ఉద్యోగాల కోతకు ‘ఏఐ’ సాకు మాత్రమే | AI Hype vs Human Intelligence Sridhar Vembu Exposes Truth Behind Layoffs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల కోతకు ‘ఏఐ’ సాకు మాత్రమే

May 28 2026 1:39 PM | Updated on May 28 2026 1:58 PM

AI Hype vs Human Intelligence Sridhar Vembu Exposes Truth Behind Layoffs

కృత్రిమ మేధ ప్రపంచాన్ని మార్చేస్తోందని, మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా మారిపోయిందని ప్రపంచ టెక్ దిగ్గజాలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో అధినేత శ్రీధర్ వెంబు ఖండించారు. ప్రపంచ టెక్ పరిశ్రమ అంతా కలిసి ‘ఏఐ వల్ల మాత్రమే సానుకూల మార్పులు సాధ్యం’ అనే ఒక బలవంతపు కథనాన్ని ప్రజలపై రుద్దుతోందని ఆయన మండిపడ్డారు.

ప్రస్తుతం టెక్ ప్రపంచంలో నడుస్తున్న ఏఐ హైప్ వెనుక ఉన్న అసలు నిజాలను సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా ఆయన ఎండగట్టారు. ప్రస్తుతం జరుగుతున్న లే-ఆఫ్స్, ఆర్థిక మందగమనంపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఉత్పాదకత శూన్యం..

ఏఐ వల్ల కంపెనీల్లో ఉత్పాదకత అసాధారణంగా పెరిగిపోతోందన్న వాదనలో వాస్తవం లేదని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. వాస్తవ లాభాలు చాలా పరిమితంగా ఉన్నాయని పేర్కొన్నారు. కంపెనీలు తమ ఆర్థిక ఒత్తిళ్లను దాచడానికి, పెట్టుబడిదారుల అంచనాలను అందుకోవడానికి మాత్రమే ఏఐని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని ఆరోపించారు.

‘కంపెనీలు తాము చేస్తున్న ఉద్యోగాల తొలగింపులను ఏఐ ఖాతాలో వేయడం చాలా సౌకర్యవంతంగా మారింది. ఇలా చేయడం వల్ల ఆయా సంస్థలు భవిష్యత్ సాంకేతికతను అందుకుంటున్నట్లు కలరింగ్ ఇస్తున్నాయి. కానీ, అసలు నిజం అది కాదు’ అని శ్రీధర్ వెంబు అన్నారు. మానవ శ్రమను అకస్మాత్తుగా భర్తీ చేసేంత సామర్థ్యం ఏఐకి ఇంకా రాలేదని, ప్రస్తుతం జరుగుతున్న లే-ఆఫ్స్‌కు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ప్రపంచవ్యాప్త ఆర్థిక ఒత్తిళ్లే ప్రధాన కారణమని వెంబు విశ్లేషించారు. ప్రపంచ ఆర్థిక చిత్రం రోజురోజుకూ బలహీనపడుతోందన్నారు. కేవలం ఏఐ మాత్రమే ఆ లోతైన సంక్షోభ సమస్యలను పరిష్కరించలేదని హెచ్చరించారు.

ఐఫోన్ విప్లవం కూడా 2008 సంక్షోభాన్ని ఆపలేకపోయింది!

గత సాంకేతిక విప్లవాలను ఉదాహరణగా చూపుతూ శ్రీధర్ వెంబు ప్రస్తుత ఏఐ బూమ్‌ను విమర్శించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతానికి ఈ ఏఐ ఇన్వెస్ట్‌మెంట్ బబుల్ కాపాడుతూ వస్తోందని, కానీ ఇది ఎక్కువ కాలం సాగదని స్పష్టం చేశారు. గతంలో ఐఫోన్ విప్లవం 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని నివారించలేకపోయిందని గుర్తుచేశారు. సాంకేతికత ఎంత పెరిగినప్పటికీ, ప్రపంచ ఆర్థిక అసమతులాన్ని ఏఐ తన మాయాజాలంతో ఒక్క రాత్రిలో నయం చేయలేదని వెంబు తేల్చిచెప్పారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రంగంలో ఏఐ టూల్స్ ఉత్పాదకతను ఆకాశానికి తీసుకెళ్తాయనే అతిపెద్ద అపోహను కూడా తీవ్రంగా ప్రశ్నించారు.

స్వరం మారుస్తున్న గ్లోబల్ టెక్ లీడర్స్!

విచిత్రం ఏమిటంటే, ఏఐ విప్లవానికి పితామహుడిగా చెప్పుకునే ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సైతం ఇటీవల తన స్వరాన్ని మార్చడం గమనార్హం. ‘దీని (ఏఐ ప్రభావం) గురించి నేను తప్పుగా అంచనా వేసినందుకు సంతోషిస్తున్నాను’ అంటూ ఆల్ట్‌మాన్ వ్యాఖ్యానించారు. టెక్ పరిశ్రమ మొదట్లో ఊహించిన దానికంటే సమాజం ఇప్పటికీ మానవ మేధస్సుకు, మానవ పరస్పర చర్యలకే అత్యధిక విలువ ఇస్తోందని ఆయన అంగీకరించారు.

ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

Advertisement
 
Advertisement
Advertisement