breaking news
superbugs
-
పూ పిల్స్‌తో సూపర్‌బగ్స్ ఖతం
శరీరంలో తిష్ట వేసి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూపర్ బగ్స్‌ను తుదముట్టించడానికి బ్రిటన్ పరిశోధకులు సరికొత్త మాత్రను అభివృద్ధి చేశారు. ప్రధానంగా పేగుల్లో యాంటీబయోటిక్స్‌ను దెబ్బతీసే ఇన్ఫెక్షన్లకు విరుగుడు కనిపెట్టారు. ఈ మాత్రను మానవ మలంతో తయారు చేయడం గమనార్హం. వీటికి ‘పూ పిల్స్’ అని పేరు పెట్టారు. ఎండబెట్టి, పొడి చేసిన మలాన్ని ఈ మాత్రల తయారీకి ఉపయోగించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన దాతల నుంచి మలం నమూనాలు సేకరించారు. అందులో మనుషులకు మేలు చేసే బ్యాక్టీరియా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జీర్ణం కాని వ్యర్థాలుంటే తొలగించారు. పూ పిల్స్లోని మంచి బ్యాక్టీరియా పేగుల అంతర్భాగంలోని సూపర్‌బగ్స్‌తో నేరుగా పోరాడి బయటకు పంపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు తేల్చారు. అండన్‌లోని గైస్ అండ్ సెయింట్ థామస్ ఆసుపత్రిలో 41 మంది రోగులపై ఈ ప్రయోగం చేశారు. వారికి పూ పిల్స్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లను నివారించడానికి మలం మాత్రలు చక్కటి ప్రత్యామ్నాయమని డాక్టర్ బ్లెయిర్ మెరిక్ చెప్పారు. యాంటీబయాటిక్స్‌ను అడ్డుకొనే ఇన్ఫెక్షన్లకు, ఔషధాలకు లొంగని సూపర్‌బగ్స్‌కు మూలం పేగులేనని తెలిపారు. పూ పిల్స్‌తో సూపర్‌బగ్స్‌ను పేగుల నుంచి తరిమేయవచ్చని వెల్లడించారు. పూ పిల్స్ వాడకం కొత్తేమీ కాదు. క్లో్రస్టిడియం డిఫిసైల్ బ్యాక్టీరియా వల్ల ఏర్పడే డయేరియా చికిత్సకు ఈ మాత్రలు వాడుతున్నారు. సూపర్‌బగ్స్ నియంత్రణకు పూ పిల్స్‌పై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించారు. – లండన్ -
వెల్లుల్లితో సూపర్‌బగ్స్‌కు చెక్
దాదాపుగా అందరి వంటిళ్లలో విరివిగా వాడే వెల్లుల్లిలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, యాంటీ బయోటిక్స్‌కు లొంగని సూపర్‌బగ్స్‌ను కూడా వెల్లుల్లితో సమర్థంగా అరికట్టవచ్చని ఒక తాజా పరిశోధనలో తేలింది. వెల్లుల్లిలో ఉండే ‘అజోనే’ అనే రసాయనం ఎలాంటి మొండిరకం బ్యాక్టీరియాలనైనా ఇట్టే నాశనం చేయగలదని డానిష్ శాస్త్రవేత్తల ప్రయోగాల్లో తేలింది. యాంటీబయోటిక్స్‌ను తట్టుకుని మరీ మనుషుల శరీరంలోని కణజాలానికి అంటిపెట్టుకుని ఉండే బ్యాక్టీరియా డీఎన్ఏను వెల్లుల్లిలోని ‘అజోనే’ అనే రసాయనం నాశనం చేయగలుగుతోందని తమ ప్రయోగాల్లో తేలినట్లు కోపెన్‌హాగెన్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టిమ్ హామ్ జాకబ్సన్ వెల్లడించారు. మొండి బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్లు సోకిన వారికి యాంటీ బయోటిక్స్‌తో పాటు వెల్లుల్లి నుంచి సేకరించిన ‘అజోనే’తో తయారు చేసిన ఔషధాలను వాడినట్లయితే ప్రాణాంతక పరిస్థితుల నుంచి బయటపడవచ్చని కోపెన్‌హాగెన్ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. -
చికెన్‌తో చిక్కులెన్నో!
న్యూఢిల్లీ: తందూరీ చికెన్, బటర్ చికెన్.. ఇలాంటి చికెన్ వంటకాల పేర్లు వింటేనే నోరూరుతుంది కదూ ? రుచికి మారుపేరైన చికెన్‌తోపాటు గుడ్లతోనూ ఎన్నో అనర్థాలు ఉన్నాయట. మన భారతీయ కోళ్ల కారణంగా మన వాళ్లకే కాదు ప్రపంచానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడి కోళ్లలో వ్యాధి నిరోధక వ్యవస్థకు కూడా లొంగని సూపర్‌బగ్స్/బ్యాక్టీరియాలు ఉన్నట్టు భారత్–అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. పంజాబ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో పెద్ద పెద్ద పౌల్ట్రీఫారాలు ఉంటాయి. వీటిలోనే సరికొత్త బ్యాక్టీరియాలు ఉత్పత్తి అవుతున్నాయి. కోళ్లు అనారోగ్యం బారినపడకుండా చూడడానికి, త్వరగా బరువు పెరగడానికి యాంటీబయోటిక్ మందులు ఎక్కువగా ఇస్తుండడంతో హానికారక బ్యాక్టీరియాలు ఉత్పత్తి అవుతున్నాయి. యాంటీబయోటిక్ సత్తా క్రమంగా తగ్గిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ అధికారి, ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మార్గరెట్ చాన్ అన్నారు. ఇలాంటి చికెన్ తినేవాళ్లకు ఏదైనా జబ్బు సోకితే సాధారణ యాంటీబయోటిక్స్ పనిచేయవని తెలిపారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ డిసీజెస్ డైనమిక్స్, ఎకనమిక్స్ అండ్ పాలసీ సంస్థ పరిశోధకులు పంజాబ్‌లోని ఆరు జిల్లాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. పంజాబ్‌లోని మెజారిటీ పౌల్ట్రీఫారాల్లో పెరిగే కోళ్లు, గుడ్లలో సూపర్‌బగ్స్ ఉంటున్నాయని సంస్థ డైరెక్టర్ రామనన్ లక్ష్మీనారాయణ్ చెప్పారు. అనారోగ్యం బారినపడ్డ జంతువులు మినహా మిగతా వాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు.