
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణకు సంబంధించి మంతనాలు జరుగుతున్న వేళ పుతిన్ సైన్యం దాడులు చేయడంతో మండిపడ్డారు. పుతిన్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తపరిచారు.
ట్రంప్ తాజాగా ట్విట్టర్‌లోని ట్రుత్ వేదికగా స్పందిస్తూ..‘రష్యా అధ్యక్షుడు పుతిన్ నాకు చాలా కాలంగా తెలుసు, మా మధ్య మంచి సంబంధం ఉంది. కానీ, ఇప్పుడు పుతిన్ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు. ఉక్రెయిన్‌పై ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. నగరాలపై దాడి చేస్తున్నాడు. అన్యాయంగా ప్రజలను చంపుతున్నాడు. నాకు ఇది అస్సలు ఇష్టం లేదు.
Donald Trump Truth Social 05.25.25 08:46 PM EST
I’ve always had a very good relationship with Vladimir Putin of Russia, but something has happened to him. He has gone absolutely CRAZY! He is needlessly killing a lot of people, and I’m not just talking about soldiers. Missiles…— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) May 26, 2025

పుతిన్.. ఉక్రెయిన్‌లోని ఒక భాగాన్ని మాత్రమే కాకుండా, మొత్తం ఉక్రెయిన్‌ను కోరుకుంటున్నారని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. బహుశా అది నిజమే కావచ్చు.. కానీ అలా చేస్తే, అది రష్యా పతనానికి దారి తీస్తుంది. అధ్యక్షుడు జెలెన్స్కీ తను మాట్లాడే విధానం ద్వారా తన దేశానికి ఎటువంటి మేలు చేయడం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలను సృష్టిస్తుంది. అతడు తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో రష్యా 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఉక్రేనియన్ వైమానిక దళం ప్రకారం, వారు 45 క్షిపణులను కూల్చివేసి 266 డ్రోన్లను ధ్వంసం చేశారు. అనేక నగరాల్లో భారీ విధ్వంసం జరిగింది. కీవ్‌తో సహా 30 కి పైగా నగరాలు, గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో కనీసం 12 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు.