
పిచ్చి వెధవా.. తెల్లని చొక్కా వేసి బడికి పంపిస్తే మొత్తం ఇంకు మరకలు చేసుకోస్తావా.. బుద్ధి లేదా.. నేను ఇప్పుడు వీటిని ఎలా వదలగొట్టాలి.. ఎన్ని రిన్ సబ్బులు ఎన్ని సర్ఫ్ ప్యాకెట్లు వాడాలో.. ఇప్పుడు మీ నాన్నకు తెలిస్తే ఏమంటాడో.. మళ్ళీ కొత్త చొక్కా కొనాలంటే మాటలా.. తింగరి సన్నాసి అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు అని అమ్మ కొట్టిన రోజులు గుర్తున్నాయా?.
బాబూ.. మా అబ్బాయి చొక్కా నిండా ఇంకు మరకలు పడ్డాయి దీన్ని కాస్త వదిలించియేలా గట్టిగా రేవు పెట్టావయ్యా అని చెప్పిన రోజులూ ఉన్నాయి. ఆమ్మో.. ఈ దరిద్రపు పెన్ను మళ్ళీ ఇంకు కక్కేసింది.. దీన్ని నిక్కర్ జేబులో పెట్టుకోకుండా అనవసరంగా తెల్ల చొక్కా జేబులో పెట్టాను.. ఇది మొత్తం షర్ట్ ను ఖరాబ్ చేసింది. ఇంటికెళ్తే అమ్మ ఏం తిడుతుందేమో ఏమిటో అని భయపడిన రోజులున్నాయి అయితే అప్పుడు మరక అన్నదే ఇప్పుడు మురిపెం అయింది. అదికూడా కాస్ట్లీ వ్యవహారం అయింది. మామూళోళ్ళకు దక్కని స్థాయి.
ఒకనాడు ప్యాంట్‌కు ఎక్కడైనా కన్నం పడితే .. లేదా ఏ ముళ్లకంపకో.. ఏదైనా ఫెన్సింగ్‌కు గానీ తగులుకుని చినిగిపోతే అయ్యో అనే వాళ్ళం. దాన్ని మళ్ళా టైలర్ దగ్గరకు తీసుకెళ్లి రఫ్ చేయించేవాళ్ళు. కానీ, నేడు ఇప్పుడు జీన్స్‌లో చిరుగుల జీన్స్ (TORN JEANS) పేరిట అధిక ధరలకు కొంటున్నారు.. ఇదేంటి కుర్రోడా అంటే ఇదే ట్రేండింగ్ అంటున్నారు నేటి యూత్. అదే విధంగా ఇప్పుడు చొక్కాల్లో కూడా సరికొత్త మోడల్ వచ్చింది. ఇటలీ దేశానికీ చెందిన moschino couture అనే దుస్తుల కంపెనీ ఏకంగా ఇంకు మరకల చొక్కాను రూపొందించింది. men light blue pen ink leak pocket shirt పేరిట మార్కెట్లోకి దించిన ఈ చొక్కా జేబుల వద్ద సరిగ్గా ఇంకు మరక ఉండేలా డిజైన్ చేశారు.
అలా మరక పడిన చొక్కాను సదరు సంస్థ బాగా చవగ్గా అమ్ముతోంది లెండి.. అంటే ఒక్కోటి రూ.80 వేలు మాత్రమే.. చూసారా. ఒకనాడు అయ్యో ఇదేంటి ఇలా అయిపొయింది చొక్కా అనుకునేది ఇప్పుడు మురిపెం అయింది. ఇంకుమరకల చొక్కా ధర చూసి గుండె గుభేల్ మన్నదా.. ఐతే సింపుల్.. ఓ మామూలు తెల్ల షర్ట్ కొనేద్దాం.. మనమే ఇంకు మరక వేసుకుందాం.. ఐదారొందల్లో కొత్త ఫ్యాషన్లోకి మారినట్లు సంబరపడిపోదాం..
-సిమ్మాదిరప్పన్న.