
కమిషన్ సిఫారసు
కఠ్మాండు: పదవీచ్యుత ప్రధాని కేపీ శర్మ ఓలిసహా నలుగురి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని జ్యుడీషియల్ కమిషన్ నేపాల్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నెలారంభంలో నేపాల్‌లో జరిగిన జెన్ జడ్ ఆందోళనలను అప్పటి కేపీ శర్మ ఓలి ప్రభుత్వం అణచివేసేందుకు తీసుకున్న చర్యలపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటవడం తెల్సిందే.
ఓలితోపాటు మాజీ హోం మంత్రి రమేశ్ లేఖక్, మాజీ హోం శాఖ కార్యదర్శి గోకర్ణ మణి దువాడి, జాతీయ దర్యాప్తు శాఖ మాజీ చీఫ్ హుతరాజ్ థాప, కఠ్మాండు జిల్లా మాజీ అధికారి ఛాబి రిజాల్‌లు ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని కూడా కమిషన్ పేర్కొంది. దర్యాప్తు సజావుగా సాగేందుకు ఇదెంతో అవసరమని కమిటీ సభ్యుడు బిగ్యాన్ రాజ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. జెన్ జడ్ ఆందోళన కారులపై కాల్పులకు తాను ఆదేశించ లేదంటూ ఓలి ఖండించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 8వ తేదీన జరిగిన కాల్పుల్లో 19 మంది చనిపోవడం తెల్సిందే.