ఇరాన్‌ రాడార్లను ధ్వంసం చేసిన అమెరికా  | Iran fires missiles at Gulf after US targets Iranian radar sites | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ రాడార్లను ధ్వంసం చేసిన అమెరికా 

Jun 7 2026 4:24 AM | Updated on Jun 7 2026 4:24 AM

Iran fires missiles at Gulf after US targets Iranian radar sites

కువైట్, బహ్రెయిన్‌లపైకి ఇరాన్‌ క్షిపణి దాడులు 

బ్రిడ్జివాటర్‌: అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. తమ రాడార్‌ స్టేషన్లను అమెరికా ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగా కువాయిట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపైకి క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్‌ శనివారం ప్రకటించింది. అయితే, తమ గల్ఫ్‌ అరబ్‌ మిత్ర దేశాలపైకి ఇరాన్‌ ప్రయోగించిన పలు క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా మిలటరీ తెలిపింది.

 శుక్రవారం రాత్రి కువైట్, బహ్రెయిన్‌ భూభాగాల్లోకి ప్రవేశించిన ఏడింటికిగాను ఆరు బాలిస్టిక్‌ మిస్సైళ్లను మధ్యలోనే కూల్చినట్లు తెలిపింది. మరో క్షిపణి దారి తప్పి, లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైందని పేర్కొంది. వీటి కారణంగా అమెరికా బలగాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. హార్మూజ్‌ జలసంధిపైకి ఇరాన్‌ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అంతకుముందు అమెరికా ఆర్మీ కూల్చివేసింది.

 ఆ ప్రాంతంలో నౌకల సంచారానికి ముప్పుగా పరిణమించినందునే ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. అదేవిధంగా, మరిన్ని దాడులకు పాల్పడకుండా ఇరాన్‌ రాడార్‌ కేంద్రాలను నిరీ్వర్యం చేసినట్లు పేర్కొంది. అదేవిధంగా, తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్‌ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నాయని కువైట్‌ తెలిపింది. క్షిపణుల దాడిని ముందుగానే పసిగట్టి సైరన్ల ద్వారా తమ పౌరులను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించినట్లు బహ్రెయిన్‌ వివరించింది.

 కాగా, ఖెష్మ్‌ దీవి, ఆ సమీపంలోని సిరిక్‌లో ఏర్పాటు చేసుకున్న నిఘా వ్యవస్థల్ని అమెరికా ధ్వంసం చేసినందుకే తాము కువైట్‌లోని అమెరికా బలగాలున్న అలీ అల్‌ సలేమ్‌ ఎయిర్‌ బేస్‌ను, బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని, మిస్సైళ్లు ప్రయోగించినట్లు అనంతరం ఇరాన్‌ ఆర్మీ తెలిపింది. ఇరాన్‌ హార్మూజ్‌ను మూసివేయడంతో, బదులుగా ఇరాన్‌ నౌకాశ్రయాల్లో అమెరికా ఆర్మీ దిగ్బంధనం అమలు చేస్తుండటం తెల్సిందే.

 ఇలా ఉండగా, అమెరికాలోని విస్కాన్సిన్‌లో శుక్రవారం అధ్యక్షుడు ట్రంప్‌ కొందరు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..ఇరాన్‌తో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరలో ముగించబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఎరువుల ధరలు నాలుగు నెలల క్రితం స్థాయికి దిగి వస్తాయని వారికి చెప్పారు. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్‌ వద్ద ఉన్న క్షిపణులు చాలామటుకు ధ్వంసం అయినప్పటికీ ఇంకా 22 శాతం వరకు భద్రంగానే ఉన్నట్లు సమాచారముందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement