పూ పిల్స్‌తో సూపర్‌బగ్స్‌ ఖతం | Poop transplants might help protect against superbugs | Sakshi
Sakshi News home page

పూ పిల్స్‌తో సూపర్‌బగ్స్‌ ఖతం

Jun 9 2025 4:56 AM | Updated on Jun 9 2025 5:43 AM

Poop transplants might help protect against superbugs

మానవ మలంతో మాత్రల అభివృద్ధి 

శరీరంలో తిష్ట వేసి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూపర్‌ బగ్స్‌ను తుదముట్టించడానికి బ్రిటన్‌ పరిశోధకులు సరికొత్త మాత్రను అభివృద్ధి చేశారు. ప్రధానంగా పేగుల్లో యాంటీబయోటిక్స్‌ను దెబ్బతీసే ఇన్ఫెక్షన్లకు విరుగుడు కనిపెట్టారు. ఈ మాత్రను మానవ మలంతో తయారు చేయడం గమనార్హం. వీటికి ‘పూ పిల్స్‌’ అని పేరు పెట్టారు. ఎండబెట్టి, పొడి చేసిన మలాన్ని ఈ మాత్రల తయారీకి ఉపయోగించారు. 

ఇందుకోసం ఆరోగ్యకరమైన దాతల నుంచి మలం నమూనాలు సేకరించారు. అందులో మనుషులకు మేలు చేసే బ్యాక్టీరియా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జీర్ణం కాని వ్యర్థాలుంటే తొలగించారు. పూ పిల్స్‌లోని మంచి బ్యాక్టీరియా పేగుల అంతర్భాగంలోని సూపర్‌బగ్స్‌తో నేరుగా పోరాడి బయటకు పంపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు తేల్చారు. అండన్‌లోని గైస్‌ అండ్‌ సెయింట్‌ థామస్‌ ఆసుపత్రిలో 41 మంది రోగులపై ఈ ప్రయోగం చేశారు. వారికి పూ పిల్స్‌ ఇచ్చారు.

 ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లను నివారించడానికి మలం మాత్రలు చక్కటి ప్రత్యామ్నాయమని డాక్టర్‌ బ్లెయిర్‌ మెరిక్‌ చెప్పారు. యాంటీబయాటిక్స్‌ను అడ్డుకొనే ఇన్ఫెక్షన్లకు, ఔషధాలకు లొంగని సూపర్‌బగ్స్‌కు మూలం పేగులేనని తెలిపారు. పూ పిల్స్‌తో సూపర్‌బగ్స్‌ను పేగుల నుంచి తరిమేయవచ్చని వెల్లడించారు. పూ పిల్స్‌ వాడకం కొత్తేమీ కాదు. క్లో్రస్టిడియం డిఫిసైల్‌ బ్యాక్టీరియా వల్ల ఏర్పడే డయేరియా చికిత్సకు ఈ మాత్రలు వాడుతున్నారు. సూపర్‌బగ్స్‌ నియంత్రణకు పూ పిల్స్‌పై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించారు. 

– లండన్‌  

Advertisement
 
Advertisement
Advertisement