ట్రంప్‌ సముద్ర దిగ్బంధనం : ఇరాన్‌ తీవ్ర హెచ్చరిక | No Gulf port will be safe Irans big warning hours before US blockade begins | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సముద్ర దిగ్బంధనం : ఇరాన్‌ తీవ్ర హెచ్చరిక

Apr 13 2026 7:15 PM | Updated on Apr 13 2026 8:12 PM

No Gulf port will be safe Irans big warning hours before US blockade begins

ఇరాన్ సముద్ర కార్యకలాపాలపై దిగ్బంధనాన్ని అమలు చేయడానికి అమెరికా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్‌  తీవ్ర  స్థాయిలో హెచ్చరిక జారీ చేసింది. తమ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని  ఇరాన్  తాజాగా హెచ్చరించింది.  యుద్ధ విరమణ చర్చలు విఫలమైన తర్వాత టెహ్రాన్‌పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో, ఇరాన్ ఓడరేవులలోకి ప్రవేశించే లేదా బయలుదేరే నౌకలను అడ్డుకోవడం ప్రారంభిస్తామని అమెరికా సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. ఏప్రిల్ 13 (సోమవారం) నుండి ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు అమలులోకి రానున్న తరుణంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

అమెరికా సముద్ర దిగ్బంధనం (Blockade)పై ట్రంప్‌ ప్రకటన నేపథ్యంలో ఇరాన్ ధీటుగా స్పందించింది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, తాము కూడా దీటుగా స్పందిస్తామని, తమ వద్ద ఇంకా వాడని  ఆయుధాలు/అస్త్రాలు ఉన్నాయని ఇరాన్ నేతలు స్పష్టం చేశారు. తమ దేశ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే, పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరించింది. "పర్షియన్ గల్ఫ్ భద్రత అనేది అందరికీ ఉండాలి, లేదంటే ఎవరికీ ఉండదు" అని ఇరాన్ మిలిటరీ మరియు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు, ఏప్రిల్ 13 ఉదయం 10 గంటల (EDT) నుండి ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే లేదా బయటకు వచ్చే అన్ని దేశాల నౌకలను అమెరికా సైన్యం అడ్డుకోనుంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికా షరతులను అంగీకరించకపోవడంతో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలను మాత్రమే అడ్డుకుంటామని, ఇతర దేశాల మధ్య ప్రయాణించే నౌకలకు హార్ముజ్ జలసంధి గుండా అనుమతి ఉంటుందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.  అమెరికా క్రూడ్ ఆయిల్ ధర 8 శాతం పెరిగి 104.24  డాలర్లకి చేరగా, బ్రెంట్ క్రూడ్  102.29 కి డాలర్ల చేరుకుంది. హార్ముజ్ జలసంధి గుండా రోజుకు 100-135 నౌకలు వెళ్లేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 40కి పడిపోయింది.

 ఇదీ చదవండి: రిషబ్‌శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లక్షలాది బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాన్‌పై ఒత్తిడిని పెంచడానికే ఈ దిగ్బంధనం ఉద్దేశించినట్లుగా ఉంది. ఇరాన్ చమురు ఎగుమతుల కోసం ఉపయోగిస్తున్న "డార్క్ ట్రాన్సిట్స్" (రహస్య రవాణా) ను అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం. అయితే, ఈ దిగ్బంధనం వల్ల గల్ఫ్ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియ నుండటంతో, ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందా అనే  ఆందోళన నెలకొంది.  

ఇదీ చదవండి: పోప్‌కు కౌంటర్‌ : ట్రంప్‌ సంచలన పోస్ట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement