‘ఒరెష్నిక్ హైపర్‌సోనిక్‌’తో రష్యా భీకరదాడులు | Large scale Russian attack on Ukraine leaves four dead and dozens injured | Sakshi
Sakshi News home page

‘ఒరెష్నిక్ హైపర్‌సోనిక్‌’తో రష్యా భీకర దాడులు

May 24 2026 3:21 PM | Updated on May 24 2026 6:59 PM

Large scale Russian attack on Ukraine leaves four dead and dozens injured

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున దాడులు చేసింది. కొన్ని వందల డ్రోన్లు, డజన్లకొద్దీ క్షిపణులను ప్రయోగించింది. కీవ్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నలుగురు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఆ ప్రాంతమంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇళ్లకు, పాఠశాలలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

బిలా సెర్క్వా నగరంపై జరిగిన దాడిలో ఒరెష్నిక్ హైపర్‌సోనిక్ క్షిపణి వాడినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఆ నగరం కీవ్ ప్రాంతంలో ఉంది. ఒరెష్నిక్ హైపర్‌సోనిక్ క్షిపణి శబ్ద వేగం కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.

ఉక్రెయిన్ శుక్రవారం స్టారోబిల్స్క్ పట్టణంలోని విద్యార్థుల వసతి గృహంపై దాడి చేసిందని ఆరోపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. చెప్పినట్లే ఆదివారం దాడులు చేశారు. రష్యా దాడులు చేయడానికి ముందే జెలెన్‌ స్కీ మాట్లాడుతూ.. తమ దేశంపై దాడి చేసే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. 

రష్యా ఒరెష్నిక్ క్షిపణి వాడే అవకాశం ఉందని ఉక్రెయిన్ నిఘా సంస్థలకు సమాచారం వచ్చినట్టు కూడా ఆయన చెప్పారు. ఆ క్షిపణిని అడ్డుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ఉక్రెయిన్ జాతీయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీవ్ ప్రాంతంలో 50కు పైగా చోట్ల దాడి జరిగింది. ఇళ్లు, షాపింగ్ కేంద్రాలు, అత్యవసర సేవల భవనాలు, పోలీస్ భవనాలు దెబ్బతిన్నట్టు సమాచారం.

నీటి సరఫరా కేంద్రంపై కూడా దాడి జరిగినట్టు జెలెన్‌స్కీ చెప్పారు. “రాజధానిపై భారీ బాలిస్టిక్ దాడి జరిగింది. ఇంకా దాడులు జరిగే అవకాశం ఉంది” అని కీవ్ సైనిక పరిపాలన అధిపతి టిమూర్ ట్కాచెంకో టెలిగ్రామ్‌లో గత అర్ధరాత్రి తర్వాత పోస్ట్‌ చేశారు.

కీవ్ మేయర్ విటలి తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చిన్నారులు సహా 30 మంది ఆసుపత్రిలో చేరారు. మధ్య షెవ్చెంకో జిల్లాలో 9 అంతస్తుల భవనంపై దాడి జరిగింది. పై అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఒకరు చనిపోయారు.

అదే జిల్లాలో పాఠశాల వద్ద ఉన్న ఎయిర్ రైడ్ షెల్టర్ సమీపంలో దాడి జరిగింది. శిథిలాలు పడటంతో ప్రవేశ ద్వారం మూసుకుపోయింది. పలువురు లోపల చిక్కుకున్నారు. ఎమర్జెన్సీ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాలకు చేరుకుని మంటలు ఆర్పారు. శిథిలాలను తొలగించారు. గాయపడిన వారికి చికిత్స అందించారు.

రాజధాని చుట్టూ ఉన్న కీవ్ ప్రాంతంలో మరో ఇద్దరు చనిపోయినట్టు ప్రాంతీయ అధిపతి మైకోలా కలాష్నిక్ తెలిపారు. కీవ్ బయట చెర్కాసీ, ఖార్కివ్, క్రోపీవ్నిట్స్కీ, ఒడెసా, పోల్టావా, సుమీ, జైటోమిర్ ప్రాంతాలపైనా దాడులు జరిగాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబియా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement