హమాస్ మిలిటరీ చీఫ్ హతం.. ఇజ్రాయెల్ ప్రకటన! | Israel Eliminates Hamas Military Chief Muhammad Odeh in Targeted Gaza Strike | Sakshi
Sakshi News home page

హమాస్ మిలిటరీ చీఫ్ హతం.. ఇజ్రాయెల్ ప్రకటన!

May 27 2026 8:01 AM | Updated on May 27 2026 8:52 AM

Israel Eliminates Hamas Military Chief Muhammad Odeh in Targeted Gaza Strike

టెల్‌ అవీవ్‌: గాజాలో హమాస్ మిలిటరీ విభాగం నూతన అధిపతి ముహమ్మద్ ఒదేను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అక్టోబర్ 7 నాటి దాడుల రూపకర్తలలో ఒకడైన ముహమ్మద్ ఒదే హతంకావడం హమాస్ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బగా మారింది. గాజా- లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం.

హమాస్‌కు కోలుకోలేని దెబ్బ
ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్‌) అందించిన సమాచారం ప్రకారం వారం రోజుల క్రితమే హమాస్ మిలిటరీ విభాగం బాధ్యతలు చేపట్టిన ముహమ్మద్ ఒదేను ఇజ్రాయెల్ దళాలు లక్ష్యంగా చేసుకుని అంతమొందించాయి. గతంలో హమాస్ ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహించిన ఒదే, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన భీకర దాడుల్లో కీలక పాత్ర పోషించారని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. గతంలో హతమైన ఎజ్జెద్దీన్ అల్-హద్దాద్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఒదే ప్రాణాలు కోల్పోవడం హమాస్ వ్యూహకర్తలను  ఆందోళనకు గురిచేస్తోంది.

లెబనాన్‌లో తీవ్రతరం
ఒకవైపు గాజాలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుండగా, మరోవైపు దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేసింది. బుర్జ్ రహాల్, టైర్ జిల్లాలోని కౌథరియత్ అల్-రుజ్, సరిఫా వంటి ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. తాజా దాడుల్లో సుమారు 31 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో లెబనాన్‌లోని కీలక స్థావరాలపై ఇజ్రాయెల్ పట్టుబిగిస్తోంది.

నెతన్యాహు కఠిన ఆదేశాలు
హిజ్బుల్లా గ్రూపు దాడులను తిప్పికొట్టేందుకు, ఇజ్రాయెల్ రక్షణ దళాలకు ప్రధాని నెతన్యాహు పూర్తి స్థాయి యుద్ధ సంకేతాలిచ్చారు. ఇటీవల 600 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని వెల్లడించిన ఆయన, దాడుల వేగాన్ని ఏమాత్రం తగ్గించవద్దని, మరింత దూకుడుగా వ్యవహరించాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అమెరికా మద్దతుతో తన సైనిక వ్యూహాలను పదును పెట్టిన ఇజ్రాయెల్, ప్రాంతీయంగా తన ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది.

ఇది కూడా చదవండి: యూపీలో ముందస్తు ముచ్చట?
 

Advertisement
 
Advertisement
Advertisement