దతుగా నిలవాలన్న క్వాడ్‌ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర తీర దేశాల హక్కులకు తలెత్తుతున్న సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొంటామని చైనాను ఉద్దేశించి పేర్కొన్నారు.

రష్యా దూకుడుకు భారీ మూల్యమే
ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో సైనిక మోహరింపుల విషయమై రష్యాతో చర్చించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు బ్లింకెన్‌ చెప్పారు. దూకుడు ప్రదర్శిస్తే ఆర్థిక, ఎగుమతిపరమైన ఆంక్షల రూపంలో భారీ మూల్యం తప్పదని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తమ మద్దతుంటుందని పైన్, హయాషీ చెప్పారు. బర్మా సంక్షోభంపై సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.అక్కడ ప్రజాస్వామ్యాన్ని తక్షణం పట్టాలెక్కించాలని సైనిక ప్రభుత్వానికి సూచించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు మరింత మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. తర్వాత మంత్రులంతా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో భేటీ అయ్యారు.  

విఫల ప్రయోగం: చైనా
క్వాడ్‌పై చైనా అక్కసు వెల్లగక్కింది. తమను నిలువరించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రూపు విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని శాపనార్థాలు పెట్టింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో పలు దేశాలతో సరిహద్దు వివాదాలున్న చైనా క్వాడ్‌ ఏర్పాటును తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top