- అస్తవ్యస్తంగా యాంటీ బయాటిక్స్ వాడకంతో ఏఎంఆర్ సమస్య
- ఆ మందులకు అలవాటు పడి మొండి క్రిములుగా మారుతున్న సూక్ష్మక్రిములు
- ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది బలి
- అరికట్టకపోతే 2050 నాటికి ఏటా కోటి మంది ప్రాణాలకు ముప్పు
- వీరిలో 20 లక్షల మంది భారతీయులు ఉంటారని అంచనా
యాంటీబయాటిక్స్ మానవాళి అభివృద్ధికి దోహదం చేసిన విలువైన ప్రాణాధార మందులు. మనుషులకు, జంతువులకు యాంటీబయాటిక్ ఔషధాలను నిర్దేశిత మోతాదుల కన్నా అధికంగా, విచక్షణారహితంగా వినియోగిస్తున్నందు వల్ల కొన్ని సూక్ష్మక్రిములు ఈ మందులకు అలవాటు పడిపోయి మొండి క్రిములుగా (సూపర్ బగ్స్) తయారవుతున్నాయి.
దీంతో శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ కూడా ప్రాణరక్షణలో నిష్ప్రయోజనంగా మారుతున్నాయి. ఇదే అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్న యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సమస్య. ఏఎంఆర్ అనేది ప్రపంచ ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణం, సుస్థిర అభివృద్ధికి అతిపెద్ద ముప్పుల్లో ఇదొకటి.
అతి వినియోగాన్ని నియంత్రించాలి..
చాపకింద నీరులా విస్తరిస్తున్న బ్యాక్టీరియల్ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. దీన్ని అరికట్టకపోతే 2050 నాటికి ఏటా కోటి మందిని (ఇందులో 20 లక్షల మంది భారతీయులే) బలి తీసుకుంటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఏఎంఆర్ సమస్యను పరిష్కరించాలంటే.. మనుషులు యాంటీబయాటిక్స్‌ను జాగ్రత్తగా వాడాలి.
పాలు, గుడ్లు, మాంసం కోసం పెంచే పశు పక్ష్యాదులకు యాంటీబయాటిక్స్ వినియోగాన్ని నియంత్రించాలి. అతిగా ఉపయోగించే యాంటీబయాటిక్స్‌లో 90% విసర్జితాల ద్వారా పర్యావరణంలోకి చేరి నీరు, నేల కలుషితమవుతాయి. యాంటీబయాటిక్స్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు డబ్ల్యూహెచ్‌ఓ నవంబర్ 18–24 వరకు అంతర్జాతీయ వారోత్సవాలు నిర్వహిస్తోంది.
ఏఎంఆర్‌ను అరికట్టేదెలా?
ఆహారాన్ని తయారు చేసేటప్పుడు, వంట చేసే ముందు చేతులు కడుక్కోవడం, ఆహారం వండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఔషధ–నిరోధక సూక్ష్మజీవుల వ్యాప్తిని నిరోధించవచ్చు.
మీకు తెలుసా?
యాంటీమైక్రోబయాల్స్ అనేవి మానవులు, జంతువులు, పంటల్లో అంటు వ్యాధులు/చీడపీడలు నివారించడానికి, నియంత్రించడానికి ఉపయోగించే అద్భుత ఔషధాలు. అయితే, మనుషులకు చికిత్సల్లో విచక్షణా రహితంగా యాంటీబయాటిక్స్‌ను వాడుతున్నారు. అదేవిధంగా పశుపోషణలో, పంటల సాగులోనూ గ్రోత్ ప్రమోటర్లుగా వినియోగిస్తున్నారు. జబ్బులు రాక ముందే నియంత్రణ కోసమని దాణాల్లో కలుపుతున్నారు.
మనుషుల కోసం ప్రత్యేకించిన యాంటీ బయాటిక్స్‌ను పశుపోషణలో దుర్వినియోగం చేయడం ఒక సమస్య. బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు యాంటీమైక్రోబయల్ ఔషధాలకు స్పందించకుండా పోయినప్పుడు యాంటీ మైక్రోబయల్ రెసిస్టె¯Œన్స్ సంభవిస్తుంది. ఫలితంగా యాంటీబయాటిక్స్ అసమర్థంగా మారతాయి. ఇన్ఫెక్షన్లకు చికిత్స కష్టతరమవుతుంది లేదా అసాధ్యం అవుతుంది.
తీవ్ర పేదరికంలోకి..
ఏఎంఆర్ విసిరే సవాళ్లు సంక్లిష్టమైనవి. కానీ అధిగమించలేనివి కావు. మనుషులు, పశువులు, పక్షులు, పర్యావరణ ఆరోగ్యం వేర్వేరు కాదు ఒక్కటే అనే స్ఫూర్తిని అందించే డబ్ల్యూహెచ్‌ఓ ‘వన్ హెల్త్’ప్రచార కార్యక్రమం లక్షలాది మంది ప్రాణాలను కాపాడటానికి, యాంటీమైక్రోబయాల్స్‌ను సంరక్షించడానికి, ఔషధ–నిరోధక వ్యాధికారకాల నుంచి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఉపయోగించకుండా ఉన్న టాయిలెట్లు, డబ్బాలు లేదా చెత్తలో పారేస్తున్న ఔషధాల నుంచి విడుదలయ్యే రసాయనాలు ఏఎంఆర్ సమస్యను తీవ్రం చేస్తాయి. ఈ మహమ్మారిని అరికట్టకపోతే 2050 నాటికి ప్రపంచ వార్షిక స్థూల జాతీయోత్పత్తిలో 3.8 శాతా న్ని దెబ్బతీస్తుంది. వచ్చే దశాబ్దంలో ఏటా 3.4 లక్షల కోట్ల డాలర్ల మేరకు స్థూల జాతీయోత్పత్తిని తగ్గించేస్తుందని, 2.4 కోట్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టివేస్తుందని అంచనా.
-సాక్షి, స్పెషల్ డెస్క్


