Chemical Castration of Rapists: రేపిస్టులకు ఇక చుక్కలే.. కఠిన శిక్ష అమలుకు పార్లమెంట్‌ ఆమోదం

Pakistan Parliament Passes Bill for Chemical Castration of Rapists - Sakshi

అత్యాచార నిందితులకు కెమిలక్‌ కాస్ట్రేషన్‌ అమలుకు పాక్‌ మంత్రి వర్గం ఆమోదం

ఇస్లామాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఆడవారిపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా ప్రతి చోటా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. మనదేశంలో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికి లాభం లేకుండా పోతుంది. ఈ క్రమంలో మృగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయడం.. లేదా వారికి అంతకు మించి కఠిన శిక్షలు విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ పార్లమెంటు కొత్త చట్టాన్ని ఆమోదించింది. తరచుగా అత్యాచారాలకు పాల్పడే నిందితులను కఠినమైన కెమికల్‌ కాస్ట్రేషన్‌కు గురి చేసే చట్టాన్ని ఆమోదించింది. అత్యాచార నేరాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించడం.. నేరస్థులకు కఠిన శిక్షలు విధించేందుకుగాను పాక్‌ ఈ చట్టాన్ని ఆమోదించినట్లు తెలిపింది.
(చదవండి: కులభూషణ్ జాదవ్‌కు ఊరట.. ఐసీజే దెబ్బకు వెనక్కు తగ్గిన పాక్‌)

గత కొంత కాలంగా పాకిస్తాన్‌లో మహిళలు, చిన్నారులపై అకృత్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తడంతో ఈ కొత్త చట్టానికి ఆమోదం తెలిపినట్లు పాక్‌ ప్రకటించింది. విమర్శకులు ప్రకారం దేశ వ్యాప్తంగా నమోదవుతున్న అత్యాచార కేసుల్లో కేవలం 4 శాతం కేసుల్లో మాత్రమే శిక్ష పడుతున్నట్లు ఆరోపించారు. 

దాదాపు ఏడాది క్రితం పాకిస్తాన్‌ మంత్రివర్గం ఆమోదించిన అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌ను పాక్‌ ప్రెసిడెంట్‌ ఆరిఫ్‌ అల్వీ ఆమోదించాడు. అత్యాచార నిందుతలకు కెమికల్‌ కాస్ట్రేషన్‌ విధించాలని ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. కొత్త క్రిమినల్ లా (సవరణ) బిల్లు 2021 బిల్లుతో పాటు 33 ఇతర బిల్లులను బుధవారం పాక్‌ పార్లమెంటు ఉమ్మడి సెషన్ ఆమోదించింది. ఇది పాకిస్తాన్ శిక్షాస్మృతి, 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1898లను సవరించాలని కోరుతున్నట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది.
(చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్‌ జ్వరాలు!!)

‘‘కెమికల్ కాస్ట్రేషన్ అనేది ప్రధాన మంత్రి రూపొందించిన నియమాల ద్వారా సక్రమంగా తెలియజేయబడిన ప్రక్రియ. ఈ శిక్ష అనుభవించిన వ్యక్తి ఇక తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. ఇక ఈ శిక్ష అమలు కోర్టు పర్యవేక్షణలో మెడికల్‌ బోర్డు ఆమోదించిన ఔషధాల ద్వారా నిర్వహించబడుతుందని’’ బిల్లులో పేర్కొన్నారు.
(చదవండి: మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు )

జమాత్-ఇ-ఇస్లామీ సెనేటర్ ముస్తాక్ అహ్మద్ ఈ బిల్లుపై నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇస్లాం విరుద్ధమని.. షరియాకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని బహిరంగంగా ఉరితీయాలని, అయితే షరియాలో కాస్ట్రేషన్ ప్రస్తావన లేదని ఆయన అన్నారు.

కెమికల్ కాస్ట్రేషన్....
కెమికల్ కాస్ట్రేషన్ అంటే లైంగిక కార్యకలాపాలను తగ్గించడానికి మందులు వాడే ప్రక్రియ. మీడియా నివేదికల ప్రకారం, దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలతో సహా దేశాల్లో ఇది ఒక చట్టపరమైన శిక్ష.

చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top