పెను సంక్షోభం దిశగా ప్రపంచం.. భారత్‌కూ తప్పని సెగ! | Middle East Critical Conditions And IMF-World Bank meeting in Bangkok | Sakshi
Sakshi News home page

పెను సంక్షోభం దిశగా ప్రపంచం.. భారత్‌కూ తప్పని సెగ!

Oct 11 2026 11:13 AM | Updated on Oct 11 2026 11:29 AM

Middle East Critical Conditions And IMF-World Bank meeting in Bangkok

యుద్ధం ఒకచోట జరుగుతున్నా.. దాని సెగ మాత్రం ప్రపంచమంతా తగులుతోంది. చమురు సరఫరాకు అంతరాయం, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, దేశాలపై పేరుకుపోతున్న అప్పులు.. ఇవన్నీ కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం ఎనిమిదో నెలలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామాల మధ్య థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో అక్టోబర్‌ 12 నుంచి 18 వరకు జరగనున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలు కీలకంగా మారాయి. ఈ సమావేశాల్లో ఎలాంటి పరిష్కారాలు లభిస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేధిస్తున్న ప్రధాన సమస్య ప్రభుత్వాలపై పెరుగుతున్న రుణభారం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయికి ప్రభుత్వ రుణాలు చేరాయని ఐఎంఎఫ్‌ అంచనా వేస్తోంది. 2030కు ముందే ప్రపంచ ప్రభుత్వ రుణాలు మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 100 శాతాన్ని మించవచ్చని హెచ్చరిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ రుణభారం అధికంగానే ఉన్నప్పటికీ.. వర్ధమాన, తక్కువ ఆదాయ దేశాలకు పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో పెట్టుబడులు ఆ దిశగా తరలిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు, కొత్త రుణాలు తీసుకోవాలన్నా, పాత అప్పులను తిరిగి చెల్లించాలన్నా అధిక వడ్డీలు భరించాల్సి వస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వ ఆదాయంలో సగటున 10 శాతానికి మించి వడ్డీ చెల్లింపులకే ఖర్చవుతోందని రాయిటర్స్‌ కథనం పేర్కొంది. ఫలితంగా విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతుల కోసం వెచ్చించాల్సిన నిధులపై ఒత్తిడి పెరుగుతోంది.

పేద దేశాలకు మరో సవాల్‌?
ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు ఐఎంఎఫ్‌ రుణాలు కీలకంగా ఉంటాయి. అయితే, రుణాలు మంజూరు చేసేందుకు విధించే షరతులు మరింత కఠినంగా మారవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ సంఖ్యలోనే సంస్కరణలను సూచించినా, వాటిని లోతుగా అమలు చేయాలని ఐఎంఎఫ్‌ ప్రతిపాదిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇలాంటి షరతులు ప్రభుత్వ వ్యయాల కోత, పన్నుల పెంపు వంటి చర్యలకు దారితీయవచ్చని రుణాలపై పరిశోధన చేస్తున్న నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెన్యాలో రుణభారాన్ని నియంత్రించేందుకు ఖర్చులు తగ్గించడం, పన్నులు పెంచే ప్రయత్నాలు ప్రజల్లో నిరసనలకు దారితీశాయని ఉదాహరణగా పేర్కొంటున్నారు.

ఎల్‌నినో ముప్పు.. 
ఇంధన ధరల పెరుగుదలతోపాటు ఎరువుల ధరలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల వ్యయం పెరిగితే ఆహార ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ ఏడాది బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా మాట్లాడుతూ.. ఇంధన ధరలు, ఎరువుల ధరలు, రుణభారం, వాతావరణ సంబంధిత ముప్పులు ఒకేసారి ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలకు మించి నిలకడగా ఉన్నప్పటికీ, కొత్తగా పేరుకుపోతున్న ఒత్తిళ్లు ఆ పరిస్థితిని మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్‌కూ తప్పని ఆర్థిక సెగ.. 
యుద్ధం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్నా.. దాని ఆర్థిక ప్రభావం భారత్‌ను తాకే ప్రమాదం లేకపోలేదు. దేశానికి అవసరమైన ముడిచమురులో ఎక్కువ భాగం దిగుమతులపైనే ఆధారపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు భారమవుతుంది. దీనికి తోడు రూపాయిపై ఒత్తిడి పెరిగితే చమురు కొనుగోళ్ల కోసం మరింత ఖర్చు చేయాల్సి రావచ్చు. ఫలితంగా వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు కూడా పెరగవచ్చు. యుద్ధం సుదీర్ఘమై ఇంధన సరఫరాకు అంతరాయం కొనసాగితే భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న యుద్ధం, అప్పులు, ద్రవ్యోల్బణం.. చివరకు సామాన్యుడి కుటుంబ బడ్జెట్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయన్నది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ప్రతికూలంగా మారితే వ్యవసాయ ఉత్పత్తిపై అదనపు ఒత్తిడి ఏర్పడవచ్చు. అప్పుడు ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది.

బ్యాంకాక్‌ సమావేశాలపై ప్రపంచ దేశాల ఆశలు
అక్టోబర్‌ 12 నుంచి 18 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఐఎంఎఫ్‌-ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలకు 191 దేశాల నుంచి 15 వేల మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా. ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు, విధాన నిర్ణేతలు, వ్యాపార రంగ ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అయితే, అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ఈ సమావేశాలకు హాజరుకాకుండా తన స్థానంలో ఇద్దరు సీనియర్‌ అధికారులను పంపడం కూడా చర్చనీయాంశమైంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లేంటి?
యుద్ధం కొనసాగితే ఇంధన సరఫరా, ధరలపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో అధిక వడ్డీ రేట్లు, రుణ చెల్లింపులు ప్రభుత్వాల ఆర్థిక స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయి. పేద దేశాలకు అవసరమైన ఆర్థిక సాయం అందించడం, అప్పుల భారాన్ని తగ్గించడం, ధరల పెరుగుదలను నియంత్రించడం అంతర్జాతీయ సంస్థలకు కీలక పరీక్షగా మారాయి. ఈ నేపథ్యంలో బ్యాంకాక్‌ సమావేశాలు కేవలం ఆర్థిక చర్చలకే పరిమితం కావు. యుద్ధాలు, ఇంధన సంక్షోభాలు, వాతావరణ మార్పులు పరస్పరం ప్రభావితం చేస్తున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఎలా స్థిరంగా ఉంచాలన్న దానిపై దేశాలు దృష్టి సారించనున్నాయి.

ఇదీ చదవండి: సౌదీపై దాడి ఎఫెక్ట్‌.. హౌతీలకు దిమ్మతిరిగే షాక్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement