
శరవేగంగా సాగుతున్న పూడ్చివేత పనులు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నగరంలోని ఓ రహదారిపై బుధవారం ఉన్నట్టుండి భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. చుట్టుపక్కల నిర్మాణాలు, భవనాలకు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. ఒక పోలీస్‌స్టేషన్‌ను, ఆస్పత్రి ఔట్‌పేషెంట్ వార్డును మూసివేశారు. విద్యుత్, నీటి సరఫరాను ఆపారు. రోడ్డుపై పేద్ద సింక్‌హోల్ ఏర్పడటంతో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి.
ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూగర్భ రైలు మార్గం నిర్మాణ పనుల వల్లే రహదారి కుంగినట్లుగా భావిస్తున్నామని వెల్లడించారు. రోడ్డు నెమ్మదిగా కుంగిపోతుండటం, ఒరిగిపోతున్న విద్యుత్ స్తంభాలు, పగిలిపోతున్న నీళ్ల పైపు లైన్లు, గుంత పెద్దదైన కొద్దీ కార్లు, తదితర వాహనాలు వెనక్కి మళ్లడం, పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం వంటి వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. గుంత ఒక అంచు సరిగ్గా పోలీస్ స్టేషన్ ఎదుట ఆగిపోయింది. భూగర్భ నిర్మాణం అందులో కనిపిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నందున గుంత మరింత విస్తరించకుండా సాధ్యమైనంత త్వరగా పూడ్చివేసే చర్యలకు యంత్రాంగం ఉపక్రమించింది.