మళ్లీ హైకమిషన్‌ వద్ద ఉద్రిక్తత

Khalistani protestors attack Indian High Commission in UK once again - Sakshi

ఖలిస్తాన్‌ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేసిన వేర్పాటువాదులు

అప్రమత్తతతో దాడి యత్నాన్ని అడ్డుకున్న లండన్‌ పోలీసులు

లండన్‌: ఖలిస్తానీ మద్దతుదారుల దాడితో ఘటనకు కేంద్ర బిందువుగా మారిన లండన్‌లోని భారతీయ హైకమిషన్‌ వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం భారతీయ హైకమిషన్‌పై దాడికి తెగబడిన ఘటన మరువకముందే మళ్లీ దాదాపు 2,000 మందితో కూడిన ఆ వేర్పాటువాద మూక అదే భవంతి సమీపానికి చేరుకుంది. ఖలిస్తాన్‌ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేసిన వేర్పాటువాదులు వెంట తెచ్చుకున్న రంగులు వెదజల్లే చిన్న బాణసంచా, నీళ్ల సీసాలు, కొన్ని వస్తువులను హైకమిషన్‌ భవంతిపైకి విసిరారు.

ఆదివారం నాటి దుశ్చర్యతో అప్రమత్తమైన లండన్‌ పాలనా యంత్రాంగం భారీ సంఖ్యలో పోలీసులను అంతకుముందే అక్కడ మొహరించడంతో వేర్పాటువాదుల భారీ దాడి యత్నాలు ఆచరణలో విఫలమయ్యాయి. అమృత్‌పాల్‌ అరెస్ట్‌కు కంకణం కట్టుకున్న పంజాబ్‌ పోలీసుల చర్యను నిరసిస్తూ ఫెడరేషన్‌ ఆఫ్‌ సిఖ్‌ ఆర్గనైజేషన్స్, సిఖ్‌ యూత్‌ జతేబందియా వంటి సంస్థలు ఉమ్మడిగా ‘నేషనల్‌ ప్రొటెస్ట్‌’ పేరిట బ్యానర్లు సిద్ధంచేసి భారతీయ హైకమిషన్‌ వద్ద దాడికి కుట్ర పన్నినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.

నిరసనకారులను అదుపులోకి తీసుకుని తరలించేందుకు దాదాపు 20 బస్సులను పోలీసులు తెప్పించారు. అప్రమత్తతలో భాగంగా కొందరు పోలీసులను అక్కడి వీధుల్లో కవాతుచేశారు. ఖలిస్తానీవాదులు అక్కడికి రాగానే పంజాబ్‌లో మానవహక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఇంగ్లిష్, పంజాబీ భాషల్లో మైకుల్లో భారత వ్యతిరేక ప్రసంగాలు ఇచ్చారు. నిరసనకారుల్లో చిన్నారులు, మహిళలూ ఉండటం గమనార్హం. భారత్‌ తమను వేర్పాటువాదులని, పాక్‌ ఐఎస్‌ఐతో కుమ్మక్కయ్యారని ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు.  
భారత్‌ హైకమిషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఖలిస్తానీ మద్దతుదారులు 

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top