అమెరికాలో మనోళ్ల వాటా పెరిగింది

Number of Indian students in US rose by 12 per cent - Sakshi

2021లో భారతీయ విద్యార్థుల్లో 12 శాతం వృద్ధి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అదే సమయంలో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. 2021లో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 12 శాతం పెరిగింది, చైనా విద్యార్థుల సంఖ్య 8 శాతానికి పైగా పడిపోయింది. ఈ విషయాన్ని యూఎస్‌ సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) తాజాగా తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కోవిడ్‌ మహమ్మారి గతేడాది విదేశీ విద్యార్థుల చేరికపై ప్రభావం చూపిందని తెలిపింది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఇప్పటికీ చైనా జాతీయులదే మెజారిటీ వాటా కాగా భారతీయ విద్యార్థులు రెండో స్థానంలో ఉన్నారు.

స్టూడెంట్స్, ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(సెవిస్‌) ప్రకారం.. నాన్‌–ఇమ్మిగ్రెంట్‌ స్టూడెంట్‌ వీసాలైన ఎఫ్‌–1, ఎం–1 ద్వారా 2021లో 12,36,748 మంది అమెరికాలో ఉన్నారు. 2020తో పోలిస్తే ఇది 1.2% తక్కువ. 2021లో చైనా నుంచి 3,48,992 మంది, భారత్‌ నుంచి 2,32,851 మంది అమెరికాకు వచ్చారు. 2020తో పోలిస్తే చైనా విద్యార్థులు 33,569 మంది తగ్గిపోయారు. ఇక భారత్‌ నుంచి 25,391 మంది అదనంగా వచ్చారు.  విదేశీయులు విద్యాభ్యాసం కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాల కంటే కాలిఫోర్నియాకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2021లో 2,08,257 మంది (16.8 శాతం) విదేశీయులు కాలిఫోర్నియా విద్యాసంస్థల్లో చేరారు. 2021లో యూఎస్‌లో 11,42,352 మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యలో డిగ్రీలు పొందారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top