అమెరికా రోడ్డు ప్రమాదంలో దుర్మణం
బాధితుల్లో కలకలం
సాక్షి, హైదరాబాద్: షేర్స్ బజార్ ప్రై.లి.(ఎస్‌బీపీఎల్), కిసాన్ పరివార్ (కేపీఎల్) కంపెనీల పేరిట రూ.100 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ కంపెనీ డైరెక్టర్, ప్రిన్సిపల్ ఆఫీసర్ అట్లూరి ప్రసన్న (25) అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రసన్న న్యూయార్క్‌లోని షుయ్లర్ కౌంటీలో ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నతో పాటు మరో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రసన్న.. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో గత నెల 15న నమోదైన చీటింగ్ కేసులో నిందితురాలు.
అల్గారిథమ్ ఆధారిత స్టాక్ ట్రేడింగ్, సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభాలు అందిస్తామని పెట్టుబడిదారులను ఆకర్షించి.. రూ.వందల కోట్లు మోసగించారు. పెట్టుబడిదారులకు ఏడాదికి 18 నుంచి 48 శాతం వరకు అధిక లాభాలు అందిస్తామని నమ్మించిన ఈ సంస్థలు దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మందిని మోసగించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 1,500 మంది బాధితులు ఉన్నారు. గత జూన్ 15న సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదైంది.


