ఇరాన్‌ భారీ షాక్‌.. కువైట్‌లో హైఅలర్ట్‌ | Iran Attack Effect high alert at Kuwait | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ భారీ షాక్‌.. కువైట్‌లో హైఅలర్ట్‌

Jun 4 2026 7:59 AM | Updated on Jun 4 2026 8:54 AM

Iran Attack Effect high alert at Kuwait

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పీక్‌ స్టేజ్‌ చేరుకున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్​ దాడులు చేసింది. కాగా, ఇరాన్‌ దాడితో కువైట్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. దాడిలో విమానాశ్రయ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. కాగా, అమెరికా-ఇరాన్‌ సీజ్‌ఫైర్‌ తర్వాత ఇదే అతిపెద్ద దాడి కావడం గమనార్హం. 

ఇక, ఇరాన్‌ దాడుల కారణంగా కొన్ని గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేశారు. అనంతరం 4వ టెర్మినల్‌లో కార్యకలాపాలు ప్రారంభించినట్టు అధికారులు చెప్పారు. అయితే, బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడులతో దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను మోగాయి. దాడులు నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి తరలివెళ్లాలని బహ్రెయిన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కువైట్ తీసుకున్న చర్యలు
దాడుల నేపథ్యంలో వైమానిక రక్షణ వ్యవస్థలను కువైట్‌ ప్రభుత్వం పూర్తిగా యాక్టివేట్ చేసింది. ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేసింది. అనుమానాస్పద వస్తువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించింది. కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచింది. ప్రస్తుతం కువైట్‌ అంతటా హైఅలర్ట్‌ కొనసాగుతోంది. మరిన్ని దాడులు జరిగే అవకాశంపై భద్రతా సంస్థలు నిఘా కొనసాగిస్తున్నాయి. వైమానిక రక్షణ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.

భారతీయులకు ప్రమాదమా?
ప్రస్తుతం కువైట్‌లో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సాధారణ ప్రజలపై ప్రత్యేక దాడులు జరిగినట్లు సమాచారం లేదు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున అధికారిక సూచనలను పాటించడం అవసరం. కొన్ని విమాన సర్వీసులు తాత్కాలికంగా ప్రభావితమయ్యాయి. మరోవైపు.. ఇరాన్‌ జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ధ్రువీకరించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే, మృతుని కుటుంబంతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. బాధిత కుటుంబానికి, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాధ్యమైనంత మేరకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు కువైట్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉండగా.. కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్‌ సైన్యం వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడిలో విమానాశ్రయ కార్మికులు, ప్రయాణికులతో సహా కనీసం 63 మంది గాయపడ్డారని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement