
ప్రతీకార చర్యలపై సైన్యానికి పూర్తిస్వేచ్ఛ
పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. భారత్‌ను గట్టిగా దెబ్బకొట్టాల్సిందేనని నిర్ణయానికి వచ్చింది. భారత్‌పై ప్రతీకార చర్యల విషయంలో సైన్యానికి పూర్తిస్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలన్న దానిపై బాధ్యతను సైన్యానికే అప్పగించింది. పాక్ ప్రధానమంత్రి షెహవాజ్ షరీఫ్ నేతృత్వంలో బుధవారం పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎన్‌ఎస్సీ) సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, సీనియర్ ఆర్మీ అధికారులు హాజరయ్యారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాటు తదనంతర పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. భారత సైన్యం నిర్వహించిన తాజా దాడుల్లో సామాన్య ప్రజలు బలైనట్లు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆరి్టకల్–51 ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసే హక్కు తమకు ఉందని ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. అమాయక ప్రజలను బలితీసుకున్నందుకు భారత్‌పై ప్రతీకారం తప్పదని తేల్చిచెప్పింది. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టే అధికారాన్ని తమ సైనిక దళాలకు అప్పగించినట్లు వెల్లడించింది.
సామాన్యులపై దాడులు సిగ్గుచేటు
పాక్‌తోపాటు పీఓకేలో భారత్ దాడులను ఎన్‌ఎస్సీ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తే సహించబోమని హెచ్చరించింది. భారత్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని, ఇది ముమ్మాటికీ తమపై యుద్ధ ప్రకటనేనని పేర్కొంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం భారత్ దాడిని యుద్ధ చర్యగానే పరిగణిస్తున్నామని వెల్లడించింది. మహిళలు, చిన్నారులు సహా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం అత్యంత హేయం, దారుణం, సిగ్గుచేటు అని మండిపడింది.
మానవత్వానికి సంబంధించిన అన్ని నియమాలను భారత సైన్యం ఉల్లంఘించినట్లు ఆరోపించింది. భారతదేశ చట్టవ్యతిరేక చర్యలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని ఎన్‌ఎస్సీ విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించినందుకు భారత్ దోషిగా పరిగణించాలని స్పష్టంచేసింది. ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయన్న సాకుతో సాధారణ జనావాసాలపై భారత సైన్యం దాడులు చేసిందని ఆక్షేపించింది. ఈ దాడుల్లో మసీదులు సహా పౌర సదుపాయాలు ధ్వంసమయ్యాయని ఆందోళన వ్యక్తంచేసింది.