
ఖాట్మండు: హిమాలయ దేశం నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ, అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు చెలరేగాయి. పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని, 20మంది మృతి చెందారు. ఈ పరిణామాల నేపధ్యంలో కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
నేపాల్‌లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇన్‌స్టా, యూట్యూబ్, వాట్సాప్‌తో పాటు రెడిట్, ఫేస్‌బుక్, ఎక్స్, సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా యాప్‌లను, సైట్లను నిషేధించటంపై నేపాల్ యువత భగ్గుమంది. కాలేజీ, స్కూలు యూనిఫారాల్లో సోమవారం రోడ్లపైకి వచ్చిన యువత... దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవటంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20 మంది వరకూ మరణించగా 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు.
1997–2012 మధ్య పుట్టిన యువత (జనరేషన్– జెడ్) మొబైల్ ఫోన్లు చేతికి వచ్చిన దగ్గర్నుంచి పెద్దగా నియంత్రణలేవీ ఎదుర్కోలేదు. వీరికి చదువుకోవటానికైనా, సంపాదనకైనా, సంభా షించుకోవటానికైనా సోషల్ మీడియాయే ఆధారమైపోయింది. జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. అలాంటిది ఒక్కసారిగా టిక్‌టాక్, వైబర్ మినహా అన్ని ప్రధాన సోషల్ మీడియా సైట్లనూ నిషేధించటంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 4న నిషేధం విధించటంతో... దానికి వ్యతిరేకంగా టిక్‌టాక్‌లో చర్చ మొదలైంది. ఆ చర్చ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతివైపు మళ్లింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, బంధుప్రీతి ఎక్కువైందని, నేతల కొడుకులు, కూతుళ్లు రాజ్యమేలుతున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటి ఫలితంగా సోమవారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన యువత... ‘నిషేధించాల్సింది అవినీతిని... సోషల్ మీడియాను కాదు’అని ప్లకార్డులు చూపిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పార్లమెంటు వద్ద, మైటీఘర్ మండల వద్ద భారీగా గుమికూడారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన భద్రతా బలగాలు పలుచోట్ల కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాజధాని ఖట్మండు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

కాగా ఈ నిరసనలు సోషల్ మీడియా నిషేధంపై జెన్–జెడ్ చేస్తున్నవి మాత్రమే కాదని, ప్రభుత్వ అవినీతిపై అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనల్ని నేపాల్ జాతీయ మానవహక్కుల సంఘం ఖండించింది. నిరసనకారుల మాట వినాలని, రాజకీయంగా తటస్థ వైఖరి అవసరమని పేర్కొంటూ ఖట్మండు మేయర్ బాలెన్ షా ఆందోళనకారులకు మద్దతు పలికారు. ప్రధానంగా పార్లమెంటు వద్దే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా నిరసనకారులు వాటిని తోసుకుంటూ ముందుకొచ్చారు. వారిని నిలువరించడానికి పోలీసులు భాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ గందరగోళం మధ్యలోనే కొందరు నిరసనకారులు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించారు. పార్లమెంటు గేట్లను ధ్వంసం చేశారు. ఈ దశలో పోలీసులు కాల్పులు జరిపారు.