
మారణహోమం, మహిళలపై లైంగికదాడులు అక్కడ సాధారణం
అయినా ప్రపంచం పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్నే నమ్ముతోంది
ఐరాసలో శాశ్వత రాయబారి పర్వతనేని హరీశ్ మండిపాటు
యునైటెడ్ నేషన్స్: పాకిస్తాన్ సొంత పౌరులపైనే బాంబులు వేసి చంపుతోందని, ఆ దేశంలో మారణహోమాలు, మహిళలపై సామూహిక లైంగికదాడులు నిత్యకృత్యమని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సోమవారం ‘మహిళలు, శాంతి, భద్రత’అనే అంశంపై నిర్వహించిన చర్చలో ఐరాసలో భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ఈ చర్చలో పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంతో ఆయన దాయాది దేశానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ నుంచి కశ్మీరీ మహిళలను తొలగించాలని గట్టిగా పట్టుబట్టారు.
‘సొంత ప్రజలపైనే బాంబులు వేస్తున్న ఒక దేశం, ఒక క్రమపద్ధతిలో మారణహోమానికి పాల్పడుతూ, లక్షలమంది మహిళలపై లైంగికదాడులు చేయించిన దేశం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. దురదృష్టవశాత్తూ ఏటా పాకిస్తాన్ దుష్ట చర్యలకు మేం బాధితులం అవుతున్నాం. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో.. అయినా ప్రపంచం పాకిస్తాన్ దృష్టకోణం నుంచే చూస్తోంది’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1971 మార్చి 25న తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఆపరేషన్ సెర్చ్‌లైట్ పేరుతో పాకిస్తాన్ మారణహోమానికి పాల్పడిందని, 4 లక్షల మంది మహిళలపై పాక్ సైన్యం అత్యాచారాలకు పాల్పడిందని గుర్తుచేశారు.
మహిళల భద్రత విషయంలో భారత్‌ను ఎవరూ వేలెత్తి చూపలేరని స్పష్టంచేశారు. మహిళల భద్రత, శాంతి సాధన విషయంలో ప్రపంచంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఐక్యరాజ్యసమతి శాంతి పరిరక్షణ మిషన్లలో భారత్ తరఫున పాల్గొన్న మహిళా అధికారులనే ఈ అంశంలో తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. 1960వ దశకంతో కల్లోల కాంగోలో ఐరాస పీస్ కీపింగ్ మిషన్‌లో భారత్ మహిళా మెడికల్ అధికారుల దళాన్ని పంపిందని గుర్తుచేశారు.