Israel-Hamas war: కొనసాగుతున్న దాడులు | Israel-Hamas war: Israeli airstrikes crush apartments in Gaza refugee camp | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న దాడులు

Nov 3 2023 4:46 AM | Updated on Nov 3 2023 4:46 AM

Israel-Hamas war: Israeli airstrikes crush apartments in Gaza refugee camp - Sakshi

జెరూసలేం: గాజాలో హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్‌ పదాతి దళాలు మరింత ముందుకు చొచ్చుకెళ్తున్నాయి. మిలిటెంట్ల కోసం వీధుల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. హమాస్‌ మిలిటెంట్లకు గట్టి పట్టున్న గాజా సిటీ దిశగా సైన్యం కదులుతోంది. గాజా భూభాగంలో వైమానిక దాడులు సైతం యథావిధిగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి సెంట్రల్‌ గాజాలో బురీజ్‌ శరణార్థి శిబిరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేయడంతో 15 మంది మృతిచెందారు.

పదుల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకున్నారు. గాజాలో తమ సైన్యంపై హమాస్‌ మిలిటెంట్లు యాంటీ ట్యాంక్‌ మిస్సైళ్లు, గ్రనేడ్లు ప్రయోగించారని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను ఆపడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విషయంలో అమెరికాతోపాటు అరబ్‌ దేశాలు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌తోపాటు హమాస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

యుద్ధానికి కనీసం విరామం అయినా ఇవ్వాలని ఇరుపక్షాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, సాధారణ ప్రజల ప్రాణాలను హరించడం తగదని ఆయన పరోక్షంగా తేలి్చచెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్నారు. జోర్డాన్‌ ప్రభుత్వం ఇజ్రాయెల్‌లోని తమ రాయబారిని వెనక్కి రప్పించింది. యుద్ధం ముగిసేదాకా తమ దేశానికి రావొద్దని ఇజ్రాయెల్‌ రాయబారికి సూచించింది.  

గాజాలో 9 వేలు దాటిన మృతులు  
ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,061 మంది పాలస్తీనియన్లు మరణించారని, 32,000 మందికిపైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ అష్రాఫ్‌ అల్‌–ఖుద్రా గురువారం వెల్లడించారు. మృతుల్లో 3,760 మంది 18 ఏళ్లలోపు వారేనని చెప్పారు. ఇవన్నీ అధికారిక గణాంకాలే. వాస్తవానికి ఇంకా ఎంతమంది చనిపోయారో అధికారులు చెప్పలేకపోతున్నారు. గాజాలో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా మరణించి ఉండొచ్చని తెలుస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ దాడులతోపాటు అంతర్గత ఘర్షణల్లో 130 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా బలయ్యారు.  

ఈజిప్టుకు మరో 100 మంది..  
విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నవారు గాజా నుంచి ఈజిప్టుకు వెళ్లిపోతున్నారు. బుధవారం 335 మంది వెళ్లగా, గురువారం మరో 100 మంది రఫా సరిహద్దును గుండా ఈజిప్టులో అడుగుపెట్టారు. అంతేకాకుండా గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో గాయపడిన 76 మంది పాలస్తీనియన్లు వారి సహాయకులతో కలిసి ఈజిప్టు చేరుకున్నారు. వారికి ఈజిప్టులో చికిత్స అందించనున్నారు. గాజాలో ప్రస్తుతం దాదాపు 400 మంది అమెరికన్లు ఉన్నారు. వారందరినీ క్షేమంగా స్వదేశానికి చేర్చడానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు             సాగిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement