న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో గల ఒక షిప్‌యార్డ్‌లో సంభవించిన వరుస పేలుళ్లు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మంటలను ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందిపైననే వరుసగా రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోగా, 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృత్యువు అంచున రెస్క్యూ టీమ్
షిప్‌యార్డ్‌లోని బేస్‌మెంట్‌లో ఇద్దరు కార్మికులు చిక్కుకున్నారనే సమాచారంతో అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే మొదటి పేలుడు సంభవించింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, రెండోసారి జరిగిన శక్తివంతమైన పేలుడుతో అంతా ఉలిక్కిపడ్డారు. ఈ సమయంలో లోపల ఉన్న ఫైర్ మార్షల్, ఒక అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
విషమ పరిస్థితిలో బాధితులు
రెండో పేలుడు ధాటికి ఫైర్ మార్షల్ తలకు గాయమయ్యింది. అలాగే స్వల్పంగా మెదడులో రక్తస్రావం జరగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరో అగ్నిమాపక సిబ్బంది పరిస్థితి మొదట ఆందోళనకరంగా ఉన్నా, ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా, పరిమిత స్థలాల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం అత్యంత ప్రమాదకరమని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
నియంత్రణలోకి మంటలు - దర్యాప్తు షురూ
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని 200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది చుట్టుముట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. మేయర్ జోహ్రాన్ మమ్దాని మాట్లాడుతూ, ఇది చాలా వేగంగా జరిగిన క్లిష్టమైన అత్యవసర పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణను వెంటనే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇరాన్‌పై మెరుపు దాడులకు ట్రంప్ కసరత్తు


