నుయుక్: పాములు పట్టే వాడు చివరికి పాము కాటుకే బలైనట్లు.. ట్రంప్‌నకు అధికారాన్ని తెచ్చిన మాగా (MAGA) నినాదమే గ్రీన్‌లాండ్ వీధుల్లో వ్యంగ్యంగా మారింది. ఒకప్పుడు అమెరికా గర్వానికి ప్రతీకగా నిలిచిన ఆ నాలుగు పదాలు, ఇప్పుడు నిరసనకారుల చేతిలో ఎరుపు టోపీలపై ఆయుధంగా మారాయి.
‘మాగా’ అనేది ట్రంప్ 2016 ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినిపించిన స్లోగన్. 1980లో రోనాల్డ్ రీగన్ ‘Let’s Make America Great Again’ అనే నినాదాన్ని వినిపించగా, ట్రంప్ దాన్ని ‘Make America Great Again’గా మార్చి 2015లో అధికారికంగా ట్రేడ్‌మార్క్ చేసుకున్నారు. ఎరుపు టోపీపై తెల్ల అక్షరాలతో రాసిన ఈ నినాదం ఆయన మద్దతుదారులలో ఐకానిక్ గుర్తుగా నిలిచింది.
2016లో ట్రంప్ సభల్లో మాగా నినాదం భావోద్వేగాన్ని రగిలించింది. ఒక ఆశగా, ఒక ఉద్యమంగా మారింది. మద్దతుదారులు దీన్ని అమెరికా శక్తి, జాతీయ గర్వం, సరిహద్దుల రక్షణకు ప్రతీకగా చూశారు. విమర్శకులు మాత్రం దీన్ని విభజనాత్మకంగా భావించారు.
అనూహ్యంగా, డెన్మార్క్.. గ్రీన్‌లాండ్‌లో ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కొత్త రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘Make America Great Again’ కాస్తా అక్కడి వీధుల్లో ‘Make America Go Away’గా మారింది. ఈ నినాదంతో ఎరుపు రంగు టోపీలు ధరించి ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో మంచులో గడ్డకట్టే స్థితిలో వేలాది మంది ప్రజలు ఈ టోపీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. గ్రీన్ లాండ్‌ను సైనికంగా స్వాధీనం చేసుకోవాలన్న వ్యాఖ్యలు, అలాగే యూరప్‌పై కొత్త టారిఫ్‌లు విధించాలన్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. ఈ నిరసనలో పాల్గొన్నవారు అమెరికా అధ్యక్షుడి విధానాలను వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ, గ్రీన్ లాండ్ స్వతంత్రతను కాపాడాలని గట్టిగా నినదించారు.
నిరసనకారులు కేవలం అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకే కాకుండా, ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనతో కూడా వీధుల్లోకి వచ్చారు. యూరప్‌లోని అనేక దేశాలు కూడా డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌కు మద్దతు తెలుపుతూ..ట్రంప్ చర్యలు పాశ్చాత్య భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించాయి.
మొత్తం మీద, ట్రంప్ గ్రీన్‌లాండ్ స్వాధీనం ప్రయత్నాలు యూరప్‌లో తీవ్ర ప్రతిఘటనకు దారితీశాయి. ‘Make America Go Away’ క్యాప్స్ ఇప్పుడు గ్రీన్‌లాండ్, డెన్మార్క్ ప్రజల నిరసనకు ప్రతీకగా మారాయి. ఇది కేవలం సెటైరికల్ నినాదం మాత్రమే కాదు.. అమెరికా విధానాలపై యూరప్ ప్రజల అసహనాన్ని స్పష్టంగా చూపించే చిహ్నంగా నిలిచింది.


