అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,పోప్ లియో XIV మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. పోప్‌ను విమర్శించిన కొద్దిసేపటికే, ట్రంప్ తనను తాను ఏసు క్రీస్తు తరహాలో చిత్రీకరించుకున్న ఒక AI చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పోప్ లియోతో వివాదం మధ్య, ట్రంప్ తాజా పోస్ట్ సంచలనంగా మారింది.
.ప్రపంచ సంఘర్షణలపై పోప్ లియో XIV వైఖరిని విమర్శిస్తూ, బలహీనుడు, అతి ఉదారవాది అని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ తర్వాత క్రీస్తును పోలిన తన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిత్రంలో, ట్రంప్ దైవిక కాంతితో కూడిన వస్త్రాలతో, ఒక వ్యక్తిని "స్వస్థత" పరుస్తున్నట్లుగా, పక్కనే దేవదూతలు లేదా సైనికులు ఉన్నట్లుగా ఆ చిత్రం ఉంది.
ఇదీ చదవండి: రిషబ్‌శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?
ఫ్లోరిడా నుండి వాషింగ్టన్‌కు తిరిగి వస్తున్నప్పుడు విలేకరులతో మాట్లాడుతూ, తాను పోప్‌కు ఫ్యాన్‌కు కాదని, అందుకే ప్రపంచ సమస్యలపై ఆయన వైఖరిని విమర్శించానని ట్రంప్ పేర్కొన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించే తన ప్రయత్నాలను పోప్ వ్యతిరేకిస్తున్నారని, తద్వారా అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.

కాగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని పోప్ తీవ్రంగా ఖండించారు. 'సర్వశక్తిమంతులమనే భ్రమ' ఆజ్యం పోస్తోందని పోప్ ఘాటుగా విమర్శించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పోప్ నేరుగా ట్రంప్ పేరు ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు అమెరికా నాయకత్వాన్ని ఉద్దేశించినవిగా కనిపించాయి. దీనికి ప్రతిస్పందనగా, లియో 'విదేశాంగ విధానానికి పనికిరాడని' ట్రంప్ ఆరోపించారు ,నేరం, అణు ముప్పు వంటి విషయాలపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలుండటం సరైనదేనని భావించే పోప్ తనకు అవసరంలేదంటూ మరోసారి విమర్శనాస్త్రాలను సంధించారు. మరోవైపు పోప్‌తో విభేదాల నేపథ్యంలో తనను తాను ఒక ఆధ్యాత్మిక రక్షకుడిగా చూపించుకునే ప్రయత్నం ఇది అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ తనను తాను దైవంగా అభివర్ణించుకున్న వైనం మిత్రదేశాలు, శత్రువులు ఈ పోరాటాన్ని చూసే విధానాన్ని మార్చి వేస్తుందా? ఒకవేళ ఈ ఇరాన్ యుద్ధాన్ని 'పవిత్ర యుద్ధం'గా చిత్రీకరిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది క్యాథలిక్కులు ముఖ్యంగా అమెరికాలో నవంబర్ మధ్యంతర ఎన్నికలలో ఓటు వేయనున్న 7 కోట్ల మందికి పైగా క్యాథలిక్కులను ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదీ చదవండి : ట్రంప్ అంటే నాకేమీ భయం లేదు.. పోప్ లియో సంచలన వ్యాఖ్యలు


