దూసుకొచ్చిన డ్రోన్లు‌.. పుతిన్‌పై హత్యాయత్నం? | Putin helicopter was attacked by Ukrainian drones; Details Here | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన డ్రోన్లు‌.. పుతిన్‌పై హత్యాయత్నం?

May 26 2025 12:18 PM | Updated on May 26 2025 12:30 PM

Putin helicopter was attacked by Ukrainian drones; Details Here

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin)పై హత్యాయత్నం జరిగిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది!. పుతిన్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల‌ దాడి జరిగిందని.. అయితే ఆ ప్రయత్నాన్ని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఆ దేశ సైన్యాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.

రష్యా న్యూస్‌ ఏజెన్సీ ఆర్‌బీసీ కథనం ప్రకారం రష్యా ఎయిర్‌ డిఫెన్స్‌ యూనిట్‌ కమాండర్‌ యూరీ డాష్కిన్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మే 20-22 తేదీల మధ్య ఉక్రెయిన్‌ భారీ సంఖ్యలో డ్రోన్‌లతో(Ukraine Drone Attacks) రష్యాపై దాడికి తెగబడింది. అయితే రష్యా వైమానిక దళం ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో 1,170 డ్రోన్లను నాశనం చేసింది.

.. మే 20వ తేదీన కురుస్క్‌(Kursk)లో దాడి జరగ్గా.. 46 డ్రోన్లను రష్యా సైన్యం నాశనం చేసింది. అయితే అదే తేదీన పుతిన్‌ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఆయన హెలికాఫ్టర్‌ ప్రయాణిస్తున్న మార్గంలోకి హఠాత్తుగా  డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే సకాలంలో వాటిని వైమానిక బలగాలు నేలకూల్చాయి. ఆపై అధ్యక్షుడి ప్రయాణం కొనసాగింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతోంది’’ అని యూరీ డాష్కిన్ వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై ఉక్రెయిన్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు.

మరోవైపు.. ఈ పరిణామం ఉక్రెయిన్‌ డ్రోన్‌ల సామర్థ్యంపై రష్యాకు ఆందోళన కలిగిస్తోందన్న చర్చ నడుస్తోంది. అయితే అసలు ఇది పుతిన్‌పై జరిపిన హత్యాయత్నమేనా? లేక ఉక్రెయిన్‌ ఆడుతున్న మైండ్‌ గేమా? అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. కౌంటర్‌గా రష్యా ఉక్రెయిన్‌పై ప్రతిదాడికి దిగింది. శనివారం రాత్రి రాజధాని కీవ్‌ నగరంతో పాటు పలు చోట్ల డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. 

అయితే రష్యా దాడులపై అమెరికా సహా అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండడం ఏమాత్రం సరికాదని, ఇది పుతిన్‌ను మరింత రెచ్చిపోయేలా చేస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీ అన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రెయిన్‌ ప్రత్యేక రాయబారి కీత్‌ కెల్లోగ్‌ రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు. 

ఇదీ చదవండి: పుతిన్‌పై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు, ఏమన్నారంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement